శ్రీధర్‌బాబుకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ విద్యార్థి శ్రీరామ్ అరెస్ట్ వ్యవహారంలో హైకోర్టు మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్‌పీ, గోదావరిఖని పోలీసులకూ నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీరామ్ భార్య స్వరూప చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన హైకోర్టు... అందుకే ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ్‌కు వైద్య పరీక్షలు చేసిన నిమ్స్, కేర్, అపోలో ఆసుపత్రుల వైద్యుల బృందం తమ నివేదికను మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ముందు ఉంచింది. శ్రీరామ్‌పై ఉన్న ఆరోపణలేమిటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. మంత్రిపై కరపత్రాలు పంచినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని, ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు.
స్వరూప తరఫు న్యాయవాది రఘునాథ్ స్పందిస్తూ, శ్రీరామ్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పుడు కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘కరపత్రాలు పంచితే సంకెళ్లు వేసి తీసుకెళ్లాలా? ఇది ఎంతమాత్రం సరికాదు. నిందితులను కొట్టాల్సిన అవసరం ఏముంది’’ అని పోలీసులను నిలదీశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... ఈ పిటిషన్‌లో స్వరూప ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీరామ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం వచ్చే వారానికి వాయిదా వేశారు.