సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తోంది. శాశ్వత భవనాలతో పాటు విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ స్కూళ్లను త్వరలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చనున్నందున.. చిన్నారులు స్వేచ్ఛగా చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మన అంగన్‌వాడీ నాడు–నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. 55,607 అంగన్‌వాడీ స్కూళ్లుండగా.. ప్రభుత్వ భవనాలు 28,169 ఉన్నాయి. ఇవి కూడా 2010కి ముందు నిర్మించినవి కావడంతో.. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో మరమ్మతులు చేయాల్సిన పనులను ఇంజినీర్ల ద్వారా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది.
ప్రస్తుతం 27,438 అంగన్‌వాడీ స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో 3,928 నూతన భవన నిర్మాణాలు 2016 నుంచి వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. ఈ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం అంచనాలు తయారు చేసి అసంపూర్తి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం ఈ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం రూ.214 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 29.17 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక కొత్తగా 8 వేల అంగన్‌వాడీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పిల్లలు ఆడుకునేందుకు, ఆహారం తీసుకునేందుకు వీలుగా ఈ భవనాల నిర్మాణాలుంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు పూర్తయ్యి.. కొత్తగా మంజూరైన భవనాల నిర్మాణాలు కూడా పూర్తయితే కొత్తగా 11,928 భవనాలు వస్తాయి. అంటే మరో 15,510 అంగన్‌వాడీ స్కూళ్లు మాత్రమే అద్దె భవనాల్లో ఉంటాయి.
అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచి నీరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన మంచి నీటి వసతి, కుళాయి నీటిని అందించేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాన్ని 100 శాతం పూర్తి చేసినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. గోవా, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణా, పంజాబ్ కూడా 100 శాతం టార్గెట్‌ను పూర్తిచేశాయి.
అంగన్‌వాడీ స్కూళ్లలో అధునాతన సౌకర్యాలు
Published Sun, Feb 21 2021 6:29 AM | Last Updated on Sun, Feb 21 2021 6:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment