పీఎన్‌బీ, ముంబై శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం విషయంలో మరోసారి బీజేపీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్నసిన్హా నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన పీఎన్‌బీ నాలుగేళ్లుగా కుంభకోణం యథేచ్ఛగా సాగుతున్నా.. కేంద్రం ఎందుకు ఏమీ తెలియనట్టు ఉండిపోయిందని ప్రశ్నించారు. ప్రముఖ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్‌బీను రూ. 12వేల కోట్ల మేర ముంచేసి.. విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి పీఎన్‌బీ ఆడిటర్లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడాన్ని తప్పుబట్టారు. సంస్థ ఆడిటర్లను తప్పుబడుతూ.. బ్యాంకులోని చిన్న చిన్న ఉద్యోగులను సైతం ఈ స్కాంలో అరెస్టు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘థ్యాంక్ గాడ్.. వాళ్లు ప్యూన్ వదిలేశారు’ అని ట్వీట్ చేశారు.
‘మన విద్యావంతులు నెహ్రూ పాలన నుంచి కాంగ్రెస్ తప్పుడు పాలన వరకు ప్రతి ఒక్కరినీ నిందిస్తారు. అదేవిధంగా పీఎన్‌బీ కుంభకోణానికి ఆడిటర్లు కారణమని నిందించారు. అదృష్టవశాత్తు వారు ప్యూన్‌ను విడిచిపెట్టారు. అసలైన ప్రశ్న ఏమిటంటే.. పీఎన్‌బీ నిజమైన యజమాని అయిన ప్రభుత్వం ఏంచేస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు. కుంభకోణం జరిగిన గడిచిన ఆరేళ్లలో నాలుగేళ్లు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment