సాక్షి, హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోరుతూ గత ఇరవై రోజులుగా సమ్మె చేసిన జూనియర్ వైద్యులు సోమవారం నుంచి విధులకు హాజరు కానున్నారు. తమ సమస్యల పరిష్కారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలో కోర్టుపై గౌరవంతో విధుల్లోకి వస్తున్నట్టు జూడాలు పేర్కొన్నారు. సోమవారం నుంచి సాధారణ, అత్యవసర సేవల్లో పాల్గొంటామని తెలిపారు. 2011లో ప్రభుత్వానికి, జూడాలకు మధ్య ఒప్పందం జరిగినా అందులోని ఒక్క సమస్యనూ పరిష్కరించకపోవడం వల్లనే సమ్మెకు దిగినట్టు వెల్లడించారు. ఏడాది గ్రామీణ సర్వీసులు కాకుండా శాశ్వత ఉద్యోగాలు (పల్లెల్లో పనిచేయడానికి) ఇవ్వాలని, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా అభ్యర్థుల నుంచి రూ.2.9 లక్షలకు మించి వసూలు చేయకూడదని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జీవో నెం.834 ద్వారా కాకుండా పాత పద్ధతిలో కొనసాగించాలని, ప్రభుత్వానికి, జూడాలకు మధ్య జరిగిన ఒప్పందంలోని అంశాలను తక్షణమే పరిశీలించాలనే డిమాండ్లతో జులై 29న జూడాలు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని సమ్మె కారణంగా రోగులు ఇబ్బంది పడుతున్నారని, పదేపదే సమ్మె చేయడం సరికాదని, జూడాలు తక్షణమే విధుల్లోకి రావాలని ఆదేశించింది. అలాగే జూడాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో సమావేశమైన జూడాలు.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో జూనియర్ వైద్యులు వంశీకృష్ణ, ఇమ్రాన్, హరిప్రసాద్, కిరీటి, ముత్యంరెడ్డి, రాజేష్, ప్రసన్న, జయదీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది...
జూనియర్ వైద్యుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నామని జూనియర్ వైద్యుల సంఘం ప్రభుత్వానికి ఆదివారం లేఖ రాసింది. జూడాల సమస్యలపై ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వేసిన పిల్ నెం.391/13 అలాగే ఉందని, మొన్నటి తీర్పులో సైతం సమస్యల పరిష్కారంపై హైకోర్టు మండిపడిన విషయాన్ని సర్కారు గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే జూనియర్ వైద్యుల పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
జూడాల సమ్మె విరమణ
Published Mon, Aug 19 2013 4:42 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement