Kalyan Jyoti shane gupta
-
ఆ ఎన్‌కౌంటర్‌పై అమికస్ క్యూరీ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 2008లో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడికి పాల్పడిన యువకులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా ఓ న్యాయవాదిని నియమించాలని హైకోర్టు సోమవారం నిర్ణయించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008, డిసెంబర్ 13న వరంగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వెళుతున్న ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి చేశారంటూ ఎస్.శ్రీనివాసరావు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల నేత చైతన్య 2008లో హైకోర్టును ఆశ్రయించారు. -
ఇంత తక్కువ ధరకు భూములా?
సెయింట్ ఆన్స్‌కు భూముల కేటాయింపుపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: సెయింట్ ఆన్స్ విద్యాసంస్థలకు నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖరీదైన భూములను నామమాత్రపు ధరలకు కేటాయించడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సెయింట్‌ఆన్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో ఎకరా రూ.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని సెయింట్ ఆన్స్ విద్యాసంస్థలకు ఎకరా రూ.ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించిందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూరిందని, అందువల్ల ఈ కేటాయింపుల్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎస్.మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం వేశారు. దీనిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. మిషనరీ పాఠశాలలు ధార్మిక సంస్థలు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది. -
సివిల్ జడ్జిలే మూల స్తంభాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైదరాబాద్, న్యూస్‌లైన్: క్షేత్రస్థాయిలో పనిచేసే జూనియర్ సివిల్ జడ్జిలే న్యా య వ్యవస్థకు మూల స్తంభాల్లాంటివారని, వారి పనితీరుతోనే న్యాయవ్యవస్థ ప్ర తిష్ట ఇనుమడిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ఉద్ఘాటించారు. తమిళనాడు న్యాయ అకాడమీలో శిక్షణ పొందిన జూని యర్ సివిల్ జడ్జిల విజ్ఞాన అవగాహన సదస్సు ఏపీ న్యాయ అకాడమీలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనియర్ సివిల్ జడ్జిలు అంకితభావంతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేయాలన్నారు. ఏపీ న్యాయవ్యవస్థ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ సుభాష్‌రెడ్డి, డెరైక్టర్ వీఎస్ అవధాని, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ నౌషద్ అలీ తదితరులు ప్రసంగించారు. తమిళనాడుకు చెందిన 30 మంది ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జిలు సహా రాష్ట్రానికి చెందిన పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనపై మరో పిల్ కొట్టివేత
విభజన అంశం పార్లమెంట్ పరిధిలోదని హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి సంబంధించి దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. విభజన విషయంలో జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తన విస్తృతాధికారాలను సైతం ఉపయోగించలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న తన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకునేటట్లు కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనిక ఉద్యోగి మేజర్ పి.నర్సింహులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. విభజన వ్యవహారం మొత్తం పార్లమెంట్‌కు సంబంధించినదని, అందులో జోక్యం చేసుకోవడం న్యాయస్థానాలకు సరికాదని తేల్చి చెప్పింది. -
‘రాష్ట్ర విభజన’ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తన తీర్పును మంగళవారం వెలువరించనున్నది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 3వ అధికరణ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని, ఈ దృష్ట్యా దాన్ని కొట్టివేయాలని, అలాగే రాష్ట్రంలో 371(డి) అధికరణ అమల్లో ఉండగా 3వ అధికరణకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఆమేరకు తగిన ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ పిటిషన్‌పై ఏ నిర్ణయమనేదీ మంగళవారం చెబుతామని స్పష్టం చేసింది. -
‘మక్కా’ పరిహారంలో మలుపులు
తీర్పును ఉపసంహరించుకున్న హైకోర్టు లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చండి రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం.. విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల అనుమానితులకు పరిహారం చెల్లింపు వివాదం కొత్త మలుపు తిరిగింది. వారికి దాదాపు రూ.70 లక్షలు చెల్లించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ సెప్టెంబర్ 16న ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉపసంహరించుకుంది! ఆ తీర్పు అమలును నిలుపుదల చేసింది. పరిహారం పొందిన వారందరినీ కేసులో ప్రతివాదులుగా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వారందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2007 నాటి మక్కా మసీదు బాంబు పేలుళ్ల ఘటనలో పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తర్వాత విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టడంతో వారందరినీ కేసు నుంచి తప్పించడం, పోలీసులు దురుద్దేశపూర్వకంగా తమను కేసులో ఇరికించజూశారంటూ కొందరు జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించడం తెలిసిందే. వారికి పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. అనంతరం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, పోలీసు విచారణ నుంచి బయట పడిన వారిలో ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. దీన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేశ్ గౌడ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. చెల్లింపులను రద్దు చేస్తూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత 16న తీర్పునివ్వడం తెలిసిందే. అయితే ఆ తీర్పులో తప్పులను సరిదిద్దే క్రమంలో కొన్ని వాస్తవాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం గురువారం పేర్కొంది. ఇలాంటప్పుడు గత తీర్పును నిలుపుదల చేసి, తిరిగి వాదనలు వినవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, ఆ మేరకు వ్యాజ్యంపై తిరిగి విచారణ చేపడుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చకపోవడంపై పిటిషనర్‌ను తప్పుబట్టింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా
సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మంగళవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులకు స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ప్రాంగణం, పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలు,నిరసన కార్యక్రమాలు నిషేధిస్తూ 2010లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పాటించాల్సిందేనని చెప్పారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేస్తామన్నారు. సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఇటీవలి హైకోర్టులో ఘర్షణలు, మంగళవారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఇరుపక్షాల న్యాయవాదులతో సమావేశయ్యారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు చొరవతో ఏర్పాటైన ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు చిత్తరవు నాగేశ్వరరావు పాటు సీమాంధ్ర న్యాయవాదుల తరఫున జేఏసీ చైర్మన్ సి.వి.మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ఎస్.ఆర్.అశోక్, ఎం.ఎస్.ప్రసాద్, శేషారాజ్యం, భాస్కరలక్ష్మి, కె.చిదంబరం పాల్గొన్నారు. తెలంగాణ న్యాయవాదుల తరఫున జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోధర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, డి.జైపాల్‌రెడ్డి, వి.రఘునాథ్, జ్యోతికిరణ్ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో ఈ సమావేశం గంటకు పైగా సాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు, పరిసరాల్లో నిరసన కార్యక్రమాలపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని సీమాంధ్ర తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చారు. ఈ తీర్పును ఉల్లంఘించి తెలంగాణ న్యాయవాదులు అనేకసార్లు ర్యాలీలు, ధర్నాలు, నిరసన చేశారని ఆరోపించారు. దీనికి తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, గతాన్ని తవ్వుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాలూ ఒకేరోజు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకరి కార్యక్రమం గురించి ఒకరు ముందుగానే సమాచార మార్పిడి చేసుకొంటే అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు వీలుంటుందని సూచించారు. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఇరుపక్షాలకూ హితవు పలికారు. కోర్టు ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించాల్సిన అవసరం కల్పించొద్దని, వారొస్తే పరిస్థితులు మరోరకంగా ఉంటాయన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. దీంతో ఇరుపక్షాలూ కొంత అసంతృప్తితోనే ప్రధాన న్యాయమూర్తి సూచనలకు అంగీకారం తెలిపాయి.