ఐదేళ్ల బాలికకు ఓటు.. ఆమెకు భర్త కూడా..! | Andhra Pradesh Voter List With Full Of Mistakes | Sakshi
Sakshi News home page

ఓటరు వయసు చూడతరమా!

Published Thu, Nov 22 2018 8:54 AM | Last Updated on Thu, Nov 22 2018 8:57 AM

Andhra Pradesh Voter List With Full Of Mistakes - Sakshi

సాక్షి, అమరావతి: ఆ పాప పుట్టి ఇంకా ఏడాది కూడా నిండలేదు. కానీ ఓటు హక్కు వచ్చేసింది. ఇంకో పసిబిడ్డ వయసు ఏడాదే. కానీ, కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు ఆ బిడ్డ పుట్టుకతోనే ఓటు హక్కుతో జన్మించింది. మరో బాలిక వయసు ఐదేళ్లే. ఆమెకు ఓటు హక్కుతోపాటు 50 ఏళ్ల భర్త కూడా ఉన్నాడట! రాష్ట్రంలో ఓట్ల నమోదు ప్రక్రియలో చిత్ర విచిత్రాలివీ. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడతాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, లక్షల సంఖ్యలో అక్రమ ఓట్లను నమోదు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 52.67 లక్షలకు పైగా నకిలీ ఓట్లున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదులందాయి. తప్పుడు వయసు సమాచారంతో ఎన్నో ఓట్లు నమోదైనట్లు తేలుతోంది. వివిధ రకాలుగా నకిలీ ఓట్లు 25 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరిస్తూ ఆ జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసింది. 

బొడ్డూడని చిన్నారులూ ఓటర్లే 

  • దేశంలో ఎవరికైనా ఓటు హక్కు రావాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఓటు హక్కు కల్పించారు. 
  • నెల్లూరు నగరానికి చెందిన పేరూరి సాయికుమార్‌ వయసు కేవలం ఏడాదే కాగా ఆతడి పేరిట ‘జెడ్‌ఏఎఫ్‌1714971’ ఓటర్‌ ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు కల్పించారు. 
  • తూ.గో. జిల్లా తునికి చెందిన ఐదేళ్ల బాలిక టి.దివ్య ఓటరుగా నమోదైంది. 
  • కర్నూలు జిల్లా పాణ్యం పట్టణానికి చెందిన హుస్సేన్‌ సాహెబ్‌ వయసు 17 ఏళ్లు. ఆతడికి ‘ఎన్‌కేడీ0190108’ ఐడీ నెంబర్‌తో ఓటు ఉంది. 
  • తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బాలికకు ఐదేళ్లు నిండకుండానే ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఆమెకు భర్త కూడా ఉన్నట్లు నమోదు చేశారు. 
  • తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని జె.రామలక్ష్మి అనే ఏడాది పసిపాపకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాలో పేరు చేర్చారు. 
  • కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఏడాది వయసున్న బెజవాడ జ్యోతి అనే పాపకు ఓటు హక్కు కల్పించారు.  
  • చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండేళ్ల వయసున్న భద్రప్ప, జీలకర్ర దొర అనే ఇద్దరు బాలురకు ఓటు హక్కు దక్కింది. 
  • తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో ఆచంట అంజనీకుమార్‌ అనే రెండేళ్ల బాబుకు కూడా ఓటు హక్కు కల్పించారు. 

300 ఏళ్లు నిండిన వారున్నారా!  

  • ప్రపంచంలో వంద నుంచి నూటమూప్పై ఏళ్లు బతికినవారు ఉన్నారు. అయితే ఏపీలో ఏకంగా 352 ఏళ్లున్న వృద్ధులు కూడా ఉన్నారట! ఇది ఇక్కడి ఓటర్ల జాబితాలోని ప్రత్యేకత. 
  • మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పెద్దిపాలేనికి చెందిన ఎర్రంశెట్టి నర్సింగరావు వయసు 352 ఏళ్లు అని ఉంది. ఈయన ఓటరు ఐడీ నెంబర్‌ ఎఫ్‌జెఎక్స్‌0992941. 
  • తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వనం నారాయణమ్మ అనే మహిళ వయసు 351 ఏళ్లట! ఈమె ఓటరు ఐడీ ఏపీ052740594072. 
  • కృష్ణా జల్లా గన్నవరంలో ‘యూఓజీ0077859’ అనే ఓటర్‌ ఐడీ నెంబర్‌ ఉన్న ఎ.సూర్యనారాయణ వయసు 344 ఏళ్లు. 
  • మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పి.సుధారాణి అనే ఓటర్‌ వయసు 248 ఏళ్లు. ఈమె ఓటరు ఐడీ ఎస్‌జీఈ0247270.  
  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్‌ఏఏ0237545 ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు ఉన్న వల్లభనేని జోజప్ప వయసు 225 ఏళ్లు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement