వీరఘట్టం: విరిగిన గచ్చులు, బీటలు వారిన గోడలు, వెలిసిపోయిన రంగులతో అధ్వానంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఇక మీదట మహర్దశ పట్టనుంది. వీటిని నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక మీదట చక్కటి వాతావరణం, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట స్థలం, గర్భిణులు, బాలింతలకు వైద్య తనిఖీలు చేసేందుకు ప్రత్యేక గదులు ఉండేలా అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించారు. వీటిని అభివృద్ధి పరచేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండే స్ధలంలో ఇక నుంచి సుందరంగా ముస్తాబైన అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
వెనుకబడిన కేంద్రాలకు మహర్దశ..
జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,199 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 1,743 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 1,250 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోను, సామాజిక భవనాల్లోను నడుపుతున్నారు. ఈ కేంద్రాల్లో 36,083 మంది గర్భిణులు, బాలింతలు, 1.10 లక్షలమంది 0–6 వయస్సుగల చిన్నారులకు సేవలు అందుతున్నాయి. ఈ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు లేనటువంటి 977 కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటికి సంబంధించిన ఫైలుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. ఒక్కో కేంద్రాన్ని రూ.7.50 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5 లక్షలు, ప్రభుత్వ నిధులు రూ.2.50 లక్షలు వెచ్చించనున్నారు. మొత్తం రూ.73.27 కోట్లను ఇందుకోసం కేటాయించారు.
ప్రత్యేకంగా గదులు
గతంలో వలే కాకుండా పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకలి్పంచింది. అందరికీ అందుబాటులో ఉండే స్ధలంలోనే వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా ప్రీ స్కూల్‌ను దృష్టిలో ఉంచుకొని వరండా, ఆటస్ధలం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున కేంద్రాలు అందుబాటులోకి రానుండడంతో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు, గర్భిణులకు ఆ అవస్ధలు తప్పనున్నాయి. ఈ కేంద్రాల్లో నాలుగు గదులను నిర్మిస్తారు. హాల్, న్యూట్రిషన్ రూమ్, కిచెన్ రూమ్, ఒక స్టోర్ రూమ్‌లుగా వీటిని వినియోగిస్తారు.
అన్ని మౌలిక వసతులతో నిర్మాణాలు
జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించాం. వీటిని అభివృద్ధి చేసి చిన్నారులు, బాలింతలకు ఉపయుక్తంగా తయారుచేస్తాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనులు జరగనున్నాయి. ప్రతి కేంద్రం అభివృద్ధికి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే పనులు చేపడతాం.
–జి.జయదేవి, ఐసీడీఎస్, పీడీ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment