ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ఉదయం 11.30 గంటలకు కాకినాడలోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ర్యాంకుల రూపంలో విడుదల చేశారు. మొత్తం 77.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే ముందంజలో నిలిచారు. బాలికలు 82.32 శాతం, బాలురు 74.44 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎంసెట్‌లో వచ్చిన మార్కులకు ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం వెయిటేజీ ఇస్తూ ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లక్కసాని వేణుగోపాలరెడ్డి, జెఎన్‌టియుకె విసి, ఎంసెట్-2015 చైర్మన్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ పాల్గొన్నారు. కాగా జూన్ 1న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఈనెల 8న ఏపి ఎంసెట్-2015ను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీని ఈనెల 10వ తేదీన జెఎన్‌టియుకె విడుదల చేసింది. ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం ఫలితాలను ఈనెల 26న ప్రకటించాల్సి ఉంది. అయితే నిర్దేశించిన సమయం కంటే ఐదు రోజులు ముందుగా ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. www.apeamcet.org