రాంనగర్ రారాజు ఎవరో?
♦ బరిలో హోంమంత్రి అల్లుడు వీఎస్‌ఆర్
♦ హ్యాట్రిక్ కోసం కాంగ్రెస్ అభ్యర్థి కల్పన ఆరాటం
♦ గెలుపు కోసం బీజేపీ అభ్యర్థి పోరాటం
డివిజన్ నెంబర్ 87
మొత్తం ఓటర్లు 55,051
పురుషులు 29,503
మహిళలు 25,548
పోలింగ్ బూత్‌లు 67
ముషీరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకమైన డివిజన్‌లలో రాంనగర్ (నెం.87) ఒకటి. ఇక్కడి నుంచి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి(వీఎస్‌ఆర్) పోటీ చేస్తున్నారు. నాయిని రాజకీయ వారసుడిగా అరంగ్రేటం చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి...ఇటీవల జరిగిన వీఎస్‌టీ, హెచ్‌బీఎల్, కోకో కోలా యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపులో ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం గెలుపొంది తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకోవాలని ఆయన రాంనగర్ డివిజన్‌ను వేదికగా ఎంచుకున్నారు. ఇక్కడ మిత్రపక్షాల అభ్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి ఎం.ప్రభాకరరెడ్డి గతంలో బాగ్‌లింగంపల్లి డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కల్పనాయాదవ్ 2002, 2009లో కార్పొరేటర్‌గా విజయం సాధించి మూడోసారి విజయం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని ఆరాటంతో ఉన్నారు. ముగ్గురు బలమైన అభ్యర్థుల మధ్య రాంనగర్ డివిజన్‌లో తీవ్రమైన పోటీ ఉంది.
డివిజన్‌లో ప్రధాన సమస్యలివీ...
రాంనగర్ డివిజన్‌లో అనేక సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కలుషిత మంచినీరు, పురాతన కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థతో లీకేజీలు తీవ్రంగా ఉన్నాయి. ఎస్‌ఆర్‌టీ క్వార్టర్స్‌లో కొందరి పట్టాల సమస్య కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ఆర్టీసీ లేబర్ కాలనీ వాసుల సమస్య దాదాపు 300 మంది కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక నారాయణగూడ చౌరస్తా నుంచి ముషీరాబాద్ కేర్ ఆసుపత్రి వరకు గల ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది.
వి.శ్రీనివాస్‌రెడ్డి- టీఆర్‌ఎస్
ప్రచార సరళి: మొదటి నుంచి రాంనగర్ డివిజన్‌పై కన్నేసి పోటీకి దిగిన శ్రీనివాస్‌రెడ్డి ముందుగానే క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎదుటి పక్షంలోని యువకులను, ఆయా పార్టీల నాయకులను ఆకర్షించి పార్టీలో చేర్పించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత అన్ని పార్టీలకంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఎంపీ కవిత డివిజన్‌లో విస్తృత పర్యటన నిర్వహించారు. హోంమంత్రి నాయిని గల్లీ గల్లీ తిరుగుతూ అల్లుడి విజయం కోసం చెమటోడుస్తున్నారు.
బలాలు(+): గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయినికి తెరవెనుక ఉండి శ్రీనివాస్‌రెడ్డి అన్నీతానై వ్యవహరించారు. ప్రస్తుతం తానే పోటీ చేస్తుండటంతో గతంలో చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చింది. హోంమంత్రి నాయినికి అల్లుడు కావడం కూడా ఒక బలం. రాంనగర్‌పై పట్టు ఉండటం, ఇటీవల జరిగిన వీఎస్‌టీ ఎన్నికల్లో యూనియన్ అధ్యక్షునిగా ఎన్నికవడం కూడా కలిసొచ్చే అంశాలే.
బలహీనతలు(-): మూక్కుసూటిగా వ్యవహరించే శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నాయినితో పనిచేసిన సీనియర్ నాయకులు కొంతమంది అంత చనువుగా ఇమడలేక అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు మనస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆర్.కల్పనా యాదవ్ - కాంగ్రెస్
ప్రచార సరళి: కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కల్పనాయాదవ్ అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ మరోసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
బలాలు(+): రెండుసార్లు రాంనగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం. ఇక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఉండడం. డివిజన్‌పై మంచి పట్టు కలిగి ఉండడం. జనరల్ స్థానంలో బీసీ మహిళ కావడం కూడా కలిసొచ్చే అంశాలు.
బలహీనతలు(-): రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేయడంతో సహజంగానే వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడం ఆమెకు మైనస్. పోటీలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉండడం.
ఎం.ప్రభాకర్‌రెడ్డి - బీజేపీ
ప్రచార సరళి: ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి ఎం.ప్రభాకరరెడ్డి క్రమక్రమంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ సొంత క్యాడర్‌మీదనే ఆధారపడి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరిగానే అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.
బలాలు(+): గతంలో బాగ్‌లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం కలిసొచ్చే అంశం. బీజేపీ, టీడీపీల పొత్తు కూడా ఒకింత లాభదాయకంగా చెప్పొచ్చు.
బలహీనతలు(-): చివరి నిమిషంలో పార్టీ మారి బీజేపీ టికెట్ దక్కించుకోవడంతో ఆ పార్టీలో మొదటి నుంచి టికెట్ ఆశించిన వారు అసంతృప్తితో ఉన్నట్లు వినికిడి. టీడీపీ నాయకులు బాలరాజు గౌడ్ మినహా నాయకులు ఎవరూ సహకరించమని బహిరంగంగానే ప్రకటించారు. ఈ ప్రాంతంపై అంతగా పట్టు లేకపోవడం మైనస్ అనొచ్చు.