ఆంధ్రప్రదేశ్ పాస్‌పోర్టు ఆఫీస్ ఎక్కడ? | andhra pradesh passport office to set up in vijayawada | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ పాస్‌పోర్టు ఆఫీస్ ఎక్కడ?

Published Thu, Jun 5 2014 5:25 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

ఆంధ్రప్రదేశ్ పాస్‌పోర్టు ఆఫీస్ ఎక్కడ? - Sakshi

ఆంధ్రప్రదేశ్ పాస్‌పోర్టు ఆఫీస్ ఎక్కడ?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాసులకు మాత్రమే ఈ కార్యాలయం అందుబాటులో ఉంది.  విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని ఇప్పటికే స్పష్టత రాగా, కొత్త పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటులో రాజధానికే తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే విజయవాడలో ఒక పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉన్నందున.. దానిని ఉన్నతీకరించి(అప్‌గ్రేడ్), కడప లేదా నెల్లూరు జిల్లాల్లో ఎక్కడో ఒకచోట కొత్త ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. సాధారణంగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారుడికి కార్యాలయం 250 కిలోమీటర్లలోపే ఉండాలి. ప్రస్తుతం విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తే కర్నూలు, అనంతపురం జిల్లాల వాసులకు 300 కిలోమీటర్లకుపైగా అవుతుంది. అదే కడప లేదా నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేస్తే 200 కిలోమీటర్లలోపే ఉంటుందనేది అధికారుల భావన.

ప్రస్తుతం విజయవాడలో ఉన్న పీఎస్‌కేను ఉన్నతీకరించి.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని మాత్రం కడప లేదా నెల్లూరులో ఏర్పాటు చేయడమో, లేదంటే కడపలో పీఎస్‌కేను ఏర్పాటు చేసి.. రాజధాని ప్రాంతం కాబట్టి విజయవాడలోనే ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టుగా అధికారుల అభిప్రాయాన్నిబట్టి తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవాళ్లు చాలా ఎక్కువ.

ఈ నేపథ్యంలో 2007లోనే కడపలో పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ ప్రతిపాదనలు పంపించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కడపలో కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే.. కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకూ కేంద్రబిందువుగా ఉంటుందని సంబంధిత అధికారి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు అంశంపై కొత్త ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాకే పరిశీలిస్తామని మరో అధికారి తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement