సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందుకు కసరత్తు చేస్తోంది. సదుపాయాలున్న రాష్ట్రాల్లో వచ్చే ఏడాది (2021–22 విద్యా సంవత్సరం) నుంచే మొదటిసారి అధికారికంగా ప్రీప్రైమరీ విద్యాబోధనను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సదుపాయాలు లేకపోతే తగిన ఏర్పాట్లు చేసుకొని 2022–25 విద్యా సంవత్సరాల్లోపు కచ్చితంగా అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రీప్రైమరీ విద్య అమలుపై విద్యాశాఖ దృష్టి సారించింది. నూతన విద్యా విధానం అమలుపై ఇటీవల అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై కేంద్రం చర్చించింది. ఇందులో భాగంగా ప్రీప్రైమరీ విద్య అమలుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలని తెలిపింది.
7 లక్షల మందికిపైగా ప్రయోజనం..
రాష్ట్రంలో ప్రీప్రైమరీ విద్యా అమల్లోకి వస్తే 7 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వారందరికీ ప్రీప్రైమరీ విద్యా బోధన అందనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రీప్రైమరీ విద్యకు అమలుకు నోచుకోని 5 లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో ప్రీప్రైమరీ విద్యా బోధన అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 35 వేలకు పైగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 22 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. అందులో మూడేళ్లలోపు పిల్లలు 9,14,620 మంది ఉంటే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపున్న పిల్లలు 4,80,946 మంది ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ వస్తే వారిలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పుడు ప్రైవేటు రం గంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్న 7 లక్షల మంది పిల్లల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన, గత్యంతరం లేక అప్పులు చేసి మరీ చదివిస్తున్న కుటుంబాలకు చెందిన మరో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ విద్యను పొందే అవకాశం కలగనుంది.
కేంద్రం సూచించిన కార్యాచరణ ప్రణాళికిదే
ప్రీప్రైమరీ విద్యకు (ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్) సంబంధించిన సమగ్ర సమాచారాన్ని 2021–22 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సేకరించాలి. ప్రీప్రైమరీ విద్య అమలుకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పుడున్న సదుపాయాలను మరింత బలోపేతం చేసుకొని విస్తరించుకోవాలి. ప్రాథమిక పాఠశాల్లో ప్రీప్రైమరీ సెక్షన్లు/తరగతుల ప్రారంభానికి అనుగుణంగా విభజన చేసుకోవాలి. ఇవి ఉన్న రాష్ట్రాల్లో ప్రిపరేటరీ తరగతులను ప్రారంభించాలి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) ఆధ్వర్యంలో టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. ఇటు భాషా పరమైన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాలను స్కూల్ కాంప్లెక్స్, స్కూల్ క్లస్టర్ల పరిధిలోకి తేవడం, విద్యా బోధన అమలు, విద్యార్థుల ఆరోగ్య సంబంధ అంశాలు చూసేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలి.
పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు..
ప్రీప్రైమరీ విద్యా బోధనకు సంబంధించిన రాష్ట్రాలు పదేళ్ల దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. దానిని రెండు దశలుగా విభజించుకోవాలని పేర్కొంది. మొదటి దశలో సదుపాయాలుంటే వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తేవాలని, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రీప్రైమరీ విద్యను 2022 నుంచి 2025లోపు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని వెల్లడించింది. ఇక రెండో దశలో 2025–30లోగా అన్ని పాఠశాల్లో బోధనలో వృత్తి పరమైన అర్హత కలిగిన టీచర్లు/అంగన్‌వాడీ వర్కర్లు ఉండాల్సిందే.. అందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇందుకోసం ఎస్‌సీఈఆర్‌ఈ/డైట్/సీఆర్‌సీలను 2022–30 మధ్యలో బలోపేతం చేయాలి. ప్రీప్రైమరీ విద్య బలోపేతం కోసం కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (సీడీపీ) ను అమలు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment