సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా మంగళవారం సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులకు స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ప్రాంగణం, పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలు,నిరసన కార్యక్రమాలు నిషేధిస్తూ 2010లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పాటించాల్సిందేనని చెప్పారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేస్తామన్నారు.
సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఇటీవలి హైకోర్టులో ఘర్షణలు, మంగళవారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఇరుపక్షాల న్యాయవాదులతో సమావేశయ్యారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు చొరవతో ఏర్పాటైన ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు చిత్తరవు నాగేశ్వరరావు పాటు సీమాంధ్ర న్యాయవాదుల తరఫున జేఏసీ చైర్మన్ సి.వి.మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ఎస్.ఆర్.అశోక్, ఎం.ఎస్.ప్రసాద్, శేషారాజ్యం, భాస్కరలక్ష్మి, కె.చిదంబరం పాల్గొన్నారు.
తెలంగాణ న్యాయవాదుల తరఫున జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోధర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, డి.జైపాల్‌రెడ్డి, వి.రఘునాథ్, జ్యోతికిరణ్ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో ఈ సమావేశం గంటకు పైగా సాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైకోర్టు, పరిసరాల్లో నిరసన కార్యక్రమాలపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని సీమాంధ్ర తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చారు. ఈ తీర్పును ఉల్లంఘించి తెలంగాణ న్యాయవాదులు అనేకసార్లు ర్యాలీలు, ధర్నాలు, నిరసన చేశారని ఆరోపించారు. దీనికి తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, గతాన్ని తవ్వుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాలూ ఒకేరోజు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఒకరి కార్యక్రమం గురించి ఒకరు ముందుగానే సమాచార మార్పిడి చేసుకొంటే అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు వీలుంటుందని సూచించారు. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఇరుపక్షాలకూ హితవు పలికారు. కోర్టు ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించాల్సిన అవసరం కల్పించొద్దని, వారొస్తే పరిస్థితులు మరోరకంగా ఉంటాయన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. దీంతో ఇరుపక్షాలూ కొంత అసంతృప్తితోనే ప్రధాన న్యాయమూర్తి సూచనలకు అంగీకారం తెలిపాయి.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా
Published Wed, Sep 11 2013 2:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement