ఏక కాలంలో అంగన్‌వాడీ భవనాల పనులు  | YSR Pre Primary Schools Conducted Review Meeting By CM Jagan | Sakshi
Sakshi News home page

అన్ని చోట్ల ఏక కాలంలో అంగన్‌వాడీ భవనాల పనులు 

Published Fri, Mar 5 2021 2:49 AM | Last Updated on Fri, Mar 5 2021 3:02 AM

YSR Pre Primary Schools Conducted Review Meeting By CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏక కాలంలో అంగన్‌వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభం కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతో పాటు, అద్దె భవనాల్లో ఉన్న వాటికి కొత్త నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని చెప్పారు. ఇందులో 44,119 అంగన్‌వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో, మిగతావి పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. రూ.4,600 కోట్లతో మూడు దశల్లో, మూడేళ్లలో వీటి నిర్మాణాలు, పనులు పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లిష్‌– తెలుగు డిక్షనరీ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. పీపీ–1 (వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ) పిల్లలకు 4,17,508 పుస్తకాలు, పీపీ–2 పిల్లలకు 4,17,508 పుస్తకాలను ప్రభుత్వం అందించనుందని అధికారులు వెల్లడించారు. మార్చి 20వ తేదీ నుంచి పుస్తకాల పంపిణీ ప్రారంభించి, ఏప్రిల్‌ 5 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు. వీటితో పాటు అంగన్‌వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ఇప్పటికే 16 పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 10 బోధనోపకరణాలను నెల లోగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను సీఎం ఆసక్తిగా పరిశీలించారు.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌పై ప్రచారం
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ సెంటర్లలో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని  తెలిపారు. పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతపై నిర్దేశించిన విధివిధానాలతో కూడిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) బుక్‌ అందిస్తున్నామని చెప్పారు. దీనిపై రూపొందించిన వీడియోలను వారికి షేర్‌ చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

ఇవీ ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి ఇచ్చే బోధనోపకరణాలు 
అబాకస్, కలర్‌ పెన్సిల్‌ సెట్‌ (12 రంగుల్లో 5 సెట్లు), క్రేయాన్స్‌ (12 రంగుల్లో 5 సెట్లు), స్కిప్పింగ్‌ రోప్‌ (తాడాట కోసం), బొమ్మల పుస్తకాలు (ఆకారాలు, రంగులు, వాహనాలు, పువ్వులు) 3, పజిల్స్‌ (పండ్లు, కూరగాయలు, నంబర్లు, వన్యప్రాణులు, అపోజిట్స్‌), ప్లాస్టిక్‌ బాలు, బ్యాట్‌ (రెండు సెట్లు), ఐదు రంగుల్లో మౌల్డింగ్‌ క్లే (బొమ్మలు చేసేందుకు ఉపయోగించే ఒకరకమైన మట్టి – ఐదు సెట్లు), జంతువులు, పక్షులతో కూడిన చార్టులు, పండ్లు, ఇంగ్లిష్‌ అక్షరాలు, 1–20 నంబర్లు (ఒక్కో సెట్‌), సాఫ్ట్‌ బాల్స్‌ (2), ట్రేసింగ్‌ బోర్డు (0–9 నంబర్లు, ఇంగ్లిష్‌ అక్షరాలు (2 సెట్లు), వాటర్‌ కలర్స్‌ (2 సెట్లు), సార్టింగ్‌ కిట్, నంబర్‌ పప్పెట్స్‌–స్టిక్‌ పప్పెట్స్, శాండ్‌ పేపర్‌ నంబర్స్‌ – ఇంగిష్, తెలుగు అక్షరమాల, ఫ్లాష్‌ కార్డులు – స్టోరీలు, నంబర్లు, ఇంగ్లిష్‌ లెటర్స్, బిబ్స్‌– అల్ఫాబెట్స్, నంబర్స్, అక్షరమాల, ఫింగర్‌ పప్పెట్స్, సౌండ్‌ బాక్స్‌లు, నంబర్‌ డిస్క్‌–అల్ఫాబెటిక్‌ డిస్క్, నంబర్‌ డామినోస్, కాన్‌వర్‌జేషన్‌ కార్డ్స్‌ (సంభాషణ కోసం), ఎన్‌ఎస్‌సీ – నంబర్, షేప్, కలర్, సీవీవీ వర్డ్‌ బుక్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement