కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే కీలకం. వారి ఓటుపైనే నాయకుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తమకు మేలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో నాయకులకు ఓట్లేసి గెలిపిస్తుంటారు. గెలిచిన తర్వాత వారి ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. అయితే.. ఆ బాధ్యతను విస్మరించి, సొంత ‘వ్యాపకాల’కే పరిమితమైతే మాత్రం దాని పర్యవసానాలు ఆలస్యంగానైనా ఎదుర్కోక తప్పదు. తమలోని అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపెడతారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగిందంటే అది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను సూచిస్తోందని విశ్లేషిస్తున్నారు.
ఈసారి మండు వేసవిలో ఎన్నికలు జరిగాయి. సూరీడు నిప్పులు కక్కుతున్నప్పటికీ జనం మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఓటింగ్ జాప్యమైనా జనంలో మాత్రం ఓటు వేయాలన్న సంకల్పం సడలలేదు. ఓపికతో వేచివుండి, తమకు ఇష్టమైన అభ్యర్థికి ఈవీఎంలో ఓటేసి..అది కరెక్ట్‌గా పడిందా, లేదా అనే విషయాన్ని వీవీప్యాట్ ద్వారా నిర్ధారించుకుని మరీ వెళ్లారు. ఓటర్లలో ఇంత పెద్దఎత్తున చైతన్యం రావడం స్పష్టమైన ‘మార్పు’నకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పెరిగిన ఓటింగ్
2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో జిల్లాలో 30,56,867 మంది ఓటర్లకు గాను 22,57,975 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 74గా నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 31,72,413 మంది ఓటర్లు ఉండగా.. 24,64,492 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 77.73కు పెరిగింది.
అంటే 3.73 శాతం పెరుగుదల కన్పించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా పోల్ కావడం వల్లే ఇది సాధ్యమైందన్న అభిప్రాయం ప్రజలు, మేధావుల్లో వ్యక్తమవుతోంది. కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఆశాజనకంగానే ఉంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2014లో కేవలం 58 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి దీన్ని 65 శాతానికి పెంచాలనుకున్న అధికారులు.. స్వీప్ కార్యక్రమాలను చేపట్టారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. 59.53 శాతానికే పరిమితమైంది.
ఎంపీ అభ్యర్థులకు ఓటేయని వైనం
ఈ సారి ఓటర్లు భిన్నంగా వ్యవహరించారు. సాధారణంగా పార్లమెంటు, అసెంబ్లీకి ఒకే విధంగా పోలింగ్ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం అసెంబ్లీకి ఒక రకంగా, పార్లమెంటుకు మరో రకంగా ఓట్లు పోల్ అయ్యాయి. కర్నూలు పార్లమెంటు పరిధిలోని కోడుమూరు అసెంబ్లీ సెగ్మెంటులో పార్లమెంటు అభ్యర్థులకు ఒక రకంగా, అసెంబ్లీ అభ్యర్థులకు మరో రకంగా ఓట్లు పోల్ కావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి 79.52 శాతం ఓట్లు పోల్ కాగా.. పార్లమెంటుకు వచ్చేసరికి 78.77 శాతానికి పరిమితం కావడం గమనార్హం.
అసెంబ్లీకి సంబంధించి పురుషులు 87,178 మంది ఓటు వేయగా.. పార్లమెంటుకు మాత్రం 86,465 మంది వేశారు. మహిళల్లో అసెంబ్లీకి 84,665 మంది, పార్లమెంటుకు 83,740 మంది మాత్రమే ఓటు వేశారు. దీన్నిబట్టి చూస్తే 1,638 మంది ఓటర్లు కేవలం అసెంబ్లీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేసి.. పార్లమెంటు అభ్యర్థులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలోనూ స్వల్పంగా ఈ పరిస్థితి ఉంది. పోలింగ్ సిబ్బంది విధిగా ప్రతి ఓటరుతో ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంటుకు ఓట్లు వేయించాల్సి ఉంది. అయితే.. ఈ విషయాన్ని పట్టించుకున్నట్లుగా లేదు.
నంద్యాల పరిధిలో ఓటెత్తారు!
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 16,00,459 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 7,89,553, మహిళలు 8,10,572 మంది, ఇతరులు 334 మంది ఉన్నారు. ఇందులో 80.15 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 6,36,213 మంది, మహిళలు 6,46,432 మంది , ఇతరులు 71 మంది..మొత్తంగా 12,82,716 మంది ఓట్లు వేశారు. 2014లో ఇక్కడ 76 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లి, డోన్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది.
కర్నూలు పరిధిలోనూ వెల్లువెత్తిన చైతన్యం
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 72 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఇది 75.93 శాతానికి పెరిగింది. పార్లమెంటు పరిధిలో 7,85,694 మంది పురుషులు, 7,86,061 మంది మహిళలు, 199 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో పురుషులు 5,96,991, మహిళలు 5,84,764 మంది, ఇతరులు 21 మంది ఓటు వేశారు. మొత్తం 11,81,776 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం సెగ్మెంట్లలో పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆర్‌యూ పీజీ పరీక్షలు వాయిదా
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి జరగాల్సిన పీజీ రెండో సెమిస్టర్, ఎల్‌ఎల్‌బీ 4,6,8,10 సెమిస్టర్, ఎమ్‌ఎసీఏ 4, పీజీ డిప్లమా ఇన్ యోగా రెండు, ఎమ్‌బీఏ 2,4,6 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆర్‌యూ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ సి.వి. కృష్ణారెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేసుకోవడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నింటినీ జూన్ 4వ తేదీ నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల తేదీలను వర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment