అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో రెండు పాలకవర్గాల పగ్గాలూ వైఎస్సార్ సీపీకే చిక్కాయి. డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. రెండు స్థానాలు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు లేక నాలుగు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానం ఖాళీ పడ్డాయి. వీటిని కోఆప్షన్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఎన్నికల అధికారి ఎం.నాగరాజు సమక్షంలో డెరైక్టర్లు సమావేశమయ్యారు. అభ్యర్థులు ఆలస్యంగా సమావేశానికి రావడంతో ప్రస్తుతానికి రెండు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానాన్ని మాత్రమే భర్తీ చేశారు.
మారాల పీఏసీఎస్ నుంచి పెద్ద నరసమ్మ (ఎస్సీ), బుక్కచెర్ల పీఏసీఎస్ నుంచి హెచ్.ముత్యాలప్ప (ఎస్సీ), పి.యాలేరు పీఏసీఎస్ నుంచి కేశవనాయక్ (ఎస్టీ)లను కో ఆప్షన్ పద్ధతిలో ఎన్నుకున్నారు. మిగతా ఇద్దరు డెరైక్టర్లను ఎన్నుకునే బాధ్యతను పాలకవర్గానికి అప్పగించారు. ప్రస్తుతం ఎన్నికైన 19 మంది డెరైక్టర్లలో 17 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కో ఆప్షన్ సమావేశం ముగిసిన తరువాత ఉదయం 9 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు.
చైర్మన్ స్థానానికి గొల్లోళ్లచెరువు పీఏసీఎస్ అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ స్థానానికి మడకశిర పీఏసీఎస్ అధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక డీసీఎంఎస్‌లో పది డెరైక్టర్ స్థానాలుండగా... నామినేషన్ల ఉపసంహరణ సమయానికి నాలుగు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మూడు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, ఒకటి స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మరో నాలుగు స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. నాలుగింటినీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే చేజిక్కించుకున్నారు. అభ్యర్థులు లేక ఖాళీ పడిన రెండు స్థానాలను ఆదివారం ఎన్నికల అధికారి ఇ.అరుణకుమారి నేతృత్వంలో కో ఆప్షన్ పద్ధతిలో భర్తీ చేశారు.
ఇవి కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరాయి. సోమందేపల్లి పీఏసీఎస్ నుంచి టి.రత్నమ్మ (ఎస్సీ), గోరంట్ల పీఏసీఎస్ నుంచి పాలే చందేనాయక్ (ఎస్టీ) కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మొత్తం పది డెరైక్టర్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తొమ్మిది కైవసం చేసుకోవడంతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులనే బలపర్చడంతో డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాలగుండ్ల శంకరనారాయణ, కాపు రామచంద్రారెడ్డి, నాయకులు బి.ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ సీఈఓ ఆర్‌సీ శ్రీనివాస్, జీఎం కె.విజయచంద్రారెడ్డి, డీఎల్‌సీవో ఫణిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
‘సహకార’ పీఠాలు వైఎస్సార్ సీపీవే
Published Mon, May 12 2014 3:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement