పూషడంలో కూలీలకు పులిహోర పొట్లాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు
సాక్షి, మచిలీపట్నం: కరోనా కోరలు చాచిన వేళ ఊరు కాని ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై కాలం వెళ్లదీస్తున్న వలస జీవికి ఊరట లభించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాంత్వన చేకూర్చింది. లాక్‌డౌన్ పరిస్థితిని జయించి సొంతూరుకు చేరేందుకు అనుమతి లభించింది. ఏటా సీజన్‌లో పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాకు వలస వస్తుంటారు. ఈ విధంగా ఇతర జిల్లాలకు చెందిన వారు 2,195 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 2,397 మంది జిల్లాలో లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయారు.
♦ ఇలా లాక్ అయిపోయిన కూలీలందరికీ ఏ లోటు రాకుండా గడిచిన 40 రోజులుగా ప్రభుత్వాదేశాలతో గ్రామీణ ప్రాంతంలో 69, అర్బన్ ప్రాంతాల్లో 22 రిలీఫ్ క్యాంపుల్లో జిల్లా యంత్రాంగం కంటికి రెప్పలా చూసుకుంది.
♦ ప్రతి ఒక్కరికీ మూడుపూటలా మంచి పౌష్టికాహారాన్ని అందించింది.
♦ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన వారికి మందులను కూడా సరఫరా చేసింది.
87 బస్సుల ఏర్పాటు..
కూలీలందరినీ వారి స్వస్థలాలకు పంపేందుకు 87 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. శుక్రవారం 14 మండలాల నుంచి 31 బస్సుల్లో 562 మందిని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాతే పంపించింది. ఇక శని, ఆదివారాల్లో మిగిలిన వారిని కూడా వారి సొంత జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
మలి విడతలో ఇతర రాష్ట్రాల వారు..
జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చందిన వారు 2,397 మంది ఉండగా, వారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు 428 మంది, ఒడిశాకు చెందిన వారు 381 మంది ఉండగా, తెలంగాణాకు చెందిన వారు 274 మంది, అండమాన్ నికోబార్ వాస్తవ్యులు 274 మంది ఉండగా.. మిగతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో మన రాష్ట్రంలో మరికొంత కాలం ఉండేందుకు 462 మంది అంగీకరించగా, 1,935 మంది తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరిని తరలించేందుకు శనివారం మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment