దుకాణంలో మార్క్ చేసిన కోడిగుడ్లు
సాక్షి ప్రతినిధి: శ్రీకాకుళం: అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు అంగట్లో ప్రత్యక్షమయ్యాయి. బాలలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం కింద వారానికి ఆరు గుడ్లు రోజుకొకటి చొప్పున అందించాల్సి ఉంది. జిల్లాలోని 18 ప్రాజెక్టుల కింద 2,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటికి కోడిగుడ్లను ఒక ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ సరఫరా చేస్తోంది. ఈ సరఫరాను జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
అయితే అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లలో కొంతమేర బ్లాక్ మార్కెట్‌కు మరలుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తార్కాణం అన్నట్లుగా శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్‌లోని ఒక గుడ్లు హోల్‌సేల్ దుకాణంలో బుధవారం సాయంత్రం బయటపడ్డాయి. 85 ట్రేలలో ఈ గుడ్లు ఉండటంతో కొనుగోలుదారులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఇన్‌చార్జ్ ఆర్డీవో ఎస్.ధర్మారావు, శ్రీకాకుళం తహసీల్దారు పి.మురళీకృష్ణ, ఆర్‌ఐ ఎన్.వెంకటరావు, ఐసీడీఎస్ నోడల్ అధికారి ఝాన్సీ తదితరులు ఆ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు 2,500 గుడ్లు వరకూ ఆ దుకాణంలో వెలుగుచూశాయి. అయితే దుకాణదారులు మాత్రం విచిత్ర వాదన వినిపించారు. నిర్దేశించిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్న (వెయిట్ లెస్) గుడ్లు కావడంతో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వెనక్కి వచ్చాయని బుకాయించే ప్రయత్నం చేశారు.
వెనక్కి పంపిన గుడ్లు దుకాణంలో ఉంచడమేమిటన్న అధికారుల ప్రశ్నకు వారి నుంచి సరైన సమాధానం రాలేదు. అందుకు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో వారి వాదనల్లో పస లేకుండా పోయింది. దీంతో అధికారులు ఆ కోడిగుడ్లను సీజ్ చేశారు. విక్రయదారుల నుంచి వివరణ తీసుకొని, తదుపరి చర్యల కోసం ఐసీడీఎస్ అధికారులను ఇన్‌చార్జ్ ఆర్‌డీవో ధర్మారావు ఆదేశించారు.
అడ్డూ అదుపూ లేకుండా...
అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు తరచుగా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోతుండటంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. ఈ అక్రమాలను నిరోధించేందుకు గుడ్లపై మార్కు వేసి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
అయితే ఇలా మార్కింగ్ చేసిన గుడ్లను బయటి మార్కెట్‌లో విక్రయించడానికి వీల్లేదు. ఏ కారణం చేతనైనా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి తిప్పి పంపినా ప్రైవేట్ దుకాణాల్లో ఉంచకూడదు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన గుడ్లను మిగిలించుకొని పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై ఇప్పటికే నిఘా ఉంది.
ఈ అక్రమాలకు ఐసీడీఎస్‌లోని కొంతమంది సిబ్బంది, అధికారులు కూడా సహకరించడం వల్లే వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో అంగన్‌వాడీ కేంద్రాల కోడిగుడ్లను విక్రయించగలుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment