సాక్షి, కర్నూలు: రాష్ట్రం రెండు ముక్కలైంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసికట్టుగా తెలుగు ప్రజలను చీల్చేశారు. ఇప్పుడిక ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. విభజన పాపం తమది కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా.. ఆ పార్టీ తక్కిన ఎమ్మెల్యేలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ఇక టీడీపీ నాయకులు తమ పదవులను వదులుకునేందుకు ఎంతమాత్రం ముందుకు రావడం లేదు. సమైక్య ఉద్యమం సద్దుమణిగిందని తెలుసుకున్న నాయకులు.. వారిని తమవైపు తిప్పుకునేందుకు నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు. ఏదో ఒక ఎర వేసి ఓట్లు రాల్చుకునేందుకు హడావుడి చేస్తున్నారు. ఎక్కడ రాష్ట్రపతి పాలన వస్తుందోనన్న భయంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
మంత్రి టీజీ వెంకటేష్ శనివారం నాలుగు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఐదేళ్ల పదవీ కాలంలో అమలుకు నోచుకోని ఎన్నో హామీలు గుప్పించినా వాటి ఊసే మరిచారు. తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో పాత ఫైళ్లను ఒక్కొక్కటిగా దుమ్ము దులుపుతున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వెళ్తున్న ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి సైతం హైదరాబాద్ నుంచి త్వరలో రానున్నట్లు సమాచారం. ఆమె రాక కోసం అనేక శిలాఫలకాలు ఎదురుచూస్తున్నాయి. రూ.7.5 కోట్ల వ్యయంతో ఆలూరు నుంచి హోళగుంద రహదారి నిర్మాణం, నియోజకవర్గంలోని 50 గ్రామాలకు రూ. 11 కోట్ల వ్యయంతో మంచినీటి పైపులైన్ విస్తరణ పనులకు సంబంధించి ఆమె వచ్చే వారం శంకుస్థాపన చేయనున్నారు. డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూరి గత పది రోజులుగా నియోజకవర్గంలోనే తిష్టవేశారు.
కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ తన నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారు. శనివారం కోడుమూరులో రూ.6 లక్షల విలువైన సీసీ రోడ్ల పనులకు సర్పంచ్‌తో ప్రారంభోత్సవం చేయించారు. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ నియోజకవర్గాల్లో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. అయితే సమైక్య రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతల తీరుపై ఇప్పటికీ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఓట్ల కోసం వచ్చే నాయకుల భరతం పట్టేందుకు.. ఓటు అనే వజ్రాయుధంతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ఓట్ల కోసం గాలం
Published Sun, Feb 23 2014 4:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement