రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చెత్తపాలన సాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు విమర్శించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో ‘మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు మార్చాలని’ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూములపై ఆంక్షలు విధించి ధరలు అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పచ్చదనం, వ్యవసాయ పరిరక్షణ అంటూ ముద్దు పేర్లతో రైతులను మోసగిస్తోందన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 42 మండలాల్లో అగ్రికల్చర్ జోన్ పేరిట అంక్షలు విధించిందన్నారు. 800 గ్రామాల్లో సుమారు 13 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ పరిరక్షణ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. ప్రభుత్వం సింగపూర్, జపాన్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసి రైతులను విస్మరిస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్, అభ్యంతరాలపై విడుదల చేసిన నోటిఫికేషన్‌పై రైతులకు అవగాహన ఉండకూడదనేదే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశమన్నారు. మాస్టర్‌ప్లాన్‌పై ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటుచేసే లోపే రక్షణ వేదిక ఆధ్వర్యంలో 42మండలాల్లో యాత్రలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోపు నియోజకవర్గస్థాయి యాత్రలు, 20లోపు మండలస్థాయి సదస్సులు, 29 నాటికి అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం పది అవగాహన సదస్సులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని, వ్యవసాయ పరిరక్షణ జోన్‌గా ప్రకటించిన అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించేలా ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
నిబంధనలు మార్చాలి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.కేశవరావు మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు సమూలంగా మార్చాలని డిమాండ్‌చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రతి మండలంలో స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. పరిరక్షణ జోన్ నిబంధనలు తెలుగులో అనువదించి ప్రతి పంచాయతీ కార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌ను స్వదేశీ నిపుణులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు, రైతు సంఘాలతో చర్చించి రూపొందించాలని డిమాండ్‌చేశారు.