సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్దేశపూర్వక చర్యలను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఈనెల 31లోగా ముగించకపోతే.. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లకు పైగా రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది.
కరోనా వైరస్ ప్రభావంపై చీఫ్ సెక్రటరీతో గానీ, హెల్త్ సెక్రెటరీతోగానీ సమీక్షించకుండా, సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరుకు షెడ్యూల్ ప్రకారం ముగిస్తే.. పాలన మరింత బలపడుతుందన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. వ్యాధుల నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని, ఆ సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల ద్వారా మరింత సమర్థవంతంగా వైరస్‌ల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టవచ్చని కోర్టుకు ప్రభుత్వం నివేదించనుంది.
సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం
ఎన్నికల వాయిదాపై ఎంపీ విజయసాయిరెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని, దీన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఆ హోదాను దుర్వినియోగం చేస్తే శిక్షించే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉంటుందన్నారు. అదేవిధంగా కేంద్రానికి, గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంలో తప్పేమీ లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకర వ్యక్తి అని మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ నగర పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ఆరోగ్య శాఖ కార్యదర్శిని, సీఎస్‌ను, ప్రభుత్వంలో ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. ఇంకా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..
- రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతడికి చికిత్స అందిస్తున్నారు. అది తప్ప రాష్ట్రంలో ఎక్కడా కరోనా లేదు.
- నిమ్మగడ్డ రమేశ్‌కు మాత్రమే అదో పెద్ద ప్రకృతి విపత్తులా కనిపించడమేమిటి? ఏదైనా పెను ప్రకృతి విపత్తు, ఇతర దేశాలతో యుద్ధం వంటివి తలెత్తినప్పుడే ఎన్నికలు వాయిదా వేయాలని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి.
- నాలుగు కోట్ల మందిలో ఒకరికి కరోనా సోకిందని రాష్ట్రమంతా ఎన్నికలు వాయిదా వేయడం అసాధారణ నిర్ణయం.
- అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నానని నిమ్మగడ్డ చెబుతున్నారు.. టీడీపీ ఒక్కటే రాజకీయ పార్టీనా? వైఎస్సార్ సీపీ రాజకీయ పార్టీగా కనిపించట్లేదా? చంద్రబాబు అభిప్రాయమే మిగతా రాజకీయ పార్టీలన్నింటి అభిప్రాయమని భావించడం నిమ్మగడ్డకే చెల్లుతోంది.
- బాబు ఇచ్చిన అజెండా ప్రకారం.. కులపిచ్చితో ఆత్మాహుతి దళ సభ్యుడి మాదిరిగా పనిచేస్తున్నారనే చెడ్డ పేరు రమేశ్ తెచ్చుకున్నారు.
- ఎన్నికల కమిషనర్‌గా కొనసాగే అర్హతను నిమ్మగడ్డ కోల్పోయారు. ఆయనకు సిగ్గు, నైతిక విలువలనేవి ఉంటే రాజీనామా చేయాలి.
- కన్నా లక్ష్మీనారాయణ పేరుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. చంద్రబాబు తానా అంటే తందానా అని అంటున్నారు. ఈ ధోరణి రాష్ట్రంలో బీజేపీ మనుగడకే ప్రమాదం.
Comments
Please login to add a commentAdd a comment