pre primary schools
-
అంగన్వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తున్నాం
-
అంగన్వాడీ పోస్టుల భర్తీకి సిద్ధం
సాక్షి, అమరావతి బ్యూరో: అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చి వాటిని ప్రీప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నాడు–నేడు పథకం ద్వారా ఈ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు సర్కారు నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ రూపొందించి 250 పోస్టుల భర్తీకి కలెక్టర్ ఆమోదాన్నీ పొందింది. డివిజన్ల వారీగా త్వరలో నోటిఫికేషన్ జారీకి చర్యలు ప్రారంభించింది. ఈ పోస్టులకు రోస్టర్ పాయింట్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. రోస్టర్, మెరిట్ ప్రకారం పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. 250 ఉద్యోగాలు ఖాళీ జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో మొత్తం 4,405 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4,351 ప్రధాన కేంద్రాలు, 54 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 7 నెలల నుంచి 3 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు 1,42,196 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 85,328 మంది, బాలింతలు, గర్భిణులు మరో 61,818 మంది లబ్ధిపొందుతున్నారు. జిల్లాలో 50 అంగన్వాడీ కార్యకర్తలు, 200 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్ చైర్మన్‌గా నియామక కమిటీ ఈ పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కనీ్వనర్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, ఆర్డీఓ, సంబంధిత ప్రాజెక్ట్ సీడీపీఓలు సభ్యులుగా ఉండనున్నారు. ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఆయా సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఖాళీలకు రిజర్వేషన్ ప్రక్రియను అనుసరించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇలా.. ఈ ఏడాది జూలై 1వ తేదీకి 21 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. పోస్టు ఖాళీ ఉన్న ప్రాంతానికి చెందిన వివాహితై ఉండాలి అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ట్రైబల్ ఏరియాల్లో కొంత వెసులుబాటు ఉంది. అంగన్వాడీ ఆయా పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పారదర్శకంగా భర్తీ కలెక్టర్ ఆమోదం తెలపడంతో త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నాం. రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలను ఆర్డీఓలకు పంపాం. వారితో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ చేపడతాం. నియామకాలు పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరుగుతాయి. ఎవరూ దళారులను నమ్మొద్దు. – మనోరంజని, పీడీ, ఐసీడీఎస్, గుంటూరు -
ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏక కాలంలో అంగన్వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతో పాటు, అద్దె భవనాల్లో ఉన్న వాటికి కొత్త నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని చెప్పారు. ఇందులో 44,119 అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో, మిగతావి పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. రూ.4,600 కోట్లతో మూడు దశల్లో, మూడేళ్లలో వీటి నిర్మాణాలు, పనులు పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లిష్– తెలుగు డిక్షనరీ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. పీపీ–1 (వైఎస్సార్ ప్రీ ప్రైమరీ) పిల్లలకు 4,17,508 పుస్తకాలు, పీపీ–2 పిల్లలకు 4,17,508 పుస్తకాలను ప్రభుత్వం అందించనుందని అధికారులు వెల్లడించారు. మార్చి 20వ తేదీ నుంచి పుస్తకాల పంపిణీ ప్రారంభించి, ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు. వీటితో పాటు అంగన్వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ఇప్పటికే 16 పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 10 బోధనోపకరణాలను నెల లోగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌పై ప్రచారం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతపై నిర్దేశించిన విధివిధానాలతో కూడిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) బుక్ అందిస్తున్నామని చెప్పారు. దీనిపై రూపొందించిన వీడియోలను వారికి షేర్ చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవీ ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చే బోధనోపకరణాలు అబాకస్, కలర్ పెన్సిల్ సెట్ (12 రంగుల్లో 5 సెట్లు), క్రేయాన్స్ (12 రంగుల్లో 5 సెట్లు), స్కిప్పింగ్ రోప్ (తాడాట కోసం), బొమ్మల పుస్తకాలు (ఆకారాలు, రంగులు, వాహనాలు, పువ్వులు) 3, పజిల్స్ (పండ్లు, కూరగాయలు, నంబర్లు, వన్యప్రాణులు, అపోజిట్స్), ప్లాస్టిక్ బాలు, బ్యాట్ (రెండు సెట్లు), ఐదు రంగుల్లో మౌల్డింగ్ క్లే (బొమ్మలు చేసేందుకు ఉపయోగించే ఒకరకమైన మట్టి – ఐదు సెట్లు), జంతువులు, పక్షులతో కూడిన చార్టులు, పండ్లు, ఇంగ్లిష్ అక్షరాలు, 1–20 నంబర్లు (ఒక్కో సెట్), సాఫ్ట్ బాల్స్ (2), ట్రేసింగ్ బోర్డు (0–9 నంబర్లు, ఇంగ్లిష్ అక్షరాలు (2 సెట్లు), వాటర్ కలర్స్ (2 సెట్లు), సార్టింగ్ కిట్, నంబర్ పప్పెట్స్–స్టిక్ పప్పెట్స్, శాండ్ పేపర్ నంబర్స్ – ఇంగిష్, తెలుగు అక్షరమాల, ఫ్లాష్ కార్డులు – స్టోరీలు, నంబర్లు, ఇంగ్లిష్ లెటర్స్, బిబ్స్– అల్ఫాబెట్స్, నంబర్స్, అక్షరమాల, ఫింగర్ పప్పెట్స్, సౌండ్ బాక్స్‌లు, నంబర్ డిస్క్–అల్ఫాబెటిక్ డిస్క్, నంబర్ డామినోస్, కాన్వర్జేషన్ కార్డ్స్ (సంభాషణ కోసం), ఎన్ఎస్సీ – నంబర్, షేప్, కలర్, సీవీవీ వర్డ్ బుక్. -
అంగన్వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తోంది. శాశ్వత భవనాలతో పాటు విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. అంగన్వాడీ స్కూళ్లను త్వరలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చనున్నందున.. చిన్నారులు స్వేచ్ఛగా చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మన అంగన్వాడీ నాడు–నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. 55,607 అంగన్వాడీ స్కూళ్లుండగా.. ప్రభుత్వ భవనాలు 28,169 ఉన్నాయి. ఇవి కూడా 2010కి ముందు నిర్మించినవి కావడంతో.. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో మరమ్మతులు చేయాల్సిన పనులను ఇంజినీర్ల ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. ప్రస్తుతం 27,438 అంగన్వాడీ స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో 3,928 నూతన భవన నిర్మాణాలు 2016 నుంచి వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. ఈ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ప్రకారం అంచనాలు తయారు చేసి అసంపూర్తి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం ఈ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం రూ.214 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 29.17 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక కొత్తగా 8 వేల అంగన్వాడీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పిల్లలు ఆడుకునేందుకు, ఆహారం తీసుకునేందుకు వీలుగా ఈ భవనాల నిర్మాణాలుంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు పూర్తయ్యి.. కొత్తగా మంజూరైన భవనాల నిర్మాణాలు కూడా పూర్తయితే కొత్తగా 11,928 భవనాలు వస్తాయి. అంటే మరో 15,510 అంగన్వాడీ స్కూళ్లు మాత్రమే అద్దె భవనాల్లో ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి నీరు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన మంచి నీటి వసతి, కుళాయి నీటిని అందించేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాన్ని 100 శాతం పూర్తి చేసినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. గోవా, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పంజాబ్ కూడా 100 శాతం టార్గెట్‌ను పూర్తిచేశాయి. -
వచ్చే ఏడాది నుంచే ‘ప్రీప్రైమరీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందుకు కసరత్తు చేస్తోంది. సదుపాయాలున్న రాష్ట్రాల్లో వచ్చే ఏడాది (2021–22 విద్యా సంవత్సరం) నుంచే మొదటిసారి అధికారికంగా ప్రీప్రైమరీ విద్యాబోధనను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సదుపాయాలు లేకపోతే తగిన ఏర్పాట్లు చేసుకొని 2022–25 విద్యా సంవత్సరాల్లోపు కచ్చితంగా అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రీప్రైమరీ విద్య అమలుపై విద్యాశాఖ దృష్టి సారించింది. నూతన విద్యా విధానం అమలుపై ఇటీవల అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై కేంద్రం చర్చించింది. ఇందులో భాగంగా ప్రీప్రైమరీ విద్య అమలుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలని తెలిపింది. 7 లక్షల మందికిపైగా ప్రయోజనం.. రాష్ట్రంలో ప్రీప్రైమరీ విద్యా అమల్లోకి వస్తే 7 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వారందరికీ ప్రీప్రైమరీ విద్యా బోధన అందనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రీప్రైమరీ విద్యకు అమలుకు నోచుకోని 5 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 35 వేలకు పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా 22 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. అందులో మూడేళ్లలోపు పిల్లలు 9,14,620 మంది ఉంటే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపున్న పిల్లలు 4,80,946 మంది ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ వస్తే వారిలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పుడు ప్రైవేటు రం గంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న 7 లక్షల మంది పిల్లల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన, గత్యంతరం లేక అప్పులు చేసి మరీ చదివిస్తున్న కుటుంబాలకు చెందిన మరో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ విద్యను పొందే అవకాశం కలగనుంది. కేంద్రం సూచించిన కార్యాచరణ ప్రణాళికిదే ప్రీప్రైమరీ విద్యకు (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) సంబంధించిన సమగ్ర సమాచారాన్ని 2021–22 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సేకరించాలి. ప్రీప్రైమరీ విద్య అమలుకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పుడున్న సదుపాయాలను మరింత బలోపేతం చేసుకొని విస్తరించుకోవాలి. ప్రాథమిక పాఠశాల్లో ప్రీప్రైమరీ సెక్షన్లు/తరగతుల ప్రారంభానికి అనుగుణంగా విభజన చేసుకోవాలి. ఇవి ఉన్న రాష్ట్రాల్లో ప్రిపరేటరీ తరగతులను ప్రారంభించాలి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) ఆధ్వర్యంలో టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. ఇటు భాషా పరమైన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలను స్కూల్ కాంప్లెక్స్, స్కూల్ క్లస్టర్ల పరిధిలోకి తేవడం, విద్యా బోధన అమలు, విద్యార్థుల ఆరోగ్య సంబంధ అంశాలు చూసేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలి. పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు.. ప్రీప్రైమరీ విద్యా బోధనకు సంబంధించిన రాష్ట్రాలు పదేళ్ల దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. దానిని రెండు దశలుగా విభజించుకోవాలని పేర్కొంది. మొదటి దశలో సదుపాయాలుంటే వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాలని, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రీప్రైమరీ విద్యను 2022 నుంచి 2025లోపు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని వెల్లడించింది. ఇక రెండో దశలో 2025–30లోగా అన్ని పాఠశాల్లో బోధనలో వృత్తి పరమైన అర్హత కలిగిన టీచర్లు/అంగన్వాడీ వర్కర్లు ఉండాల్సిందే.. అందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇందుకోసం ఎస్సీఈఆర్ఈ/డైట్/సీఆర్సీలను 2022–30 మధ్యలో బలోపేతం చేయాలి. ప్రీప్రైమరీ విద్య బలోపేతం కోసం కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీడీపీ) ను అమలు చేయాలి. -
చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు
స్కూళ్ల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్లు, తాగు నీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, విద్యుదీకరణ,కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై పెయింటింగ్స్‌తో పాటు ప్లే జోన్ (క్రీడా స్థలం) ఉండేలా మార్పులు చేయాలి. ఈ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు పూర్తిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. 55,607 అంగన్వాడీల్లో కొత్తగా 27,438 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో తొలి దశలో 17,984 భవనాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించాలని, రెండో దశలో 9,454 భవనాల నిర్మాణం వచ్చే ఏడాది నవంబర్ 14న ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మిగతా వాటన్నింటిలో 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు, వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నాడు–నేడు, వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో సీఎస్ నీలం సాహ్ని, మంత్రులు వనిత, ఆదిమూలపు సురేష్ తదితరులు వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు.. పీపీ–1, పీపీ–2 ► అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల (ఎంకేఎస్) సూపర్వైజర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడడం కోసం సాధన ప్రారంభించాలి. ఇందుకు మొబైల్ యాప్ రూపొందించాలి. నవంబర్ రెండో వారం నుంచి పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ► కిండర్ గార్టెన్ స్కూల్స్‌లో ఉన్న పాఠ్య ప్రణాళిక అధ్యయనం చేయాలి. అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ పక్కాగా ఉండాలి. మరింత ఛాలెంజింగ్‌గా ఉండాలి. ► ఈ సమీక్షలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్నితో పాటు, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్లో నాడు–నేడు పనులు ► నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తింపు పూర్తి చేసి, ఆ తర్వాత అంగన్వాడీ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలి. మెటీరియల్ సేకరణ, ఇతర పనులన్నీ పూర్తి చేసుకుని, ఈ ఏడాది డిసెంబర్ 1న పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్ 30 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలి. ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వైజరీ కమిటీ, కరిక్యులమ్ కమిటీలు.. ఫుడ్, శానిటేషన్, బాత్రూమ్స్‌పై కూడా మానిటరింగ్ చేయాలి. -
అద్దె భవనాల్లో...
జైనథ్ : శిశువులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తూ వారి మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడే అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో చాలీచాలని వసతుల నడుమ చిన్న చిన్న పెంకుటింట్లలో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన కూడ కేంద్రాలు నడిపే పరిస్థితి కనిపిస్తలేదు. దీంతో శిశువులు, గర్బిణులు, బాలింతలతో పాటు కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు, ఆయాలు సైతం నానా అవస్థలు పడుతున్నారు. మధ్యలోనే నిలిచిన మోడల్ కేంద్రం మండల కేంద్రంలో బీసీ హస్టల్ వెనుక వైపు నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రం పనులు మధ్యలోనే అగిపోయాయి. 2004లో మొదలైన ఈ పనులు దాదాపు 11 సంతత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. నిధుల కొరతతో అప్పట్లో ఈ పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం అది పశువులకు స్థావరంగా మారింది. కొద్దిపాటు ఖర్చుతో ఈ భవనం పూర్తిచేసి, ఒక కేంద్రాన్ని నడిపే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నతా«ధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదు. దీంతో చుట్టు పిచ్చిమొక్కలు, ముండ్ల పొదలతో ఈ భవనం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకుంది. కొనసాగుతున్న కొత్త భవనాలు... మండలంలోని జైనథ్–1, ఆకోలి, కామాయి, గిమ్మ–3, కౌఠ, పార్డి(బి), జైనథ్–2 కేంద్రాలకు గత సంవత్సరమే స్వంత భవనాలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కొక్క భవనానికి రూ.6.25లక్షలు కేటాయించినప్పటికీ నిధులు లేక భవన నిర్మాణ పనులు మొదలు కానీ దుస్థితి నెలకొంది. భోరజ్, మార్గుడ గ్రామాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ గత సంవత్సర కాలంగా పూర్తి కాలేదు. దీంతో నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. 10 కేంద్రాలకే సొంత భవనాలు... మండలంలో 29 గ్రామ పంచాయితీల పరిధిలో 56 గ్రామాల్లో 70 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 66 కేంద్రాలకు ప్రస్తుతం రెగ్యూలర్ టీచర్లు ఉండగా, ఇంకా నాలుగు కేంద్రాలకు ఇన్చార్జిలు ఉన్నారు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం 66 మంది కార్యకర్తలు, 63 మంది ఆయాలు, ఒక సూపర్వైజర్ పనిచేస్తున్నారు. ఈ 66 కేంద్రాల్లో కేవలం కూర, జైనథ్–3, కరంజి(బి), లక్ష్మీపూర్, సావాపూర్, బాలాపూర్, లేఖర్వాడ, సిర్సన్న, గూడ, పార్డి(బి) గ్రామాల్లోని 10 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇంకా 15 కేంద్రాలు పాఠశాల భవనాలు, జీపీ భవనాల్లో సాగుతున్నాయి. మిగిలిన 41 కేంద్రాలు మాత్రం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని మారుమూల గ్రామాల్లో అద్దెకు భవనాలు కూడ దొరకని పరిస్థితి. గత్యంతరం లేక తడకలు, ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ప్రారంభానికి ముందే పగుళ్లు... మండలంలోని భోరజ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ రూ.6.5లక్షలతో పక్క అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి 2014లో నిధులు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసికరంగా పనులు చేపట్టడంతో భవనం పూర్తికాక ముందే పగుళ్లు తేలాయి. ఇప్పటికీ ఇంకా కిటికీలు, తలుపులు బిగించడం వంటి పనులు అలానే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తికాకముందే భవనానికి పగుళ్లు తేలడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పనులపై అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ తీవ్రంగా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తుల చెబుతున్నారు. దీనికి తోడు సరిగా క్యూరింగ్ కూడ చేపట్టకపోవడంతో ఎటుచూసిన పగుళ్లే దర్శనమిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటువైపు దృష్టి సారించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. -
బొమ్మల పాఠం
అంగన్వాడీల్లో మారిన సిలబస్ చిన్నారుల్లో సృజనాత్మకతకు పదును పూర్వ ప్రాథమిక విద్యతో గట్టి పునాది జిల్లాలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు: 5,126 మొత్తం చిన్నారులు :2,58,948 సొంత భవనాలున్న సెంటర్లు :1540 అద్దె, తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న సెంటర్లు :2705 అంగన్వాడీ సిబ్బంది :5,120 ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంఠస్త విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థుల్లో సృజనాత్మకకు పదును పెట్టేలా బోధనలు సాగుతున్నాయి. పరీక్షల్లోనూ స్వతహాగా జవాబులు రాసేలా విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. పూర్వ ప్రాథమిక విద్యనుంచే విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించే దిశగా సిలబస్‌లో రూపకల్పనలు జరుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలనుంచే తొలి అడుగులు పడుతున్నాయి. గుమ్మఘట్ట : అంగన్వాడీ కేంద్రాల తీరుతెన్నులు మారుతున్నాయి. ఇప్పటివరకు పిల్లలకు పౌష్టికాహారం.. ఆటపాటలు.. అక్షరాల అభ్యసనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారు. మారుతున్న కాలానికనుగుణంగా చిన్నారులను తీర్చేందుకు అంగన్వాడీల్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం బోధన విద్యావిధానంలో మార్పులు చేశారు. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న పూర్వ ప్రాథమిక విద్యకు మరింత పదును పెట్టారు. వివిధ రకాల కృత్యధార విజ్ఞానదాయక సిలబస్‌ను రూపకల్పన చేశారు. సృజనాత్మకతకు పెద్దపీట బడిమెట్లు ఎక్కేలోగా పిల్లలు స్వతహాగా బొమ్మచూసి బోలెడు విషయాలు చెప్పేలా, వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల వేళలతో పాటు సిలబస్ మార్పుచేశారు. అంతేకాకుండా ప్రత్యేక బోధన కిట్లు తయారుచేసి అన్ని కేంద్రాలకు సరఫరా చేశారు. వీటి సాయంతో బోధన గురించి సీడీపీఓ, పర్యవేక్షకురాళ్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 1.16 లక్షల మంది చిన్నారులను చురుగ్గా తయారుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 14 అంశాలతో కూడిన బోధన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమం, కృత్యదార బోధన నిర్వహణకు అందించిన పరికరాలను విధిగా వినియోగించాలి. పిల్లల్లో చురుకైన ఆలోచన, సృజనత్మాకత, చేతి కండరాల అభివృద్ధి, మంచి అలవాట్లు పెంపొందించేందుకు దోహదపడేలా చూడాలి. ఇందుకోసం పూర్వ ప్రాథమిక విద్య కిట్లలో 14 అంశాలకు సంబంధించిన పరికరాలను పొందుపర్చారు. ఏఏ అంశాలను ఎలా బోధించాలి. ఏ పరికరం వల్ల ఎటువంటి ప్రయోజనం పొందవచ్చునో అంగన్వాడీ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. పరికరాలు.. ప్రయోజనాలు ఇలా.. కృత్యమాలికలు (యాక్టివిటీ బుక్స్): 20 డ్రాయింగ్ పుస్తకాలను ఇచ్చారు. మూడు, నాలుగేళ్లు పై బడిన పిల్లలతో వీటిలో గీతల ఆధారంగా అక్షరాలపై రంగులు వేయించాలి. తద్వార పిల్లల్లో మేధాశక్తిని పెంపొందుతుంది. సృజనాత్మకత, స్వతహాగా ఆలోచించేందుకు ఉపయోగ పడుతుంది. వర్క్‌బుక్: ఒక్కో విద్యార్థికి ఒక్కో పుస్తకం ఇచ్చి వారే అందులో రాసేలా చూస్తారు. దీనివల్ల అక్షరాల సంసిద్ధత, వాటిని గుర్తించడం, పదాలు పలకటం అలువడుతుంది. రాయడం, చదవడంపై ఆసక్తి పెరుగుతుంది. చేయికి కంటికి సమన్వయం కలిగేలా దీన్ని రూపొందించారు. ఆకృతులు: వివిధ ఆకారాలు, పరిమాణాల పూసలు, వివిధ ఆకారాల్లో చిన్న, పెద్ద పరిమాణంలో ప్లాస్టిక్ ఆకృతులు ఇచ్చారు. వృత్తం, త్రికోణం ఇలా వివిధ ఆకృతుల్లోని వస్తువులను చిన్నవాటి నుంచి పెద్ద వాటిని వేరు చేయడం చిన్నారులకు నేర్పాలి. దీనిద్వారా ఆకృతులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా చిన్న, పెద్ద కండరాల అభివృద్ధి, ఆలోచించడం, ఆనందించడం, మేధాశక్తి పెంపొందించడం, రంగులు గుర్తించడం, పరిశీలన శక్తి పెరుగుతుంది. బొమ్మలు: ఫింగర్ పప్పెట్లు, బొమ్మలు, రంగు రంగుల మైనం పెన్సిళ్లు, టచ్ టాబ్ లెట్స్, స్టిక్ పప్పెట్స్, (మంచి అలవాట్లు), ముసుగుల (మాస్కులు), కన్స్ట్రక్షన్ బ్లాక్‌లు, నట్టులు, బోల్టులు, బాస్కెట్‌బాల్, గడియారం, సీతాకోకచిలుక, షూలెస్, లేస్ బోర్డులు అందించారు. ఈ కిట్లలో ఇచ్చిన పరికరాల ప్రయోజనాలను తెలియజేయడం ద్వారా పిల్లల్లో మేధాశక్తి, సృజనాత్మకతను వెలికి తీసేలా సిలబస్ రూపొందించారు. సక్రమంగా అమలయ్యేలా చూస్తాం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాం. 14 అంశాలకు సంబంధించిన కిట్లను అన్ని కేంద్రాలకు సరఫరా చేశాం. ఈ విధానంతో చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా అంగన్వాడీలు బోధన సాగుతుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారులకు నాణ్యమైన బోధన సాగేలా చూస్తాం – కృష్ణకుమారి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ, అనంతపురం