విశాఖ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు మాదిరిగానే ఏపీ సర్కార్కు కూడా విడిగానే ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 10న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సొంతగానే ఎంసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్ నిర్వహణను కాకినాడ జేఎన్టీయూకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా చర్చలు జరిపినా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఎంసెట్కు ఒప్పుకోలేదని గంటా అన్నారు. ఎంసెట్పై పలుసార్లు గవర్నర్తో పాటు తెలంగాణ విద్యాశాఖమంత్రిని కలిశామన్నారు. ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్నారు. అలాగే మిగతా ప్రవేశ పరీక్షల తేదీలను ఆయన ప్రకటించారు.
విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉన్నా.. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుందని, విద్యార్థుల భవిష్యత్ ను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రమని, వాటికన్ సిటీలా ప్రత్యేక పరిధిలు లేవని గంటా వ్యాఖ్యానించారు.
మే 10న ఏపీ ఎంసెట్: గంటా
Published Wed, Feb 25 2015 9:10 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
Advertisement