హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది.
డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీ ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లింపుకు అవకాశం ఉంది.
ఏప్రిల్ 25 నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేసి, మే 18న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 27న ఫైనల్ కీ, మే 28న డీఎస్సీ ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు పాత పద్ధతిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో బీఈడీ అభ్యర్థులకు నిరాశ మాత్రం తప్పడం లేదు. ఈ తాజా నోటిఫికేషన్తో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కానున్నారు.