కేంద్రాన్ని అడ్డుకోవాలంటే మద్దతు ఉపసంహరించాలి
హైదరాబాద్: అడ్డగోలు విభజనతో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న యూపీఏ ప్రభుత్వ తీరును అడ్డుకోవాలంటే సీమాంధ్ర ఎంపీలంతా తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈ దిశగా ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు వారి ఇళ్ల ముందు ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మంగళవారం ఇక్కడ సమావేశానంతరం పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త వి.ల క్ష్మణరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు సీమ ఎమ్మెల్యేల మద్దతుతో ఆమోదం తెచ్చుకునే కుట్రలో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. 1,700 గ్రామపంచాయతీలు రాయల తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినట్టుగా బోగస్ వివరాలను అధికారులు కేంద్రం ముందుంచారని, ఆయా గ్రామ పంచాయితీల మినిట్స్ పుస్తకాలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అసెంబ్లీలో విభజన అంశంపై చర్చ రోజున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని, డిసెంబరు 9న విద్రోహ దినంగా పాటిస్తున్నామని తెలిపారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ అందించిన రహస్య నివేదికను బహిర్గం చేయాలని, మీడియాలో వచ్చిన అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు సీమాంధ్ర ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్యాకేజీలకు అమ్ముడుపోయి మోసం చేస్తున్న సీమాంధ్ర నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ ఎ.వి.పటేల్ అన్నారు. సీమాంధ్రులు సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే ప్రెస్‌క్లబ్ కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు.
సీమాంధ్రకు చెందిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, దివాకరరెడ్డి లాంటి నేతలు పదవీ కాంక్షతో రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనకేసుకొస్తున్నారని, వీరికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అండ ఉందని సమైక్యాంధ్ర ఐటీ జేఏసీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని, దీన్ని నిరోధించటం ఎవరితరం కాదని న్యాయవాది రామకృష్ణ పేర్కొన్నారు.