సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమాయకులపై కేసులు బనాయించారని ఆరోపించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, మజ్లిస్‌లు దుర్మార్గపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. తాజా తీర్పును పరిశీలించైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించలేని సీఎం కేసీఆర్‌కు దళితుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 14 నుంచి మే 5 వరకు గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత వాడల్లో భోజనం, పల్లె నిద్రలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రజాచైతన్యయాత్రలను నిర్వహిస్తామన్నారు. మే 2న కిసాన్ కల్యాణ్ కార్యశాలలు, మే 5న కౌశల్ వికాస్ యోజన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు బీజేపీ పదాధికారుల, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ తీర్పు వారికి చెంపపెట్టు: దత్తాత్రేయ
కాంగ్రెస్ హయాంలో మక్కా మసీదు పేలుళ్ల కేసు సందర్భంగా కాషాయ తీవ్రవాదం అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారికి తాజా తీర్పు చెంపపెట్టులాంటిదని ఎంపీ దత్తాత్రేయ పేర్కొన్నారు. అప్పట్లో చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment