తీర్పును ఉపసంహరించుకున్న హైకోర్టు
లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చండి
రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం..
విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల అనుమానితులకు పరిహారం చెల్లింపు వివాదం కొత్త మలుపు తిరిగింది. వారికి దాదాపు రూ.70 లక్షలు చెల్లించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ సెప్టెంబర్ 16న ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉపసంహరించుకుంది! ఆ తీర్పు అమలును నిలుపుదల చేసింది. పరిహారం పొందిన వారందరినీ కేసులో ప్రతివాదులుగా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వారందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2007 నాటి మక్కా మసీదు బాంబు పేలుళ్ల ఘటనలో పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తర్వాత విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టడంతో వారందరినీ కేసు నుంచి తప్పించడం, పోలీసులు దురుద్దేశపూర్వకంగా తమను కేసులో ఇరికించజూశారంటూ కొందరు జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించడం తెలిసిందే. వారికి పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది.
అనంతరం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, పోలీసు విచారణ నుంచి బయట పడిన వారిలో ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. దీన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేశ్ గౌడ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. చెల్లింపులను రద్దు చేస్తూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత 16న తీర్పునివ్వడం తెలిసిందే. అయితే ఆ తీర్పులో తప్పులను సరిదిద్దే క్రమంలో కొన్ని వాస్తవాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం గురువారం పేర్కొంది. ఇలాంటప్పుడు గత తీర్పును నిలుపుదల చేసి, తిరిగి వాదనలు వినవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, ఆ మేరకు వ్యాజ్యంపై తిరిగి విచారణ చేపడుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చకపోవడంపై పిటిషనర్‌ను తప్పుబట్టింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.