సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతలు అడ్డంగా సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రకృతి సంపదను సైతం కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు మైనింగ్, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతుండగా.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని ‘తప్పించేందుకు’ సైతం వెనుకాడటం లేదనే చర్చ జరుగుతోంది.
నిబంధనల ప్రకారం లీజు కలిగి ఉన్నా తవ్వుకునేందుకు అడ్డపడుతుండటం తమ్ముళ్ల ధనదాహానికి అద్దం పడుతోంది. ఖనిజాలా ఖిల్లాగా ప్రసిద్ధి చెందిన జిల్లాలోని వెల్దుర్తి మండలం రామళ్లకోట, రత్నాపల్లి, పుల్లగుమ్మి, బోయనపల్లె.. బేతంచెర్ల మండలంలోని రెహమాన్‌పురం, గూటుపల్లె, ఆర్‌ఎస్ రంగాపురం.. డోన్ మండలంలోని ఎర్రగుంట్ల, మల్కాపురం.. డోన్ అటవీ ప్రాంతంలోని పాపిసాని కొట్టాల, పుల్లగుమ్మి, సిద్దనగట్టు, చిన్నకొలుములపల్లెలోని మైనింగ్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి.
అదేవిధంగా తుంగభద్ర తీరంలోని ఇసుక నిల్వలపై టీడీపీ నేతల కన్నుపడింది. అధికార పార్టీ కావడంతో అనుమతులు లేకపోయినా అడ్డంగా తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, బనగానపల్లె, అవుకు అటవీ పరిధిలో సుమారు 57వేల హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఖనిజాన్ని దోచుకునేందుకు టీడీపీ నేతలు బరితెగించారు. ఖనిజాన్ని తరలించేందుకు అధికారులు అడ్డురాకుండా తమ్ముళ్లు నేతలతో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరులు అటవీశాఖ కార్యాలయానికి వచ్చి అధికారులకు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ‘నేనెవరో తెలుసా? దేనికైనా ముందు మా అనుమతి ఉండాలి.
మనవాళ్లు వచ్చి మైనింగ్ తీసుకెళ్తుంటారు. వారిని మీరెవరూ అడ్డుకోకూడదు. నా పేరు చెపితే విడిచిపెట్టాలి. లేదంటే నీవు ఇక్కడ ఉండలేవు. బుద్ధిగా కలిసిపో. నీకూ కొంత ఇస్తాం’ అంటూ బెదిరిస్తూనే రాయబారం నడిపినట్లు తెలిసింది. ఈ పరిణామంతో అధికారులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. గత శనివారం వినాయక నిమజ్జన వేడుకలను అసరాగా చేసుకొని రాత్రికి రాత్రే జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలను ఏర్పాటు చేసుకొని వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించేందుకు వ్యూహం పన్నారు. అయితే అర్ధరాత్రి అధికారుల దాడుల్లో పట్టుబడ్డారు. వెల్దుర్తి పరిధిలో మాత్రం కొందరు అక్రమార్కులు మైనింగ్ తవ్వుకుని తరలించినట్లు తెలుస్తోంది. మైనింగ్ లీజు దారులను సైతం తమ్ముళ్లు అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ వ్యాపారులు తమ లీజు భూముల్లోని ఖనిజాన్ని తరలించినా టన్నుకు రూ.250 వసూలు చేస్తుండటం గమనార్హం. ఇలా రోజుకు రూ.20లక్షలు దండుకుంటున్నట్లు స్థానిక వ్యాపారుల ద్వారా తెలుస్తోంది.
ఆగని అక్రమ రవాణా
అక్రమ మైనింగ్‌పై ఫారెస్టు అధికారులు దాడులు చేస్తున్నా టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకపోతోంది. గత నెలలో పుల్లగుమ్మి, పాపిసానికొట్టాల, పిక్కినవాలిపల్లి, సిద్దనగట్టు పరిసరాల్లో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. తాజాగా శనివారం అర్ధరాత్రి బేతంచెర్ల పరిధిలో ఐరన్‌ఓర్ అక్రమంగా తరలిస్తున్న 4 ట్రాక్టర్లు, జేసీబీ, సుమోతో పాటు 11 మంది కూలీలు, డ్రైవర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన వీరంతా టీడీపీ వర్గీయులేనని అధికారుల విచారణలో వెల్లడైంది.
తమ్ముళ్ల ధనదాహం
Published Mon, Sep 8 2014 2:45 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement