వారుపోతే...వీరు అందరిదీ అదే తీరు
అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరిగా అందడం లేదు. శివారు కేంద్రాలకు అసలు చేరడం లేదు. నాసిరకం సరుకులు అందిస్తున్నారు. సరఫరా చేస్తున్న సరుకులో తరుగు ఎక్కువగా ఉంటోంది. అవి బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నాయి.
అంగన్‌వాడీ సరుకుల సరఫరాపై వస్తున్న ఆరోపణలివి. ఎందుకిలా జరుగుతోంది. సరుకుల కోసం ఖర్చు పెడుతున్న కోట్లాది రూపాయలేమవుతున్నాయి అనే అనుమానం ఎవరికైనా రాకమానదు. సరుకుల సరఫరాలో జరుగుతున్న తంతు, చేతులు మారుతున్న విధానం, ముడుపుల భాగోతాన్ని గమనిస్తే మాత్రం అందులో వింతేముందని అనిపించక మానదు. - ఒక వైపు కాంగ్రెస్ హయాంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని విమర్శలు గుప్పిస్తూనే కాసులు దండుకునే విషయంలో ఆ నేతల బాటలోనే టీడీపీ నాయకులూ నడుస్తున్నారు. అంగన్‌వాడీ సరుకుల సరఫరా కాంట్రాక్ట్‌పై ఆ నేతల కన్నుపడింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,987 అంగన్‌వాడీ కేం ద్రాలు, 742 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటికి సరకులు సరఫరా చేసేందుకు ప్రతి ఏడాదీ టెండర్లు పిలుస్తారు. దాదాపు ప్రతిసారీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీఎస్‌ఎంఎస్) ఈ టెండర్‌ను దక్కించుకుంటోంది. 2013 జూన్‌లో పిలిచిన టెండర్లలో కిలో కందిపప్పు రూ.71కి, కిలో కొమ్ముశనగ రూ.44కి, విజయా బ్రాండ్ ఆయిల్‌ను ఎంఆర్‌పీలో 8 శాతం తక్కువ రేటుకు, గుడ్లను నెక్ ప్రకటించిన నెలవారీ సరాసరి రేటుకు సరఫరా చేసేందుకు డీసీఎంఎస్ ముందుకొచ్చింది.
ఏడాది కాల పరిమితితో సరఫరా చేస్తూ వస్తోంది. ఈ విధంగా ఒప్పందం వరకూ బాగానే ఉన్నా సరఫరా బాధ్యతలు చేతికొచ్చిన తరువాత వ్యవహారం పక్కదారి పడుతోంది. టెండర్ల ద్వారా దక్కించుకున్న సరఫరా బాధ్యతలను డీసీఎంఎస్ సొంతంగా చేపట్టకుండా సబ్ కాంట్రాక్ట్ రూపేణా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఈ క్రమంలో రాజకీయం పులుముకుంటోంది. నెలకు సుమారు రూ.కోటి రూపాయల సరకుల సరఫరా కాంట్రాక్ట్‌పై ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఒత్తిళ్ల మీద ఒత్తిళ్లు తీసుకురావడంతో వాళ్లు చెప్పివారికే డీసీఎంఎస్ అధికారులు కూడా సరుకులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగిస్తున్నారు.
సాధారణంగా రూ.5 లక్షలకు పైబడి సరుకుల సరఫరాకు టెండర్లు పిలవాల్సి ఉన్నా అధికార పార్టీ నేతల జోక్యంతో ఎటువంటి టెండర్లు పిలవకుండానే ఆ పార్టీ నాయకులు చెప్పినవారికి కట్టబెడుతున్నారు. ఈ విధంగా గత ఎనిమిదేళ్లుగా విశాఖపట్నానికి చెందిన ఓ ట్రేడర్స్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ వచ్చింది. సరుకులను తెచ్చిన దగ్గరి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసేంత వరకు బాధ్యతను ఆ ట్రేడర్స్ యాజమాన్యం తీసుకునేది. కాంట్రాక్ట్ ఇచ్చినందుకు మొత్తం టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం మొత్తాన్ని డీసీఎంఎస్‌కి ఇచ్చేది. ఈ లెక్కన ప్రతి నెలా డీసీఎంఎస్‌కు సరాసరి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కాంట్రాక్ట్ ఇప్పించినందుకు అదృశ్య రాజకీయ శక్తులకు కోట్లాది రూపాయల మేర ముడుపులు వెళ్లేవి. సరకుల సరఫరాలో చేతివాటం ప్రదర్శించి ఓ ప్రజాప్రతినిధికి రూ.30 లక్షలు, ఇంకో ప్రజాప్రతినిధికి రూ.10 లక్షలు, అధికార గణానికి దాదాపు రూ.20 లక్షలు, చోటామోటా నాయకులకు మరో రూ.10 లక్షల వరకు ముడుపులుగా వెళ్లేవన్న విమర్శలు ఉన్నాయి. ఇదొక బయటికి కనిపించని స్కామ్‌గా విస్తరించిపోయింది.
గత పాలకుల మాదిరిగానే..
ఇదంతా కళ్లారా చూసిన టీడీపీ నాయకులకు ఇప్పుడదే ఆశ పట్టుకుంది. వాళ్ల మాదిరిగానే దోచుకోవాలని ఆరాటపడుతున్నారు. అంగన్‌వాడీలకు సరకులు సరఫరా చేసే బాధ్యతలను తమకివ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గత ఏడాదిలో జూన్‌లో పిలిచిన టెండర్ల కాలపరిమితి ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన సర్కార్ మళ్లీ టెండర్లు పిలవకుండా వచ్చే ఏడాది మార్చి వరకు డీసీఎంఎస్‌కే ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేయడంతో డీసీఎంఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. గతంలో కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టే తమకీ ఇవ్వాలని ఇప్పుడు చీపురుపల్లికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని సిఫారసు చేయగా, రాష్ట్రమంత్రి పీతల సుజాత మరొకరిని సిఫారసు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు మరో వ్యక్తిని సూచిస్తూ డీసీఎంఎస్‌కు వర్తమానం పంపారు.
ఆ ట్రేడర్స్ తొలగింపు
దీంతో ఎందుకొచ్చిన గొడవని కాంగ్రెస్ నేతల అండతో సరకుల సరఫరా కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ట్రేడర్స్‌ను డీసీఎంఎస్ అధికారులు తొలగించారు. వారి స్థానంలో జూలై నెలకు సంబంధించి టీడీపీ నేతలు సూచించిన వారికే సరకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించారు. కానీ, టీడీపీకి చెందిన మరికొందరి దృష్టి సరుకుల సరఫరాపై పడింది. తాజాగా చీపురుపల్లికి చెందిన మరో ట్రేడర్‌ను, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను రంగంలోకి దించారు. వీరికి కూడా సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో డీసీఎంఎస్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు.
రోజుకొకరు వస్తుండడంతో వీరందరికీ అవకాశమిచ్చేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి ఎవరెవరికీ ఇవ్వాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఇదే విషయమై డీసీఎంఎస్ పాలకవర్గం సమావేశం కానున్నట్టు తెలిసింది. ఏదైనా అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గాల్సిందే అన్న వాదన విన్పిస్తోంది. లేదంటే ఏదోకొర్రీ పెట్టి డీసీఎంఎస్‌కు ఉన్న ఎక్స్‌టెన్షన్‌ను రద్దు చేసేస్తారేమోనన్న భయం అక్కడి అధికారులకు ఉంది. మొత్తానికి అంగన్‌వాడీ సరుకుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయలను పంచేసుకునేందుకు టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. డీసీఎంఎస్ అధికారుల మెడపై కత్తి పెడుతున్నారు. మరి అక్రమాలు అరికడతామని, అవినీతికి అడ్డుకట్ట వేస్తామని గొప్పలు పలుకుతున్న మంత్రులేం చేస్తారో చూడాలి.