బిల్లుపై చర్చ పొడిగింపా.. ముగింపా? | Andhra pradesh reorganisation bill-2013: Extension or Conclusion questions raises | Sakshi
Sakshi News home page

బిల్లుపై చర్చ పొడిగింపా.. ముగింపా?

Published Thu, Jan 30 2014 1:44 AM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM

బిల్లుపై చర్చ పొడిగింపా.. ముగింపా? - Sakshi

బిల్లుపై చర్చ పొడిగింపా.. ముగింపా?

  • నేటితో బిల్లు గడువు ఆఖరు.. సర్వత్రా ఉత్కంఠ
  •   సభలో చర్చ జరిగేనా.. బిల్లు సజావుగా వెళ్లేనా?
  •   సంప్రదింపుల్లో స్పీకర్.. ఆయన నిర్ణయమే కీలకం
  •   గడువు పెంచొద్దంటూ రాష్ట్రపతికి టీ మంత్రుల లేఖ
  •   సీఎం రాజ్యాంగవిరుద్ధంగా వెళ్తున్నారంటూ ఫిర్యాదు
  •   తన తీర్మానంపై చర్చకు తానే పట్టుబడతానన్న కిరణ్
  •   అధిష్టానం స్క్రిప్టు మేరకే కిరణ్ - కో డ్రామాలు
  •  సాక్షి, హైదరాబాద్: ‘గడువు’ కౌంట్‌డౌన్ దాదాపుగా ముగిసింది. క్లైమాక్స్ సమీపించింది. శాసనసభలో చర్చిస్తున్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 విషయమై ఇప్పుడేం జరుగుతుంది? పరిణామాలు చివరికి ఎలాంటి మలుపు తిరుగుతాయి? బిల్లుపై గురువారం అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుందా? దాన్ని తిప్పి పంపాలన్న నోటీసులను చర్చకు చేపడతారా? అసలు సభ సజావుగా సాగుతుందా? అంతిమంగా స్పీకర్ నిర్ణయమెలా ఉంటుంది? రాష్ట్రమంతా ఇప్పుడు అదే ఉత్కంఠ. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి పొడిగించిన గడువు గురువారంతో పూర్తవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఎక్కడ చూసినా ఈ అంశాలపైనే చర్చ. మరోవైపు అన్ని పార్టీల నేతలూ గురువారం అసెంబ్లీలో, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చల్లో తలమునకలయ్యారు. బిల్లుపై చర్చకు గడువు పెంచాలంటూ సభా నాయకుడైన ముఖ్యమంత్రితో పాటు పలు పార్టీలు రాసిన లేఖలపై బుధవారం రాత్రి దాకా ఎలాంటి సమాచారమూ రాలేదు. తొలి గడువు జనవరి 23తో ముగియడం, మరో వారం రోజులు పెంచుతూ సరిగ్గా అదే రోజున రాష్ట్రపతి నుంచి సమాచారం రావడం తెలిసిందే. కాబట్టి ఈసారి కూడా అలాగే చివరి రోజున సమాచారం రావొచ్చని కొందరు భావిస్తుండగా, బుధవారం సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన తీరును బట్టి గడువు పొడగింపు ఉండదని మరికొందరు అంచనా వేస్తున్నారు. గడువు పెంచని పక్షంలో బిల్లుపై చర్చకు గురువారంతోనే స్పీకర్ ముగింపు పలుకుతారు. రాష్ట్రపతి నుంచి బిల్లు గనుక దానిపై ఇప్పటిదాకా జరిగిన విషయాలను సభకు వెల్లడించి చర్చను ముగిస్తారని తెలుస్తోంది. మరోవైపు గందరగోళ పరిస్థితులు మరింత పెరగడంతో బుధవారం కూడా ఎలాంటి కార్యక్రమమూ చేపట్టకుండానే సభ వాయిదా పడింది.
     
     స్పీకర్ నిర్ణయమే కీలకమా?
     
     సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులుండటంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎలా వ్యవహరిస్తారన్నదే ప్రస్తుతం కీలకంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజ్యాంగ నిపుణులను, ఇతర ముఖ్యులను ఆయన సంప్రదిస్తున్నారు. మరోవైపు సభలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతోనూ చర్చించారు. సభ సజావుగా ముగిసేలా ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సభ లోపలే గాకుండా వెలుపల కూడా ఇబ్బందికర పరిణామాలు తలెత్తకుండా రక్షణ ఏర్పాట్లను పటిష్టపరిచారు. సభా నాయకుడిగా సీఎం ఇచ్చిన నోటీసును సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, దానిపై సభలో తీర్మానంతో పాటు ఓటింగ్ కూడా చేపట్టాల్సి ఉంటుందని స్పీకర్ భావిస్తున్నారు. మంగళవారం బీఏసీ భేటీలో ఇచ్చిన నోటీసులోనూ ఇదే అంశాన్ని ఆయన స్పష్టం చేశారు కూడా. అయితే సభలో చర్చ జరుగుతున్నది స్వయానా రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లుపై కాబట్టి దాన్ని ముగించిన తర్వాతే సీఎం నోటీసులను సభలో స్పీకర్ ప్రవేశపెట్టే అవకాశముందంటున్నారు. ‘తెలంగాణ బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నందున అభిప్రాయాలు సేకరించి గడువులోగా బిల్లును తిరిగి పంపండి’ అని గడువును పెంచిన సందర్భంగా రాసిన లేఖలో రాష్ట్రపతి స్పష్టంగా పేర్కొన్నందున దానికే స్పీకర్ ప్రాధాన్యమిస్తారని చెబుతున్నారు.
     
     ఓటింగ్‌కు ఆస్కారం లేనట్టే
     బిల్లుపై సభ్యులు డివిజన్ (ఓటింగ్) కోరినా అందుకు సభలో దానిని చేపట్టేందుకు ఆస్కారం, అవకాశాలు కనిపించడం లేదు. సీఎం నోటీసిచ్చినప్పటి నుంచీ గత మూడు రోజులుగా సభలో చర్చకు ఆస్కారమే లేకుండా ప్రతిష్టంభన నెలకొనడం తెలిసిందే. నోటీసును ఉపసంహరించుకోవాలని కోరుతున్న తెలంగాణ నేతలు గురువారం కూడా ఆ మేరకే పట్టుబట్టే అవకాశాలున్నాయి. అదే వాతావరణం పునరావృతమైతే డివిజన్ లేకుండానే సభను ముగిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే చర్చలో ఇప్పటిదాకా ఎంతమంది మాట్లాడారు, సవరణలు కోరిందెవరు వంటి విషయాలను వెల్లడించాక స్పీకర్ చర్చను ముగించాల్సి ఉంటుంది. 
     
     తీర్మానానికి పట్టుబడదాం: సీమాంధ్ర మంత్రులు
     సీమాంధ్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, శైలజానాధ్, వట్టి వసంతకుమార్ బుధవారం స్పీకర్‌ను కలిశారు. బిల్లును తిరస్కరించాలంటూ 77వ నిబంధన కింద సీఎం ఇచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని, ఆ మేరకు సభలో వెంటనే తీర్మానం ప్రవేశపెట్టించాలని కోరారు. సభా నాయకుడిగా కిరణ్ ఇచ్చిన తీర్మానాన్ని ముందుగానే ఆమోదించి రాష్ట్రపతికి పంపాలన్నారు. అభిప్రాయాలు వినిపించాల్సిన వారు చాలామంది ఉన్నందున గడువు పొడిగించాలని కోరుతూ సభ  మరో తీర్మానం చేయాల్సిన అవసరముందన్నారు. సభలో గందరగోళ పరిస్థితులతో పాటు అవాంఛనీయ ఘటనలకూ ఆస్కారమున్నందున రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. సీఎం నోటీసుపై తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై ప్రకటన చేస్తానన్నారు. సభ తాత్కాలిక విరామ సమయంలోనే మంత్రులు వేర్వేరుగా సమావేశమయ్యారు. గురువారం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సీమాంధ్ర మంత్రులు కిరణ్‌తో వేర్వేరుగా సమావేశమై చర్చించారు. తానిచ్చిన నోటీసుపై తీర్మానంకోసం స్పీకర్‌ను తానే అడుగుతానని, అనుమతివ్వక తప్పదని కిరణ్ చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సభలో ఉండేలా చూడాలన్నారు.
     
     అభిప్రాయాలతో అఫిడవిట్లు
     సభలో చర్చ జరిగే పరిస్థితి లేనందున సభలో అభిప్రాయం చెప్పని సభ్యులు స్పీకర్‌కు లిఖితపూర్వక స్వయం అఫిడవిట్లు అందించాలని కిరణ్ చెప్పారు. ముందుగానే రూపొందించిన అఫిడవిట్ పత్రాలపై ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి స్పీకర్‌కు ఇప్పించారు. కానీ ఈ అఫిడవిట్లకు ఏమేరకు చెల్లుబాటు అవుతాయన్న సంశయం మంత్రుల్లోనే వ్యక్తమైంది. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం సభ్యులు సభలో తాను చెప్పదల్చుకున్న అంశాలను క్లుప్తంగా కనీసం ఒక్క వాక్యమైనా మాట్లాడాకే అతని లిఖితపూర్వక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారంటున్నారు. గతంలో ఒక బీఏసీ భేటీలో స్పీకర్ అందించిన నోట్‌లోనూ ఇది స్పష్టంగా ఉందని గుర్తు చేస్తున్నారు.
     
     బిల్లును ఆమోదించాలంటూ తీర్మానిద్దాం
     స్పీకర్‌కు తెలంగాణ మంత్రుల లేఖ
     తెలంగాణ మంత్రులు కూడా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి కె .జానారెడ్డిల చాంబర్లలో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చకు మరో మూడు వారాల గడువు కావాలని కిరణ్, సీమాంధ్ర మంత్రులు రాష్ట్రపతికి లేఖలు రాయడం తెలిసిందే. అలా గడువు ఇవ్వరాదని కోరుతూ తాము కూడా రాష్ట్రపతికి, స్పీకర్‌కు వేర్వేరుగా లేఖలు పంపారు. బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని స్పీకర్‌కిచ్చిన లేఖలో కోరారు. సీఎం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారని, రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతిని, ప్రజాస్వామిక విధానాలను అవ మానించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. సీఎం, సీమాంధ్ర మంత్రుల తీరు రాజ్యాంతంలోని 163, 164 అధికరణాల్లో పేర్కొన్న అంశాలకు భిన్నంగా ఉందన్నారు. మంత్రులు సుదర్శన్‌రెడ్డి, సారయ్య, దానం నాగేందర్, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. గురువారం సభలో ఏం చేయాలనే దానిపై చర్చించారు. బిల్లుపై ఓటింగ్‌ను అంగీకరించరాదని, సభలో సీఎం తీర్మానానికి అవకాశమే ఇవ్వరాదన్న అభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ సీమాంధ్రులకు ఎలాంటి తీర్మానానికైనా స్పీకర్ అవకాశమిచ్చినా అడ్డుకోవాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement