పట్నా: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా(80) ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరననీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేస్తానన్నారు. బీజేపీకి చెందిన మరో తిరుగుబాటు ఎంపీ శత్రుఘ్న సిన్హాతో కలిసి శనివారం పట్నాలో జరిగిన ‘రాష్ట్రీయమంచ్’ కార్యక్రమంలో మాట్లాడారు. పార్టీ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పటి అల్లకల్లోల పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు.
మహారాష్ట్రలో రైతుల ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం అన్నదాతలను అడుక్కునే స్థాయికి దిగజార్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మొదట్నుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్న యశ్వంత్ సిన్హా.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు జనవరిలో రాష్ట్రీయమంచ్ పేరిట రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. సిన్హా నిర్ణయం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, తాము ముందే ఊహించామని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఆదేశాల ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment