
మమతా బెనర్జీకి బీజేపీ అసంతృప్త నాయకుడు శత్రుఘ్నసిన్హా ఝలక్ ఇచ్చారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ అసంతృప్త నాయకుడు శత్రుఘ్నసిన్హా ఝలక్ ఇచ్చారు. ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన అంగీకరించలేదు. మమత ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో కలిసి కోల్‌కతాలో విపక్ష ర్యాలీకి ఆయన హాజరయ్యారు. (మమతా బెనర్జీ మెగా ర్యాలీ)
‘వాస్తవంగా చెప్పాల్సివస్తే మమతా బెనర్జీ జాతీయ నాయకురాలు. రాజకీయాల్లో తానేంటో నిరూపించుకున్నారు. అయితే ఆమె ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేయడానికి మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఇచ్చిన మాటపై నిలబడగలగాలి. తర్వాతి ప్రధానమంత్రి ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది నా పని కాద’ని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.
సొంత పార్టీపై తరచుగా విమర్శలు చేస్తున్న సిన్హా.. తాను బీజేపీ ఎంపీగా ఇక్కడకు రాలేదని చెప్పారు. యశ్వంత్ సిన్హా నాయకత్వంలో ఏర్పాటైన రాష్ట్ర మంచ్ తరపున ర్యాలీకి హాజరైనట్టు వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం వివాదంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.