అనుమానితులకు పరిహారమా? : హైకోర్టు | Compensation to suspects? : High Court | Sakshi
Sakshi News home page

అనుమానితులకు పరిహారమా? : హైకోర్టు

Published Tue, Sep 17 2013 3:48 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Compensation to suspects? : High Court

ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు
 సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల వ్యవహారంలో అనుమానితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అనుమానితులకు దాదాపు 70 లక్షల రూపాయల మేర పరిహారం చెల్లిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన పరిధి దాటి పరిహారం చెల్లించిందని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 2007లో మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో పోలీసులు పలువురిని అనుమానితుల కింద అదుపులోకి తీసుకుని విచారించారు.
 
 తరువాత ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టడంతో వారిని కేసు నుంచి తప్పించారు. ఈ అనుమానితుల్లో కొందరు జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించి, పోలీసు చర్య వల్ల తాము మానసిక వేదనతో పాటు, సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషన్... ఆ మేర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, ఇంటరాగేషన్ నుంచి బయట పడిన వారికి రూ.20వేల చొప్పున కూడా చెల్లించింది. ఈ చర్యలను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్.వెంకటేష్‌గౌడ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిహారం చెల్లింపు ఉత్తర్వులను రద్దు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement