
జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సమ్మె విరమించాలని జూడాలను న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా చేసే హక్కు ఉంటుందని, కోర్టు చెప్పిన తర్వాత కూడా వినకుంటే ఎలా? అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమిస్తేనే కేసు విచారణ చేపడతామని, ఆదేశాలు పాటించకుంటే చర్యలకు సిద్ధమేనా అని జూనియర్ డాక్టర్ల తరపు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది.
కాగా సమ్మెపై జూనియర్ డాక్టర్లతో చర్చించేందుకు సమయం కావాలని వారి తరపు న్యాయవాది ...కోర్టును కోరారు. దాంతో హైకోర్టు విచారణను అరగంటపాటు వాయిదా వేసింది. మరోవైపు సమ్మెపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని జూనియర్ డాక్టర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలపగా, సమ్మె అంశం కోర్టు పరిశీలనలో ఉండగా ప్రభుత్వంతో ఎలా చర్చిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.