తాము చేపట్టిన సమ్మెకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్: సమ్మెకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందిన వెంటనే స్పందిస్తామని జూడాలు తెలిపారు. జూనియర్ వైద్యులు సమ్మెను వెంటనే విరమించాలని సోమవారం హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ సమ్మె విరమించకపోతే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని విచారణ సందర్భంగా పేర్కొంది. పారిశ్రామిక, దుకాణాల చట్టం జూనియర్ డాక్టర్లకు వర్తించదని, సమ్మె చేయడానికి జూనియర్ వైద్యులు రోజువారీ కూలీలు కాదని పేర్కొంది. సమ్మె చేసే హక్కు జూడాలకు లేదని పేర్కొన్న హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. వారు అత్యవసర సేవలనూ బహిష్కరించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు వ్యాఖ్యలు నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమ్మెపై జూడాలు ప్రకటన చేసే అవకాశం ఉంది.