డీసీఎంఎస్ కేంద్రాల్లో తాండూరు కంది పప్పు | tandur dal in dcms centers | Sakshi
Sakshi News home page

డీసీఎంఎస్ కేంద్రాల్లో తాండూరు కంది పప్పు

Published Mon, Sep 23 2013 11:35 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

tandur dal in dcms centers

 తాండూరు, న్యూస్‌లైన్:
 రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తాండూరు కందిపప్పును డీసీఎంఎస్ కేంద్రాల్లో విక్రయించనున్నట్టు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ కె.శ్రావణ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తాండూరు డీసీఎంఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. డీసీఎంఎస్‌కు చెందిన దాల్‌మిల్లు, రైస్‌మిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యతకు, రుచికి తాండూరు కందిపప్పు ఎంతో ప్రసిద్ధి గాంచిందన్నారు. మూడేళ్ల క్రితం డీసీఎంఎస్ ద్వారా కందిపప్పు విక్రయాలు జరిపామన్నారు. తాండూరులోని దాల్‌మిల్లు మరమ్మతుల కారణంగా పప్పు తయారీ ఆగిపోయిందని ఆయన చెప్పారు. ఈసారి దాల్‌మిల్లుకు మరమ్మతులు చేయించనున్నట్టు ఆయన తెలిపారు.  రూ.78 లక్షల ఐసీడీపీ నిధులను నుంచి మరమ్మతులకు రూ.8లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దాల్‌మిల్లును బాగు చేయిస్తామన్నారు. మార్కెట్ యార్డులో కందులను కొనుగోలు చేసి పప్పు తయారు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా కందిపప్పును విక్రయించనున్నట్లు శ్రావణ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
 
  కందుల కొనుగోలుకు సంబంధించి డీసీఎంఎస్ పాలకవర్గం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాండూరు మండలానికి 500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, పరిగికి 754, దోమకు 1500, కుల్కచర్లకు 2500, గండేడ్‌కు 3500, బషీరాబాద్‌కు 700, యాలాలకు 1250, దారూర్‌కు 620, పెద్దేముల్ మండలానికి 900 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించామన్నారు. వచ్చే రబీ సీజన్ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,234 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 4వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు వ్యవసాయ శాఖ కేటాయించిందన్నారు. రెండు రోజుల్లో డీసీఎంస్, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాల విక్రయాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.  స్థానిక వ్యవసాయాధికారులతో రైతులు ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చి విత్తనాలు తీసుకువెళ్లొచ్చన్నారు.
 ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఖరీఫ్ సీజన్‌లో డీసీఎంఎస్ ద్వారా రూ.10.40 కోట్ల విలువ చేసే 2191 మెట్రిక్ టన్నుల డీఏపీ, 6,846 మెట్రిక్ టన్నుల యూరియా, 462 మెట్రిక్ టన్నుల 20,20,178 మెట్రిక్ టన్నుల పొటాష్, 540 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుల విక్రయాలతోపాటు బీపీటీ, తెల్లహంస, 1010, మొక్కజొన్న తదితర విత్తనాల విక్రయంపై రూ.88.66 లక్షల వ్యాపారం జరిగిందన్నారు.
 
  డీసీఎంఎస్ కార్యాలయాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయనునున్నట్టు, సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమవుతోందన్నారు. తాండూరులోని దాల్‌మిల్లు, రైస్‌మిల్లులను విక్రయించే ప్రసక్తే లేదన్నారు. రైలు మిల్లును కూడా రిపేరు చేయిస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎరువుల,విత్తనాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎరువులు,డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. అంతకుముందు చైర్మన్ డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. బషీరాబద్ మండంలోనే ఎరువులులభించేలాచూడాలని, వేరుశెనగ విత్తనాలు కావాలని రైతులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు. విత్తనాలు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. దాల్‌మిల్లు,రైస్‌మిల్లులను ఆయన పరిశీలించారు.  డీసీఎంఎస్ వైస్ చైర్మన్ భీంరెడ్డి మాట్లాడుతూ పది జిల్లాలో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేస్తుందని, సమైక్య ఉద్యమాలు ఎన్ని జరిగినా.. ఎవరు అడ్డుపడినా ఈ ప్రక్రియ ఆగదన్నారు. సమావేశంలో జిల్లా మేనేజర్ శివారెడ్డి, తాండూరు మేనేజర్ షరీఫ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement