
'తుళ్లురు వద్ద ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం'
విజయవాడ: విజయవాడ - గుంటూరు నగరాల మధ్యలోని తుళ్లురు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. మంగళవారం విజయవాడలో దేవినేని ఉమా విలేకర్లతో మాట్లాడుతూ... ప్రపంచస్థాయి రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మాణం చేయనున్నారని రైతులంతా భావిస్తున్నారని తెలిపారు.
రాజధాని నిర్మాణానికి రైతులు ఆనందంగా భూములు ఇస్తున్నారని చెప్పారు. కానీ రాజధాని అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై రైతుల నుంచి పలురకాల సూచనలు, సలహాలు వస్తున్నాయని దేవినేని ఉమా అన్నారు. రాజధాని అభివృద్ధిలో కృష్ణా - గుంటూరు జిల్లాల ప్రజలు భాగస్వాములవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు గల అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు.
జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నీటి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమా వెల్లడించారు. రాయలసీమలోని తుంగభద్ర కాలువల పనుల ఆధునీకరణపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాలువల అధునీకరణ వల్ల రాయలసీమలో నీటి ఎద్దడిని నివారించ వచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సుబాబుల్ రైతులను కాపాడటానికి మార్కెటింగ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్కెటింగ్ యార్డ్ల ద్వారానే అమ్మకాలు జరపాలని పత్తి రైతులందరికి దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. బందరు పోర్టు పనులు వేగవంతం చేస్తున్నామని విశదీకరించారు. ఆ పోర్టుకు రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.