marketing society
-
వారుపోతే...వీరు అందరిదీ అదే తీరు
అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరిగా అందడం లేదు. శివారు కేంద్రాలకు అసలు చేరడం లేదు. నాసిరకం సరుకులు అందిస్తున్నారు. సరఫరా చేస్తున్న సరుకులో తరుగు ఎక్కువగా ఉంటోంది. అవి బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. అంగన్వాడీ సరుకుల సరఫరాపై వస్తున్న ఆరోపణలివి. ఎందుకిలా జరుగుతోంది. సరుకుల కోసం ఖర్చు పెడుతున్న కోట్లాది రూపాయలేమవుతున్నాయి అనే అనుమానం ఎవరికైనా రాకమానదు. సరుకుల సరఫరాలో జరుగుతున్న తంతు, చేతులు మారుతున్న విధానం, ముడుపుల భాగోతాన్ని గమనిస్తే మాత్రం అందులో వింతేముందని అనిపించక మానదు. - ఒక వైపు కాంగ్రెస్ హయాంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని విమర్శలు గుప్పిస్తూనే కాసులు దండుకునే విషయంలో ఆ నేతల బాటలోనే టీడీపీ నాయకులూ నడుస్తున్నారు. అంగన్వాడీ సరుకుల సరఫరా కాంట్రాక్ట్‌పై ఆ నేతల కన్నుపడింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,987 అంగన్వాడీ కేం ద్రాలు, 742 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటికి సరకులు సరఫరా చేసేందుకు ప్రతి ఏడాదీ టెండర్లు పిలుస్తారు. దాదాపు ప్రతిసారీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీఎస్ఎంఎస్) ఈ టెండర్‌ను దక్కించుకుంటోంది. 2013 జూన్‌లో పిలిచిన టెండర్లలో కిలో కందిపప్పు రూ.71కి, కిలో కొమ్ముశనగ రూ.44కి, విజయా బ్రాండ్ ఆయిల్‌ను ఎంఆర్పీలో 8 శాతం తక్కువ రేటుకు, గుడ్లను నెక్ ప్రకటించిన నెలవారీ సరాసరి రేటుకు సరఫరా చేసేందుకు డీసీఎంఎస్ ముందుకొచ్చింది. ఏడాది కాల పరిమితితో సరఫరా చేస్తూ వస్తోంది. ఈ విధంగా ఒప్పందం వరకూ బాగానే ఉన్నా సరఫరా బాధ్యతలు చేతికొచ్చిన తరువాత వ్యవహారం పక్కదారి పడుతోంది. టెండర్ల ద్వారా దక్కించుకున్న సరఫరా బాధ్యతలను డీసీఎంఎస్ సొంతంగా చేపట్టకుండా సబ్ కాంట్రాక్ట్ రూపేణా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఈ క్రమంలో రాజకీయం పులుముకుంటోంది. నెలకు సుమారు రూ.కోటి రూపాయల సరకుల సరఫరా కాంట్రాక్ట్‌పై ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఒత్తిళ్ల మీద ఒత్తిళ్లు తీసుకురావడంతో వాళ్లు చెప్పివారికే డీసీఎంఎస్ అధికారులు కూడా సరుకులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగిస్తున్నారు. సాధారణంగా రూ.5 లక్షలకు పైబడి సరుకుల సరఫరాకు టెండర్లు పిలవాల్సి ఉన్నా అధికార పార్టీ నేతల జోక్యంతో ఎటువంటి టెండర్లు పిలవకుండానే ఆ పార్టీ నాయకులు చెప్పినవారికి కట్టబెడుతున్నారు. ఈ విధంగా గత ఎనిమిదేళ్లుగా విశాఖపట్నానికి చెందిన ఓ ట్రేడర్స్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ వచ్చింది. సరుకులను తెచ్చిన దగ్గరి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేంత వరకు బాధ్యతను ఆ ట్రేడర్స్ యాజమాన్యం తీసుకునేది. కాంట్రాక్ట్ ఇచ్చినందుకు మొత్తం టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం మొత్తాన్ని డీసీఎంఎస్‌కి ఇచ్చేది. ఈ లెక్కన ప్రతి నెలా డీసీఎంఎస్‌కు సరాసరి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కాంట్రాక్ట్ ఇప్పించినందుకు అదృశ్య రాజకీయ శక్తులకు కోట్లాది రూపాయల మేర ముడుపులు వెళ్లేవి. సరకుల సరఫరాలో చేతివాటం ప్రదర్శించి ఓ ప్రజాప్రతినిధికి రూ.30 లక్షలు, ఇంకో ప్రజాప్రతినిధికి రూ.10 లక్షలు, అధికార గణానికి దాదాపు రూ.20 లక్షలు, చోటామోటా నాయకులకు మరో రూ.10 లక్షల వరకు ముడుపులుగా వెళ్లేవన్న విమర్శలు ఉన్నాయి. ఇదొక బయటికి కనిపించని స్కామ్‌గా విస్తరించిపోయింది. గత పాలకుల మాదిరిగానే.. ఇదంతా కళ్లారా చూసిన టీడీపీ నాయకులకు ఇప్పుడదే ఆశ పట్టుకుంది. వాళ్ల మాదిరిగానే దోచుకోవాలని ఆరాటపడుతున్నారు. అంగన్వాడీలకు సరకులు సరఫరా చేసే బాధ్యతలను తమకివ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గత ఏడాదిలో జూన్‌లో పిలిచిన టెండర్ల కాలపరిమితి ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన సర్కార్ మళ్లీ టెండర్లు పిలవకుండా వచ్చే ఏడాది మార్చి వరకు డీసీఎంఎస్‌కే ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేయడంతో డీసీఎంఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. గతంలో కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టే తమకీ ఇవ్వాలని ఇప్పుడు చీపురుపల్లికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని సిఫారసు చేయగా, రాష్ట్రమంత్రి పీతల సుజాత మరొకరిని సిఫారసు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు మరో వ్యక్తిని సూచిస్తూ డీసీఎంఎస్‌కు వర్తమానం పంపారు. ఆ ట్రేడర్స్ తొలగింపు దీంతో ఎందుకొచ్చిన గొడవని కాంగ్రెస్ నేతల అండతో సరకుల సరఫరా కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ట్రేడర్స్‌ను డీసీఎంఎస్ అధికారులు తొలగించారు. వారి స్థానంలో జూలై నెలకు సంబంధించి టీడీపీ నేతలు సూచించిన వారికే సరకులు సరఫరా చేసే బాధ్యతను అప్పగించారు. కానీ, టీడీపీకి చెందిన మరికొందరి దృష్టి సరుకుల సరఫరాపై పడింది. తాజాగా చీపురుపల్లికి చెందిన మరో ట్రేడర్ను, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను రంగంలోకి దించారు. వీరికి కూడా సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో డీసీఎంఎస్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. రోజుకొకరు వస్తుండడంతో వీరందరికీ అవకాశమిచ్చేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి ఎవరెవరికీ ఇవ్వాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఇదే విషయమై డీసీఎంఎస్ పాలకవర్గం సమావేశం కానున్నట్టు తెలిసింది. ఏదైనా అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గాల్సిందే అన్న వాదన విన్పిస్తోంది. లేదంటే ఏదోకొర్రీ పెట్టి డీసీఎంఎస్‌కు ఉన్న ఎక్స్‌టెన్షన్‌ను రద్దు చేసేస్తారేమోనన్న భయం అక్కడి అధికారులకు ఉంది. మొత్తానికి అంగన్వాడీ సరుకుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయలను పంచేసుకునేందుకు టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. డీసీఎంఎస్ అధికారుల మెడపై కత్తి పెడుతున్నారు. మరి అక్రమాలు అరికడతామని, అవినీతికి అడ్డుకట్ట వేస్తామని గొప్పలు పలుకుతున్న మంత్రులేం చేస్తారో చూడాలి. -
‘సహకార’ పీఠాలు వైఎస్సార్ సీపీవే
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో రెండు పాలకవర్గాల పగ్గాలూ వైఎస్సార్ సీపీకే చిక్కాయి. డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. రెండు స్థానాలు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు లేక నాలుగు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానం ఖాళీ పడ్డాయి. వీటిని కోఆప్షన్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఎన్నికల అధికారి ఎం.నాగరాజు సమక్షంలో డెరైక్టర్లు సమావేశమయ్యారు. అభ్యర్థులు ఆలస్యంగా సమావేశానికి రావడంతో ప్రస్తుతానికి రెండు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానాన్ని మాత్రమే భర్తీ చేశారు. మారాల పీఏసీఎస్ నుంచి పెద్ద నరసమ్మ (ఎస్సీ), బుక్కచెర్ల పీఏసీఎస్ నుంచి హెచ్.ముత్యాలప్ప (ఎస్సీ), పి.యాలేరు పీఏసీఎస్ నుంచి కేశవనాయక్ (ఎస్టీ)లను కో ఆప్షన్ పద్ధతిలో ఎన్నుకున్నారు. మిగతా ఇద్దరు డెరైక్టర్లను ఎన్నుకునే బాధ్యతను పాలకవర్గానికి అప్పగించారు. ప్రస్తుతం ఎన్నికైన 19 మంది డెరైక్టర్లలో 17 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులే కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కో ఆప్షన్ సమావేశం ముగిసిన తరువాత ఉదయం 9 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ స్థానానికి గొల్లోళ్లచెరువు పీఏసీఎస్ అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ స్థానానికి మడకశిర పీఏసీఎస్ అధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక డీసీఎంఎస్‌లో పది డెరైక్టర్ స్థానాలుండగా... నామినేషన్ల ఉపసంహరణ సమయానికి నాలుగు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మూడు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ఒకటి స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మరో నాలుగు స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. నాలుగింటినీ వైఎస్సార్సీపీ మద్దతుదారులే చేజిక్కించుకున్నారు. అభ్యర్థులు లేక ఖాళీ పడిన రెండు స్థానాలను ఆదివారం ఎన్నికల అధికారి ఇ.అరుణకుమారి నేతృత్వంలో కో ఆప్షన్ పద్ధతిలో భర్తీ చేశారు. ఇవి కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. సోమందేపల్లి పీఏసీఎస్ నుంచి టి.రత్నమ్మ (ఎస్సీ), గోరంట్ల పీఏసీఎస్ నుంచి పాలే చందేనాయక్ (ఎస్టీ) కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మొత్తం పది డెరైక్టర్ స్థానాల్లో వైఎస్సార్సీపీ తొమ్మిది కైవసం చేసుకోవడంతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులనే బలపర్చడంతో డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాలగుండ్ల శంకరనారాయణ, కాపు రామచంద్రారెడ్డి, నాయకులు బి.ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ సీఈఓ ఆర్సీ శ్రీనివాస్, జీఎం కె.విజయచంద్రారెడ్డి, డీఎల్సీవో ఫణిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సహకార పీఠాలు మనవే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. శని, ఆదివారాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు, చైర్మన్ ఎంపిక జరగనుండటంతో పార్టీ పరంగా అనుసరించాల్సిన అంశాలపై సూచనలిచ్చేందుకు శుక్రవారం ఆయన అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా లింగాల శివశంకర్‌రెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గతేడాది అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నేతలు కుమ్మక్కై అడ్డదారుల్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌లను చేజిక్కించుకోవాలనే ఎత్తులను చిత్తు చేశామని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు వ్యవహరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించామన్నారు. అందులో భాగంగానే ఇపుడు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందిన రైతులు సహకార ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను ఆదరించారని పేర్కొన్నారు. ఇపుడు ఆ రెండు పీఠాలపై చైర్మన్ అభ్యర్థులుగా పార్టీ మద్దతుదారులను కూర్చోబెట్టాలన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఓబుళాపురం సొసైటీ అధ్యక్షుడు బోయ మల్లికార్జునకు అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. డీసీసీబీ చైర్మన్ అభ్యర్థిగా ఇప్పటికే లింగాల శివశంకర్‌రెడ్డి పేరును ఖరారు చేశామన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్‌గా మడకశిర సొసైటీ అధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక డీసీఎంఎస్ వైస్ చైర్మన్‌గా ఎన్పీకుంట సొసైటీ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి లేదా నార్పల సొసైటీ అధ్యక్షుడు పి.జయరామిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉంచారు. సమావేశంలో పార్టీ ఎంపీ అభ్యర్థులు అనంత వెంకటరామిరెడ్డి, డి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్, పెనుకొండ అసెంబ్లీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థులు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా నర్సింహయ్య, వై.మధుసూదన్‌రెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, సాలార్‌బాషా, హెచ్డీ నర్సేగౌడ, సానిపల్లి మంగమ్మ, పామిడి వీరాంజనేయులు, దిలీప్‌రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, బోయ తిరుపాలుతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్ డెరైక్టర్లు, పలువురు సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
తిరుగులేదిప్పుడు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోవడం ఏ శక్తి తరమూ కాదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మెజార్టీ పీఏసీఎస్‌లను వైఎస్సార్సీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్న నేపథ్యంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో ఆ పార్టీ పాగా వేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకనైనా డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ బలంగా వ్యక్తమవుతోంది. 11 నెలలుగా పాలక వర్గాలు లేకపోవడం వల్ల డీసీసీబీ, డీసీఎంఎస్‌లు నిర్వీర్యమయ్యాయి. రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేని స్థితిలో ఆ రెండు సంస్థలు కొట్టుమిట్టాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 116 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏఎస్సీ)కు ఎన్నికలు నిర్వహించడానికి జనవరి 21, 2013లో నోటిఫికేషన్ జారీ చేశారు. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి ఏడు పీఏసీఎస్‌ల ఎన్నికలను వాయిదా వేశారు. రెండు విడతలుగా 109 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు 44, టీడీపీ మద్దతుదారులు 21, కాంగ్రెస్ మద్దతుదారులు 31, జేసీ దివాకర్‌రెడ్డి మద్దతుదారులు 13 పీఏసీఎస్‌లలో విజయం సాధించారు. రాష్ట్రంలో 22 డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరి 14, 2013న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డీఫాల్ట్(రుణాలు ఎగవేసిన) సంఘాలకు ఓటు హక్కు లేకుండా చేసి.. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఎన్నికలు జరిగిన 109 పీఏసీఎస్‌లలో 59 సంఘాలు డీఫాల్ట్ జాబితాలో ఉన్నట్లు తేల్చిన అధికారులు.. 50 సంఘాలకు మాత్రమే ఓటు హక్కు ఉందని తేల్చారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో ఓటు హక్కుకు అర్హత సాధించిన 50 సంఘాల్లో వైఎస్సార్సీపీకి 21, కాంగ్రెస్‌కు 14, టీడీపీకి పది సంఘాలు, జేసీ దివాకర్‌రెడ్డి వర్గంలో ఐదు సంఘాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీ మద్దతుదారులు డీసీసీబీ, డీసీఎంఎస్‌లను చేజిక్కించుకోవడం ఖాయమనే భావనకు వచ్చిన మంత్రులు రఘువీరా, శైలజానాథ్‌లు కరువును సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయించారు. వైఎస్సార్సీపీని అడ్డుకునే కుట్ర వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకునే యత్నంలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం చూపిన సాకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వరుస కరవుల వల్ల రైతులు రుణాలు చెల్లించలేకపోయారని.. వైద్యనాథన్ కమిటీ ప్రతిపాదనల ప్యాకేజీ 55 సంఘాలకు అందలేదని.. 59 సొసైటీలు డీఫాల్ట్ జాబితాలో ఉండటం వల్ల తక్కిన 50 సంఘాల్లో కనీసం 37 సంఘాల అధ్యక్షులు కూడా ఎన్నికను బాయ్‌కాట్ చేసే అవకాశం ఉందని.. పైగా ఎన్నిక నిర్వహించడానికి అనువైన వాతావరణం జిల్లాలో లేదని అందువల్ల డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు సహకారశాఖ రిజిస్ట్రార్ ఫిబ్రవరి 13, 2013న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. రుణాలు ఎగవేసిన సంఘాలకు ఓటు హక్కు లేకుండా చేసేలా నిర్ణయం తీసుకోవాలని ఈ ఇద్దరు మంత్రులే ప్రభుత్వంపై తొలుత ఒత్తిడి తేవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తోన్న క్రమంలో.. ఆ నిబంధనను మన జిల్లాకు సడలించాలని అదే మంత్రులు కోరడం విమర్శలకు దారితీసింది. మంత్రులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి.. అన్ని సంఘాలకు ఓటు హక్కు కల్పించి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు నిర్వహించేందుకు జూన్ 14న ఉత్తర్వులు జారీచేయించారు. ప్రభుత్వ దమననీతిపై వైఎస్సార్సీపీ డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. శివశంకర్‌రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలను నిలుపుదల చేయాలని జూన్ 22, 2013న ఉత్తర్వులు జారీచేసింది. ఇదే అంశంపై విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధానంలో ఎన్నికలు జరిపారో.. అదే పద్ధతిలో డీఫాల్ట్ సంఘాలకు ఓటు హక్కు కల్పించకుండా డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు నిర్వహించాలని అక్టోబరు, 2013న తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇప్పటికైనా వెనక్కి తగ్గేరా.. వాయిదా వేసిన ఏడు పీఏసీఎస్‌లకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఐదు సంఘాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ఒక సంఘంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మరో సంఘంలో సీపీఐ మద్దతుతో వైఎస్సార్సీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా ఫలితాల తర్వాత 116 సంఘాల్లో వైఎస్సార్సీపీ బలం 44 నుంచి 49కి పెరిగింది. టీడీపీ బలం 21 నుంచి 22కు పెరిగింది. కాంగ్రెస్ బలం 31గానే ఉంది. సీపీఐ-వైఎస్సార్సీపీ చేతిలో మరో స్థానం ఉంది. జేసీ దివాకర్‌రెడ్డి చేతిలో 13 సంఘాలు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే.. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వాదన మేరకు అన్ని సంఘాలకూ ఓటు హక్కు కల్పించి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు నిర్వహించినా.. డీఫాల్ట్ సంఘాలకు ఓటు హక్కు లేకుండా నిర్వహించినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నది విశదమవుతోంది. ఇప్పుడేం సాకులు వెతుకుతారో..: లింగాల శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి సహకార వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. పాలకవర్గాలు లేకపోవడం వల్ల డీసీసీబీ, డీసీఎంఎస్‌లు చతికిలపడ్డాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా. కనీసం ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా. ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగినా వైఎస్సార్సీపీ విజయం ఖాయం. వైఎస్సార్సీపీని అడ్డుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. -
డీసీఎంఎస్ కేంద్రాల్లో తాండూరు కంది పప్పు
తాండూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తాండూరు కందిపప్పును డీసీఎంఎస్ కేంద్రాల్లో విక్రయించనున్నట్టు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ కె.శ్రావణ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తాండూరు డీసీఎంఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. డీసీఎంఎస్‌కు చెందిన దాల్మిల్లు, రైస్‌మిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యతకు, రుచికి తాండూరు కందిపప్పు ఎంతో ప్రసిద్ధి గాంచిందన్నారు. మూడేళ్ల క్రితం డీసీఎంఎస్ ద్వారా కందిపప్పు విక్రయాలు జరిపామన్నారు. తాండూరులోని దాల్మిల్లు మరమ్మతుల కారణంగా పప్పు తయారీ ఆగిపోయిందని ఆయన చెప్పారు. ఈసారి దాల్‌మిల్లుకు మరమ్మతులు చేయించనున్నట్టు ఆయన తెలిపారు. రూ.78 లక్షల ఐసీడీపీ నిధులను నుంచి మరమ్మతులకు రూ.8లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దాల్‌మిల్లును బాగు చేయిస్తామన్నారు. మార్కెట్ యార్డులో కందులను కొనుగోలు చేసి పప్పు తయారు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా కందిపప్పును విక్రయించనున్నట్లు శ్రావణ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కందుల కొనుగోలుకు సంబంధించి డీసీఎంఎస్ పాలకవర్గం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాండూరు మండలానికి 500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, పరిగికి 754, దోమకు 1500, కుల్కచర్లకు 2500, గండేడ్‌కు 3500, బషీరాబాద్‌కు 700, యాలాలకు 1250, దారూర్కు 620, పెద్దేముల్ మండలానికి 900 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించామన్నారు. వచ్చే రబీ సీజన్ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,234 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 4వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు వ్యవసాయ శాఖ కేటాయించిందన్నారు. రెండు రోజుల్లో డీసీఎంస్, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాల విక్రయాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. స్థానిక వ్యవసాయాధికారులతో రైతులు ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చి విత్తనాలు తీసుకువెళ్లొచ్చన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఖరీఫ్ సీజన్లో డీసీఎంఎస్ ద్వారా రూ.10.40 కోట్ల విలువ చేసే 2191 మెట్రిక్ టన్నుల డీఏపీ, 6,846 మెట్రిక్ టన్నుల యూరియా, 462 మెట్రిక్ టన్నుల 20,20,178 మెట్రిక్ టన్నుల పొటాష్, 540 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుల విక్రయాలతోపాటు బీపీటీ, తెల్లహంస, 1010, మొక్కజొన్న తదితర విత్తనాల విక్రయంపై రూ.88.66 లక్షల వ్యాపారం జరిగిందన్నారు. డీసీఎంఎస్ కార్యాలయాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయనునున్నట్టు, సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమవుతోందన్నారు. తాండూరులోని దాల్మిల్లు, రైస్‌మిల్లులను విక్రయించే ప్రసక్తే లేదన్నారు. రైలు మిల్లును కూడా రిపేరు చేయిస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎరువుల,విత్తనాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎరువులు,డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. అంతకుముందు చైర్మన్ డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. బషీరాబద్ మండంలోనే ఎరువులులభించేలాచూడాలని, వేరుశెనగ విత్తనాలు కావాలని రైతులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు. విత్తనాలు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. దాల్మిల్లు,రైస్‌మిల్లులను ఆయన పరిశీలించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ భీంరెడ్డి మాట్లాడుతూ పది జిల్లాలో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేస్తుందని, సమైక్య ఉద్యమాలు ఎన్ని జరిగినా.. ఎవరు అడ్డుపడినా ఈ ప్రక్రియ ఆగదన్నారు. సమావేశంలో జిల్లా మేనేజర్ శివారెడ్డి, తాండూరు మేనేజర్ షరీఫ్ పాల్గొన్నారు.