తిరుగులేదిప్పుడు.. | District Co-operative Central Bank | Sakshi
Sakshi News home page

తిరుగులేదిప్పుడు..

Published Sat, Jan 11 2014 2:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

District Co-operative Central Bank

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోవడం ఏ శక్తి తరమూ కాదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మెజార్టీ పీఏసీఎస్‌లను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్న నేపథ్యంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో ఆ పార్టీ పాగా వేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో ఇకనైనా డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ బలంగా వ్యక్తమవుతోంది. 11 నెలలుగా పాలక వర్గాలు లేకపోవడం వల్ల డీసీసీబీ, డీసీఎంఎస్‌లు నిర్వీర్యమయ్యాయి. రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేని స్థితిలో ఆ రెండు సంస్థలు కొట్టుమిట్టాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 116 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏఎస్‌సీ)కు ఎన్నికలు నిర్వహించడానికి జనవరి 21, 2013లో నోటిఫికేషన్ జారీ చేశారు. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి ఏడు పీఏసీఎస్‌ల ఎన్నికలను వాయిదా వేశారు. రెండు విడతలుగా 109 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 44, టీడీపీ మద్దతుదారులు 21, కాంగ్రెస్ మద్దతుదారులు 31, జేసీ దివాకర్‌రెడ్డి మద్దతుదారులు 13 పీఏసీఎస్‌లలో విజయం సాధించారు. రాష్ట్రంలో 22 డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరి 14, 2013న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డీఫాల్ట్(రుణాలు ఎగవేసిన) సంఘాలకు ఓటు హక్కు లేకుండా చేసి.. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో ఎన్నికలు జరిగిన 109 పీఏసీఎస్‌లలో 59 సంఘాలు డీఫాల్ట్ జాబితాలో ఉన్నట్లు తేల్చిన అధికారులు.. 50 సంఘాలకు మాత్రమే ఓటు హక్కు ఉందని తేల్చారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో ఓటు హక్కుకు అర్హత సాధించిన 50 సంఘాల్లో వైఎస్సార్‌సీపీకి 21, కాంగ్రెస్‌కు 14, టీడీపీకి పది సంఘాలు, జేసీ దివాకర్‌రెడ్డి వర్గంలో ఐదు సంఘాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు డీసీసీబీ, డీసీఎంఎస్‌లను చేజిక్కించుకోవడం ఖాయమనే భావనకు వచ్చిన మంత్రులు రఘువీరా, శైలజానాథ్‌లు కరువును సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయించారు.
 
 వైఎస్సార్‌సీపీని అడ్డుకునే కుట్ర
 వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకునే యత్నంలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం చూపిన సాకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వరుస కరవుల వల్ల రైతులు రుణాలు చెల్లించలేకపోయారని.. వైద్యనాథన్ కమిటీ ప్రతిపాదనల ప్యాకేజీ 55 సంఘాలకు అందలేదని.. 59 సొసైటీలు డీఫాల్ట్ జాబితాలో ఉండటం వల్ల తక్కిన 50 సంఘాల్లో కనీసం 37 సంఘాల అధ్యక్షులు కూడా ఎన్నికను బాయ్‌కాట్ చేసే అవకాశం ఉందని.. పైగా ఎన్నిక నిర్వహించడానికి అనువైన వాతావరణం జిల్లాలో లేదని అందువల్ల డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు సహకారశాఖ రిజిస్ట్రార్ ఫిబ్రవరి 13, 2013న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
 
 కానీ.. రుణాలు ఎగవేసిన సంఘాలకు ఓటు హక్కు లేకుండా చేసేలా నిర్ణయం తీసుకోవాలని ఈ ఇద్దరు మంత్రులే ప్రభుత్వంపై తొలుత ఒత్తిడి తేవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తోన్న క్రమంలో.. ఆ నిబంధనను మన జిల్లాకు సడలించాలని అదే మంత్రులు కోరడం విమర్శలకు దారితీసింది.
 
 మంత్రులు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి.. అన్ని సంఘాలకు ఓటు హక్కు కల్పించి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు నిర్వహించేందుకు జూన్ 14న ఉత్తర్వులు జారీచేయించారు. ప్రభుత్వ దమననీతిపై వైఎస్సార్‌సీపీ డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. శివశంకర్‌రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలను నిలుపుదల చేయాలని జూన్ 22, 2013న ఉత్తర్వులు జారీచేసింది. ఇదే అంశంపై విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధానంలో ఎన్నికలు జరిపారో.. అదే పద్ధతిలో డీఫాల్ట్ సంఘాలకు ఓటు హక్కు కల్పించకుండా డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు నిర్వహించాలని అక్టోబరు, 2013న తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతోంది.

 ఇప్పటికైనా వెనక్కి తగ్గేరా..
 వాయిదా వేసిన ఏడు పీఏసీఎస్‌లకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఐదు సంఘాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, ఒక సంఘంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మరో సంఘంలో సీపీఐ మద్దతుతో వైఎస్సార్‌సీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా ఫలితాల తర్వాత 116 సంఘాల్లో వైఎస్సార్‌సీపీ బలం 44 నుంచి 49కి పెరిగింది. టీడీపీ బలం 21 నుంచి 22కు పెరిగింది.
 
 కాంగ్రెస్ బలం 31గానే ఉంది. సీపీఐ-వైఎస్సార్‌సీపీ చేతిలో మరో స్థానం ఉంది. జేసీ దివాకర్‌రెడ్డి చేతిలో 13 సంఘాలు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే.. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వాదన మేరకు అన్ని సంఘాలకూ ఓటు హక్కు కల్పించి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలు నిర్వహించినా.. డీఫాల్ట్ సంఘాలకు ఓటు హక్కు లేకుండా నిర్వహించినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నది విశదమవుతోంది.  
 
 ఇప్పుడేం సాకులు వెతుకుతారో..: లింగాల శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి
 సహకార వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. పాలకవర్గాలు లేకపోవడం వల్ల డీసీసీబీ, డీసీఎంఎస్‌లు చతికిలపడ్డాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా. కనీసం ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా. ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగినా వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం. వైఎస్సార్‌సీపీని అడ్డుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement