టీడీపీ ఓటుపాట్లు
తమ్ముళ్లు.. మహా మాయగాళ్లు!
అయితే డబ్బు.. లేదంటే బెదిరింపులు
మహిళా ఓటర్లే లక్ష్యంగా సాగుతున్న కుట్ర
హైటెక్ తరహాలో నగదు బదిలీ
తెల్ల కాగితాలపై సంతకాలు
ప్రభుత్వ ఉద్యోగులను లోబర్చుకునే యత్నం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార దాహం తెలుగుతమ్ముళ్లను అడ్డదారులు తొక్కిస్తోంది. అందితే కాళ్లు.. అందకపోతే జుట్టు చందంగా ఆ పార్టీ నేతల తీరు ఉంటోంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన ఆ పార్టీ అధినేత.. ఎన్నికల్లో గెలవలేమనే భావనతో బీజేపీతో జతకట్టడం తెలిసిందే. ఆ పార్టీ జపంతోనైనా నాలుగు ఓట్లు రాబట్టుకోవడమే ‘పొత్తు’లోని మర్మమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు ద్వంద్వ నీతి.. ప్యాకేజీ రాజకీయాలతో కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు కట్టబెట్టారు.
పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమ్ముళ్లను నట్టేట ముంచారు. ఇక ఓటమి భయం వెన్నాడుతుండటం.. పోలింగ్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థులు బరితెగిస్తున్నారు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు దూరం కావడంతో ఆ వర్గీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, ఆదోని, బనగానపల్లె ప్రాంతాల్లో ఈ తరహా దౌర్జన్యం కొనసాగుతోంది. నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబాన్ని టీడీపీ వర్గీయులు తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు తన వివరాలు చెప్పేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి శనివారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
కర్నూలులో హైటెక్ ట్రాన్సాక్షన్
కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులు ఓటర్లకు నేరుగా డుబ్బలు ఇవ్వకుండా హైటెక్ తరహాలో నగదు పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు నగరంలోని కొందరు మహిళలతో టీడీపీ నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటరు కార్డుతో వచ్చిన ప్రతి ఒక్కరికీ రూ. రెండు వేలు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పత్రికలు, మీడియా, ఎన్నికల అధికారులకు తెలియటంతో ఇటీవల ప్లాన్ మార్చారు. బ్యాంక్‌లలో అకౌంట్లు ప్రారంభింపజేసి.. సభ్యుల పేర్లపై నగదును డిపాజిట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా నగదు బదిలీ చేస్తుండటం గమనార్హం.
తెల్ల కాగితాలపై సంతకాలు
వడ్డీకి అప్పు తీసుకుంటే అగ్రిమెంట్, ప్రోనోట్‌పై సంతకాలు తీసుకోవడం సహజం. అయితే టీడీపీ నేతలు మాత్రం తెల్లకాగితంపై సంతకాలు చేయించుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లో నగదు డిపాజిట్ చేసిన వెంటనే అమాయక మహిళలచే తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా గ్రూపులైతే పేపర్‌పై సంతకాలతో పాటు గ్రూపు స్టాంప్ వేయించుకుని పంపుతున్నారు. అభ్యర్థులు గెలిస్తే సరేసరి.. లేకపోతే వారిని ఇబ్బందులకు గురిచేసేందుకు రంగం సిద్ధం చేస్తారని తెలుస్తోంది.
బీఎల్‌ఓలు.. ఉద్యోగులకు బెదిరింపులు: బీఎల్‌ఓలు, ఉద్యోగులను కూడా తమ్ముళ్లు బెదిరిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకున్నట్లు కర్నూలుకు చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి తెలిపారు. నేరుగా ఇళ్లకు ఫోన్‌చేసి వారిపైన ఏవైనా కేసులుంటే వాటి ఆధారంగా బెదిరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొందరు బీఎల్‌ఓలను కూడా టీడీపీ నేతలు నయానో.. భయానో తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నట్లు సమాచారం.
వీరిని ఇంటింటికి పంపి నగదు పంపిణీ చేయటంతో పాటు బ్యాలెట్ నమూనాను చూపి ఓటెవరికి వేయాలో బలవంతంగా ప్రచారం చేయిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. నగరంలో ఆదివారం ఓ ప్రైవేట్ స్కూలులో ప్రైవేట్ స్కూలు టీచర్లతో టీడీపీ నాయకుడు సమావేశం నిర్వహించి.. ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిసింది. ఇలా టీడీపీ నేతలు రకరకాలుగా అడ్డుదారులు తొక్కుతూ నిబంధనలను తుంగలో తొక్కుతుండటం గమనార్హం.