makkah masjid
-
Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత గోడ గడియారాల్లో అదొకటి. దీనికి ఒకటిన్నర శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. అప్పట్లో ఫేవ్రే– ల్యూబా కంపెనీ ఈ గడియారాన్ని తయారు చేసింది. అలాంటి ఈ గోడ గడియారం ఎనిమిదేళ్లుగా మూగబోయింది. నగరంలోని మక్కా మసీదు గడియారం ముల్లు ఎట్టకేలకు మళ్లీ కదిలింది. 1850లో అప్పటి 4వ నిజాం నవాబ్ నాసిర్–ఉద్–దౌలా ఈ గడియారాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. అప్పటినుంచి నిరాటంకంగా పని చేసిన ఈ లోలకం ఎనిమిదేళ్ల క్రితం ఆగిపోయింది. ఈ గడియారాన్ని వాహెద్ వాచ్ కంపెనీ మరమ్మతు చేయడంతో మళ్లీ గంట కొట్టడం మొదలైంది. నిజాం సామ్రాజ్యం అంతరించిన అనంతరం ఈ గడియారం నిర్వహణ వాహెద్, భారత్ వాచ్ కంపెనీలు సంయుక్తంగా చూశాయి. 2015లో ఈ వాచ్ నిలిచిపోవడంతో అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టిన ఈ సంస్థలు.. ఎట్టకేలకు దాన్ని పునరుద్ధరించగలిగాయి. చదవండి: Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ -
మాస్క్ ఉంటేనే మసీదులోకి..
చార్మినార్: ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభం అయింది. మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషాకి నమాజ్ నిర్వహించారు. అనంతరం మక్కా మసీదు కతీబ్ రిజ్వాన్ ఖురేషీ తరావీ పవిత్ర ఖురాన్‌ను పఠించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో మక్కా మసీదును అలంకరించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లింలకు నెల రోజుల పాటు పంపిణీ చేయడానికి వెయ్యి కిలోల ఖర్జూరం సిద్ధం చేశామని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఎం.ఎ.ఖాదర్ సిద్దిఖీ అన్నారు. ►ప్రతి రోజు పంపిణీ చేయడానికి 100 డజన్ల అరటి పండ్లను మైనార్టీ సంక్షేమ శాఖ మంజూరు చేసిందన్నారు. ►కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మక్కా మసీదులో నిర్వహించే సామూహిక ప్రార్థనల్లో పాల్గొనే ముస్లింలు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. ►మసీదుకు వచ్చేవారు తమ ఇళ్ల వద్దే వజూ చేసుకొని వెంట జానిమాజ్లు తెచ్చుకోవాలన్నారు. ►మాస్క్‌లు ధరించకపోతే.. పోలీసులు మక్కా మసీదు లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. ►60 ఏళ్లు పైబడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు చిన్నారులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన రాదని కోరారు. ►మక్కా మసీదులోకి విజిటర్స్‌కు అనుమతి లేదని.. నమాజులు, ఇఫ్తార్లు, తరావీలను భౌతికదూరం పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు. ( చదవండి: ఉపవాసం ఉండి వ్యాక్సిన్ తీసుకోవచ్చు) -
ఎప్పుడు పూర్తయ్యేనో!
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మక్కా మసీదు నిర్వహణ, మరమ్మతు పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. మసీదు దుస్థితిపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్ట్ 23న రూ. 8.48 కోట్లు ని«ధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ గడువు ముంచుకువస్తున్నా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడంలేదు. రూ.2 కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనులు ముందుకు సాగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురావస్తు శాఖ పర్యవేక్షణలో.. మక్కా మసీదు మరమ్మతు పనులను వక్ఫ్ బోర్డు ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయలని నిర్ణయించారు. మొదటి దశలో మసీదు పైకప్పు మరమ్మతులతో పాటు గోడల్లో నీరు రాకుండా పనులు చేపట్టారు. పురావస్తు శాఖ అనుభవజ్ఞులైన సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. కాగా.. ఇప్పటికీ 70 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ముంబైకి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని నిర్మాణ పనులు చేస్తున్నారు. మసీదు పైకప్పు, నిజాం సమాధుల పనులు 80 శాతం వరకు పూర్తి కాగా మసీదు లోపలి డోమ్‌ల పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. సౌండ్, లైట్ సిస్టమ్‌ల కోసం టెండర్లు కూడా ఇంకా ప్రకటించలేదు. చారిత్రక కట్టడం కావడంతో రాష్ట్ర పురావస్తు శాఖ సూచనల మేరకు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో మసీదు పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావాల్సి ఉండగా పలు పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. చారిత్రక కట్టడం కావడంతో పనుల్లో జాప్యం ఏర్పడుతోందని, నిధులు సకాలంలో అందకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. పురావస్తు శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు బిల్లులు అందజేస్తే నిధులు వక్ఫ్ బోర్డు ద్వారా జారీ చేస్తామని మైనార్టీ శాఖ అధికారులు చెబుతున్నారు. శాఖల మధ్య కొరవడిన సమన్వయం.. మక్కా మసీదు మరమ్మతు పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నా.. నిధులు మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు చెల్లిస్తోంది. అడపాదడపా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, కార్యదర్శి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీదు పనులను పరిశీలించి వారం రోజుల్లో పనులు పూర్తి అవుతాయని, మరికొంత మంది నెల రోజుల్లో పూర్తి అవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇంత వరకు మైనార్టీ సలహాదారుడు తప్ప ఎవరికీ మసీదు నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం లేకుండాపోయింది. దీంతో పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే విధంగా ఉంది. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆరు నెలల్లో పూర్తి చేస్తాం.. మొదట్లో అనుకున్న సమయానికి మసీదుల పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేశాం. కానీ పలు మరమ్మతులు పనులు చాలా సున్నితంగా చేయాల్సి వస్తోంది. పైకప్పుతో పాటు సమాధుల, మదర్సా పనులు చివరి దశలో ఉన్నాయి. మా అంచనా ప్రకారం మరో ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం. – విశాలాక్షి, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ -
తీర్పును స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమాయకులపై కేసులు బనాయించారని ఆరోపించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, మజ్లిస్‌లు దుర్మార్గపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. తాజా తీర్పును పరిశీలించైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేని సీఎం కేసీఆర్‌కు దళితుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 14 నుంచి మే 5 వరకు గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత వాడల్లో భోజనం, పల్లె నిద్రలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రజాచైతన్యయాత్రలను నిర్వహిస్తామన్నారు. మే 2న కిసాన్ కల్యాణ్ కార్యశాలలు, మే 5న కౌశల్ వికాస్ యోజన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు బీజేపీ పదాధికారుల, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ తీర్పు వారికి చెంపపెట్టు: దత్తాత్రేయ కాంగ్రెస్ హయాంలో మక్కా మసీదు పేలుళ్ల కేసు సందర్భంగా కాషాయ తీవ్రవాదం అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారికి తాజా తీర్పు చెంపపెట్టులాంటిదని ఎంపీ దత్తాత్రేయ పేర్కొన్నారు. అప్పట్లో చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు. -
అనగనగా మక్కా
మక్కా మసీద్.. భాగ్యనగర చరిత్రలో ఓ కలికితురాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మసీదుల్లో ఒకటి. ఈ మహా కట్టడం మరో ఘనతను సాధించింది. దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసి 400 ఏళ్లవుతోంది. 1617 డిసెంబర్లో పునాది రాయి పడి.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 77 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి నిర్మాణం రూపుదిద్దుకుంది. ముగ్గురు కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనూ పూర్తికాని ఈ నిర్మాణం.. రాజ్యంపై దండెత్తి ధ్వంసానికి పాల్పడిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పూర్తి చేయడం విశేషం. షాద్‌నగర్‌లోని ఓ కొండ రాళ్లను ఈ నిర్మాణంలో వినియోగించారు. మరికొన్నింటిని మక్కా నుంచి తెప్పించారు. అందుకే ‘మక్కా మసీద్’గా ప్రాచుర్యం పొందింది. ఈ మహాసౌధంపై ఆసక్తికర అంశాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 1591లో మహ్మద్ కులీకుతుబ్ షా చార్మినార్ నిర్మించి హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాడు. చార్మినార్‌కు సమీపంలో 1597లో జామియా మసీద్ నిర్మించాడు. నగరంలో తొలిæ మసీద్ ఇదే. క్రమేణా జనాభా పెరగడంతో ప్రార్థనలకు మసీద్ సరిపోలేదు. విషయం తెలుసుకున్న కులీకుతుబ్ షా మరో మసీద్ నిర్మించాలని 1610లో ఆదేశించారు. అయితే నివేదిక ఇచ్చేలోపే 1612లో ఆయన మృతిచెందాడు. అనంతరం ఆయన అల్లుడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా సంస్థాన బాధ్యతలు తీసుకున్నాడు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా అతిపెద్ద మసీద్ నిర్మించాలని తాను సహా మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరితో కమిటీ ఏర్పాటు చేశాడు. 1617లో శంకుస్థాపన.. సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా 1617 డిసెంబర్లో మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణం భిన్నంగా ఉంటుంది. దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లో దాదాపు మట్టిని వినియోగించారు. కానీ మక్కా మసీద్ నిర్మాణంలో మట్టిని వాడలేదు. నగర సమీపంలోని కొండల రాళ్లను పరీక్షించి, షాద్‌నగర్ కొండ రాళ్లను వినియోగించాలని నిర్ణయించారు. వీటి రంగు కాస్త ఎరుపుగా, పటిష్టంగా ఉన్నాయని వాడారు. నిర్మాణం మొత్తం ఒకే కొండ రాళ్లతో చేయాలని ఆవే రాళ్లను వినియోగించారు. అందుకే మసీద్ రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది. మొఘల్‌ల దాడులతో జాప్యం... సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా హయాంలో నిర్మాణం పూర్తి కాలేదు. కుతుబ్ షా తర్వాత 1626లో ఆయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా చిన్న వయసులోనే సంస్థాన బాధ్యతలు చేపట్టాడు. ఈయన కాలంలో మొగల్ పాలకుల దాడులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ మసీద్ నిర్మాణ పనులు జరిగాయని చరిత్రకారులు పేర్కొన్నారు. అబ్దుల్లా మరణానంతరం 1672లో అబుల్ హసన్ తానేషా హయాంలో నిర్మాణ పనులు ఎక్కువగా జరగలేదు. 1689లో కుతుబ్ షాహీల సంస్థానం మొఘల్‌ల వశమైంది. మొఘల్లహయాంలో పూర్తి.. దేశంలోనే అతిపెద్ద మినార్లు మక్కా మసీద్‌కు నిర్మించాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ మినార్ల నిర్మాణం చేపట్టలేదు. 1694లో ఔరంగజేబు మిగిలిన పనులు చేయించి, నమాజ్‌లకు అనుమతించాడు. ఇలా మక్కా మసీద్ నిర్మాణానికి 77ఏళ్లు పట్టింది. కుతుబ్‌షాహీ ముగ్గురు పాలకుల హయాంలోనూ ఈ మహాసౌధం నిర్మాణం పూర్తి కాలేదు. ఆ పేరెలా వచ్చింది? మక్కా మసీద్‌కు బైతుల్ అతీక్ అనే పేరు పెట్టాలని మొదట నిర్ణయించారు. అయితే సౌదీ అరేబియాలోని మక్కా నగరం నుంచి రాళ్లను తీసుకొచ్చి నిర్మాణంలో వినియోగించారు. అందుకే మక్కా మసీద్ అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఆసఫ్జాహీ ప్రథమ పాలకుడు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ మృతదేహాన్ని మసీద్ దక్షిణ భాగంలో ఖననం చేశారు. ఇదే పరంపరలో ఆసఫ్జాహీ ఆరో పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ వరకు అక్కడే ఖననం చేశారు. రాళ్లెత్తిన కూలీలెవరు? మసీద్ నిర్మాణానికి కొండను పగలగొట్టి పెద్ద పెద్ద రాళ్లను ఏనుగులకు కట్టి తీసుకొచ్చారు. చిన్న రాళ్లను ఎడ్లబండ్లపై తెచ్చారు. దేశవిదేశాల్లోని శిల్పకారులను పిలిపించారు. దాదాపు 8వేల మంది కూలీలు (మూడు తరాల మనుషులు) మసీద్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతమున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని కూలీలు మసీద్ నిర్మాణానికి రాళ్లు మోశారు. -
నెత్తుటి చరితకు పదేళ్లు
►మక్కా మసీదు వద్ద భద్రత కట్టుదిట్టం ►ర్యాలీలకు అనుమతి లేదంటున్న పోలీసులు చార్మినార్: మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి గురువారం నాటికి పదేళ్లు (2007)పూర్తవుతున్నాయి.ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా 20మంది గాయపడ్డారు. దీంతో దక్షిణ మండల పోలీసులు నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 100 మందికి పైగా ఎస్ఐలు, రెండు కంపేనీల ఆర్ఏఎఫ్, 20 ప్లటూన్ల టీఎస్ఎస్పీ బలగాలతో పర్యవేక్షించనున్నాయని అదనపు డీసీపీ బాబురావు తెలిపారు. నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదు పాతబస్తీలో ఎక్కడా ఎలాంటి నిరసన సభలు,ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని దక్షిణ మండల అదనపు డీసీపీ బాబురావు తెలిపారు. కీలకమైన అన్ని ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేయడంతో పాటు సామూహిక ప్రార్థనలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2007 మే 18 పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి మైనార్టీ సంక్షేమ శాఖ నిధులను మంజూరయ్యాయి. త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. -
ముగిసిన ఖురేషీ అంత్యక్రియలు
హైదరాబాద్: మక్కా మసీదు కతీబ్, ఇమాం మౌలానా హాఫీజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ అల్ జహాదీ అంత్యక్రియలు బుధవారం మిశ్రీగంజ్‌లో ముగిశాయి. పాతబస్తీ పంచమొహల్లాకు చెందిన ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం మక్కా మసీదుకు తరలించి నమాజ్-ఏ-జనాజా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు అత్యధిక సంఖ్యలో మక్కా మసీదుకు చేరుకొని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మిశ్రీగంజ్ వరకు కొనసాగిన అంతిమ యాత్ర అనంతరం అబ్దుల్లా షా సాబ్ దర్గా వద్ద అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ రాష్ర్ట డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు పలువురు మత పెద్దలు, అధికార అనధికార ప్రముఖులు మక్మా మసీదుకు చేరుకొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. బుధవారం మక్కా మసీదులో మౌలానా హాఫీజ్ ఖ్వారీ అల్ హజ్ అబ్దుల్లా ఖురేషీ భౌతిక కాయాన్ని చూసేందుకు భారీగా వచ్చిన ప్రజలు -
అల్ విదా రంజాన్...
-
తగ్గిన హజ్ యాత్ర కోటా
సాక్షి, హైదరాబాద్: మక్కాలో మరమ్మతు పనులు కొనసాగుతుండటంతో హజ్-2014 యాత్రికుల కోటా ఈసారి తగ్గిపోయింది. రాష్ట్ర హజ్‌కమిటీ ఆధ్వర్యంలో యాత్ర కోసం సుమారు 18,128 మంది దరఖాస్తు చేసుకోగా, 5,380 మందికి మాత్రమే అవకాశం దక్కింది. అందులో జనరల్ కేటగిరీలో 3,904 మంది, రిజర్వుడ్ కేటగిరిలో 1,476 మంది ఎంపికయ్యారు. -
మక్కామసీదును నిర్మించినవారు ఎవరు?
ఏపీ హిస్టరీ డా॥పి. జోగినాయుడు డిప్యూటీ డెరైక్టర్ (రిటైర్డ్) ఆర్కియాలజీ - మ్యూజియమ్స్ కుతుబ్‌షాహీల కాలంనాటి సాంఘిక పరిస్థితులు: యూరోపియన్ యాత్రికులు, వర్తకులు, రాయబారులు రాసిన గ్రంథాల ద్వారా కుతుబ్‌షాహీల కాలంనాటి మత-సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. గోల్కొండ నవాబుల రాజభాష పారశీకం అయినా, తెలుగు భాష కూడా వారి పాలనలో మంచి అభివృద్ధినే సాధించింది. తెలుగు, దక్కనీ ఉర్దూ, పారశీక భాషలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఈ యుగంలో మతమౌఢ్యాలు, మూఢాచారాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. జ్యోతిషం, ముహూర్త బలాలు, దుష్టఘడియల ప్రమాదాలు, సూర్య చంద్రులను, నక్షత్రాల్ని దేవతలుగా నమ్మడం లాంటివి ఉన్నట్లు బెర్నియర్ రాశాడు. బ్రాహ్మణులకు గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాల్లో మంచి పరిజ్ఞానం ఉందని మూర్‌ల్యాండ్ పేర్కొన్నాడు. వైశ్యులు వర్తకం చేసేవారని, గణితంలో వీరికి మంచి పట్టు ఉండేదని బౌరే రాశాడు. శూద్రులు ప్రభువుల వద్ద సేవకులుగా, సైనికులుగా పనిచేసేవారని మెత్‌హాల్డ్ పేర్కొన్నాడు. సంఘంలో వితంతువులది బాధాకరమైన స్థితి. నగలు పెట్టుకోకూడదు, శుభ్రమైన దుస్తు లు ధరించకూడదు. బంధువులకు దూరంగా ఉండేవారు. సమాజంలో వేశ్యలకు గౌరవం ఉండేది. వారికి అండగా పాలకవర్గం ఉండేది. గోల్కొండలో 20 వేల మంది వేశ్యలు ఉండే వారని టావెర్నియర్ రాశాడు. వారికి ప్రభుత్వం లెసైన్సులు ఇచ్చేది. వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు కాదు. దేవదాసీలకు సంఘంలో మంచి గౌరవం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్‌షా ‘కుల్లియత్’ అనే గ్రంథాన్ని ఉర్దూ భాషలో రచించాడు. ఇందులో హిందువుల, ముస్లింల పండగల గురించి వివరించాడు. మొహర్రం, రంజాన్, దీపావళి, హోళీ, వసంతోత్సవం లాంటి పండగలను వర్ణించాడు. మహమ్మదీయుల వాస్తు కట్టడాల్లో పూర్ణ కుంభం, లతాపద్మాలు, హంసలు, ఏనుగులు లాంటి హిందూ వాస్తు సంప్రదాయాలు ప్రవేశించాయి. కుతుబ్‌షాహీలు పారశీక దేశం నుంచి వచ్చిన షియా మతస్థులు. షియా సంప్రదాయానికి సహజమైన సహనాన్ని పరిపాలనలో ప్రదర్శించారు. జాతి, మత విభేదాలు పాటించకుండా, అర్హత ఉన్నవాళ్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, తెలుగువారి సహాయంతో ఆంధ్రదేశాన్ని సమైక్యం చేశారు. వాస్తు - స్మారక నిర్మాణాలు గోల్కొండ కుతుబ్‌షాహీల కట్టడాలు, షియామత సూత్రాలకు అనుగుణంగా పారశీక, బహమనీ హిందూ సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటాయి. ఈ శైలిలో గుమ్మటాలు, కమాన్లు, మీనార్లు ఉంటాయి. పుష్పాలు, లతలు, పక్షులు ఈ నిర్మాణాల్లో కన్పిస్తాయి. వాస్తుపరంగా విశిష్టమైన కుతుబ్‌షాహీ శైలి వెలుగులోకి వచ్చింది. వీరు ప్రధానంగా పారశీక వాస్తుతో పాటు బహమనీ సుల్తానుల వాస్తునే అనుసరించారు. పెద్ద గుమ్మటాలు, విశాలమైన ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు అష్ట కోణాకృతి నిర్మాణాలు ఈ శైలికి ముఖ్య లక్షణాలు. హైదరాబాద్‌లోని చార్మినార్, చార్‌కమాన్, మక్కామసీదు, టోలీ మసీదు, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల సమాధులు, బాదుషాహీ అసూర్‌ఖానా లాంటి నిర్మాణాలు, కుతుబ్‌షాహీ వాస్తుకు అద్దం పడతాయి. కుతుబ్‌షాహీ మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మూసీనదిపై క్రీ.శ. 1578 పురానాఫూల్ (పాతవంతెన)ను నిర్మించారు. ఇతడి కాలంలోనే హుస్సేన్ సాగర్, బద్వేల్, ఇబ్రహీంపట్నం, గోల్కొండ కోటలోని ఇబ్రహీం మసీదులను నిర్మించారు. మహ్మద్ కులీకుతుబ్ తన ప్రేయసి భాగమతి పేరుపై మూసీ నది దక్షిణ ప్రాంతంలో క్రీ.శ. 1591లో చిచిలం గ్రామం (ప్రస్తుత షా-ఆలి-బండ ప్రాంతం)లో ప్లేగు వ్యాధి నివారణకు జ్ఞాపకంగా నాలుగురోడ్ల కూడలి మధ్య చార్మినార్‌ను నిర్మించాడు. చార్మినార్ పక్కనే ఉన్న జమామసీదును 1594లో కులీ నిర్మించాడు. దీంతోపాటు మహ్మద్ కులీ పత్తర్‌గట్టి ప్రాంతం (హైదరాబాద్)లో బాదుషాహీ అసూర్‌ఖానా, దారుల్షిఫా(ఆసుపత్రి), చార్ కమాన్ లాంటి నిర్మాణాలు చేశాడు. వీటిని రాయి, సున్నంతో నిర్మించారు. కులీ కుతుబ్‌షా అల్లుడైన మహ్మద్ కుతుబ్‌షా (క్రీ.శ. 1612- 1626) దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మక్కా మసీదును క్రీ.శ. 1617లో నిర్మించాడు. కుతుబ్‌షాహీల ఇతర స్మారక నిర్మాణాలు, గోల్కొండ కోట అంతర్భాగంలో భక్తరామదాసు బందిఖానా, రాణీమహల్‌లు, సుల్తాన్ల మరణాంతరం ఖననానికి ముందు స్నానం చేయించే గదులు నేటికీ ఉన్నాయి. సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించిన కుతుబ్‌షాహీల సమాధులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాస్తు నిర్మాణాలు. ఒకే రాజవంశానికి చెందిన సుల్తానుల సమాధులన్నీ (అబుల్ హసన్ తానీషా తప్ప) ఒకే ప్రాంగణంలో నిర్మించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కన్పించదు. సమాధుల డోమ్ అంతర్భాగాన్ని అష్టకోణాకృతిలో ప్రత్యేక పరిజ్ఞానంతో నిర్మించారు. కుతుబ్‌షాహీల కాలంనాటి చిత్రకళ, మొగలులు, హిందూ- పారశీక సంప్రదాయం లో దక్కనీ చిత్రకళ చరిత్రలో పేరుగాంచింది. తారీక్ హుస్సేన్ ‘షాహిద్ -షాహీ దక్కన్’ గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. మహమ్మద్ కులీకుతుబ్‌షా రచించిన ‘కుల్లియత్’ గ్రంథంలో 14 సూక్ష్మచిత్రాలు (మీనియేచర్ చిత్రాలు) ఉన్నాయి. దక్కను ఉర్దూలో రాసిన మొదటి గ్రంథంగా ‘కుల్లియత్’ను పేర్కొంటారు. -
‘మక్కా’ పరిహారంలో మలుపులు
తీర్పును ఉపసంహరించుకున్న హైకోర్టు లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చండి రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం.. విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల అనుమానితులకు పరిహారం చెల్లింపు వివాదం కొత్త మలుపు తిరిగింది. వారికి దాదాపు రూ.70 లక్షలు చెల్లించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ సెప్టెంబర్ 16న ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉపసంహరించుకుంది! ఆ తీర్పు అమలును నిలుపుదల చేసింది. పరిహారం పొందిన వారందరినీ కేసులో ప్రతివాదులుగా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వారందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2007 నాటి మక్కా మసీదు బాంబు పేలుళ్ల ఘటనలో పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తర్వాత విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టడంతో వారందరినీ కేసు నుంచి తప్పించడం, పోలీసులు దురుద్దేశపూర్వకంగా తమను కేసులో ఇరికించజూశారంటూ కొందరు జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించడం తెలిసిందే. వారికి పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. అనంతరం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, పోలీసు విచారణ నుంచి బయట పడిన వారిలో ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. దీన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేశ్ గౌడ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. చెల్లింపులను రద్దు చేస్తూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం గత 16న తీర్పునివ్వడం తెలిసిందే. అయితే ఆ తీర్పులో తప్పులను సరిదిద్దే క్రమంలో కొన్ని వాస్తవాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం గురువారం పేర్కొంది. ఇలాంటప్పుడు గత తీర్పును నిలుపుదల చేసి, తిరిగి వాదనలు వినవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, ఆ మేరకు వ్యాజ్యంపై తిరిగి విచారణ చేపడుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చకపోవడంపై పిటిషనర్‌ను తప్పుబట్టింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
అనుమానితులకు పరిహారమా? : హైకోర్టు
ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల వ్యవహారంలో అనుమానితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అనుమానితులకు దాదాపు 70 లక్షల రూపాయల మేర పరిహారం చెల్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన పరిధి దాటి పరిహారం చెల్లించిందని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 2007లో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో పోలీసులు పలువురిని అనుమానితుల కింద అదుపులోకి తీసుకుని విచారించారు. తరువాత ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టడంతో వారిని కేసు నుంచి తప్పించారు. ఈ అనుమానితుల్లో కొందరు జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించి, పోలీసు చర్య వల్ల తాము మానసిక వేదనతో పాటు, సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషన్... ఆ మేర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, ఇంటరాగేషన్ నుంచి బయట పడిన వారికి రూ.20వేల చొప్పున కూడా చెల్లించింది. ఈ చర్యలను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేష్‌గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిహారం చెల్లింపు ఉత్తర్వులను రద్దు చేసింది.