లక్నో : బీజేపీ నాయకత్వంతో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తాను తిరిగి పట్నా సాహిబ్ స్ధానం నుంచే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిర్ణయంతో నిమిత్తం లేకుండా తాను నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తాను పోటీ చేసే నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదన్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పలు అంశాలపై సిన్హా పార్టీ అగ్రనాయకత్వంతో విభేదిస్తున్న సంగతి తెలిసిందే.
నోట్ల రద్దు, జీఎస్టీ సహా పలు నిర్ణయాలపై సిన్హా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలో జరిగిన బీజేపీ వ్యతిరేక ర్యాలీలో పాల్గొని స్టార్ స్పీకర్‌గా విపక్షాల ప్రశంసలు అందుకున్నారు.మరోవైపు తన భార్య పూనం సిన్హాను యూపీలోని లక్నో నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై పోటీకి నిలిపేందుకు శత్రుఘ్న సిన్హా యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో ఇటీవల లక్నోలో సిన్హా భేటీని ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ధ్రువీకరించని సిన్హా దీన్ని తోసిపుచ్చలేనని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సిన్హా ఎస్పీ టికెట్‌పై పోటీలో ఉంటారని భావిస్తున్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment