సాక్షి, అమరావతి: గోకులాలు నిర్మించుకునే రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని ఊరూరా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థకశాఖ అకస్మాత్తుగా ప్లేట్ తిప్పేసింది. తూచ్...90 కాదు 70 శాతం రాయితీనే ఇస్తామని కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు బిత్తరపోతున్నారు. రాయితీ అధికంగా వస్తుందనే ఆశతో అప్పు చేసి మరీ గోకులాల నిర్మాణాలు ప్రారంభించిన రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత వెన్నాడుతోందంటూ పది రోజుల క్రితం చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రాయితీ కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల వ్యవధిలో దెబ్బ మీద దెబ్బ తగలడంతో ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పథకాలకు రాయితీలు తగ్గించిన ప్రభుత్వం మరోవైపు వారు ఆసక్తి చూపని పథకాలకు రాయితీలు పెంచుతోంది.
ఇతర రాష్ట్రాల్లో పాడిపశువులు కొనుగోలు చేసే రైతులకు రవాణా ఖర్చులు కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించింది. గతంలో రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాడిపశువులను ఎంపిక చేసుకుని, వాటిని తరలించడానికి అయ్యే ఖర్చును తామే భరించేవారు. అయితే ఇటీవల ఆ రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. కానీ ఈ పథకంపై రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇతర రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఇక్కడి పరిస్థితులకు భిన్నంగా ఉండటంతో దూడలు చనిపోవడం లేదా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రైతులు ఇతర రాష్ట్రాల్లోని పాడి పశువుల కొనుగోలు పథకం పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ పథకం అమలుతో పశు సంవర్థకశాఖ అధికారులు, వైద్యులకు మామూళ్లు అధికంగా వస్తుండటంతో ఆ పథకం కొనసాగింపునకు రవాణా ఖర్చులు భరించే విధంగా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వినపడుతోంది.
దరఖాస్తులు పెరగడంతో చేతులేత్తేసిన ప్రభుత్వం
రెండు పశువుల షెడ్‌లకు రూ.లక్ష, నాలుగు పశువుల షెడ్‌కు రూ.1.50 లక్షలు, ఆరు పశువుల షెడ్‌కు రూ.1.90 లక్షలు విడుదల చేస్తున్నట్టు అధికారులు రైతులకు చెప్పారు. రెండు పశువులకు షెడ్ నిర్మించుకునే రైతులు రూ.10 వేలు సమకూర్చుకుంటే షెడ్ నిర్మించుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో 2 వేల మంది రైతులు తమ నిర్మాణాలను ప్రారంభించి సగం వరకు పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో పార్ట్‌బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఉపాధిహామీ పథకం నిధులను కూడా ఈ పథకానికి వినియోగిస్తున్న నేపధ్యంలో నిబంధనల ప్రకారం పరికరాల కొనుగోలుకు అధికంగా నిధులు ఖర్చు చేయడంతో రైతుల నిర్మాణాలకు నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం 20 పశువులను ఒకేచోట పెంచేందుకు చేపట్టే పెద్ద గోకులాలకు రాయితీని తగ్గించింది. ఒక్కో జిల్లాకు 38 గోకులాలు నిర్మించాలని నిర్ణయించింది.
అయితే అన్ని జిల్లాల్లో గోకులాలు, మినీ గోకులాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. మొదట్లో ప్రకటించిన విధంగా 90 శాతం రాయితీ కాకుండా 70 శాతం రాయితీనే ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద గోకులాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం కింద రూ.18.50 లక్షలు, మిగిలిన రూ.2.50 లక్షలు పశుసంవర్థక శాఖ భరిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తగ్గిన రాయితీ ప్రకారం పెద్ద గోకులాల యూనిట్ విలువ రూ.20.50 లక్షల నుంచి రూ.13. లక్షలకు తగ్గిపోయింది. ఒక్కో యూనిట్‌కు రూ.7.50 లక్షల రాయితీ తగ్గిపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని, తాము ఇప్పట్లో వాటిని నిర్మించలేమని కొందరు రైతులు చెప్పడం ప్రారంభించారు. ఇదే విధంగా మినీ గోకులాల్లోనూ ఇదే పరిస్ధితి... రూ.లక్ష విలువైన యూనిట్‌కు రూ.30 వేలు రైతులు భరించాల్సి రావడంతో ఆ మొత్తాన్ని భరించలేక తమకు ఆ పథకం వద్దని చెబుతున్నారు.
ఇదీ గోకుల పథకం
రాష్ట్రంలో పాడి రైతులకు చేయూత నిచ్చేందుకు ఎనిమిది వేల షెడ్‌ల (మినీ గోకులాలు) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు, నాలుగు, ఆరు పాడి పశువులు కలిగిన రైతులు ఈ షెడ్‌ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, పాడి పశువుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ 8 వేల షెడ్‌లను నిర్ణీతకాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్ణయించింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి 90 శాతం రాయితీ ఇస్తున్న గోకుల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment