రాష్ట్ర విభజనపై మరో పిల్ కొట్టివేత
విభజన అంశం పార్లమెంట్ పరిధిలోదని హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి సంబంధించి దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. విభజన విషయంలో జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తన విస్తృతాధికారాలను సైతం ఉపయోగించలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న తన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకునేటట్లు కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనిక ఉద్యోగి మేజర్ పి.నర్సింహులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. విభజన వ్యవహారం మొత్తం పార్లమెంట్‌కు సంబంధించినదని, అందులో జోక్యం చేసుకోవడం న్యాయస్థానాలకు సరికాదని తేల్చి చెప్పింది.