సీలు భద్రం.. సరుకులు మాయం!
Published Fri, Feb 7 2014 1:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు పం పాల్సిన సరుకుల ను దొంగచాటుగా తప్పిస్తున్న అక్రమార్కులు వాటిని మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో కొందరు కాంట్రాక్టర్లు సరుకులను తగ్గించి ఐసీడీఎస్ కార్యాలయాలకు పంపుతున్నారు. ఈ లోటును సర్దుబాటు చేసేందుకు సూపర్‌వైజర్లు సరుకులను తగ్గించి అంగన్‌వాడీ కేంద్రాలకు ఇస్తున్నారు. ఈ సమయంలో కొం దరు సిబ్బం ది కూడా చేతివాటానికి పాల్పడుతున్నారు. ఫలితంగా లబ్ధిదారులు నష్టపోతున్నారు.
ఇదీ జరుగుతోంది..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులను సరఫరా చేసే బాధ్యతను కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరిలో కొందరు చేతివాటానికి పాల్పడుతుండటంతో సూపర్‌వైజర్ స్థాయికి చేరుకునే సరికి చాలావరకు సరుకులు తగ్గుతున్నాయి. ఉదాహరణకు 20 నూనె ప్యాకెట్లను ఓ పెట్టెలో ఉంచి సీలు వేసి సరఫరా చేస్తున్నారు. కానీ ఐసీడీఎస్ కేంద్రానికి చేరుకునేసరికి అందులో 17 లేదా 18 ప్యాకెట్లు మాత్రమే ఉంటున్నాయి. పప్పులు, ఇతర సరుకుల పరి స్థితి కూడా ఇలానే ఉంటోంది. సీలు ఉండడం తో సూపర్‌వైజర్లు వాటిని తీసుకుంటున్నారు. పెట్టె తెరిచాక తక్కువగా ఉన్నట్టు గుర్తించి కంగుతింటున్నారు. రికార్డుల పరంగా సర్దుబాటు చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాలకు తగ్గించి ఇస్తున్నారు. ఈ సమయంలో కొందరు సూపర్‌వైజర్లు కూడా చేతివాటానికి పాల్పడుతున్నారు. ఇదంతా చూస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల్లో కొందరు అదే బాట పడుతున్నారు. ఇక పౌర సరఫరాల విభాగం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న బియ్యం కొలతల్లో కూడా తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. ఈ కారణంగా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అరకొరగా అందుతోంది.
అధికారుల తీరు వల్లేనట..
కొందరు అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందని, అందువల్లే సరుకులను తగ్గించి సరఫరా చేయాల్సి వస్తోందని కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వారు సక్రమంగా ఉంటే తామెందుకు అక్రమాలకు పాల్పడతామని ప్రశ్నిస్తున్నారు. ఈ దందాపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ చక్రధరరావును గురువారం ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా ఈ విషయాలు ఇప్పటివరకు తన దృష్టికి రాలేదన్నారు. తాను సోంపేట సూపర్‌వైజర్ల సమావేశంలో ఉన్నానని, వారిని ప్రశ్నిస్తే సరుకులు తక్కువ వస్తున్నట్టు కొందరు చెప్పారన్నారు. వెంటనే దీనిపై దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి పరిశీలన తర్వాతే సరుకులు తీసుకోవాలని సూపర్‌వైజర్లను ఆదేశిస్తామన్నారు.
Advertisement
Advertisement