వన్య ప్రాణులు విలవిల!
► ఎండతీవ్రతతో అల్లాడుతున్న జీవాలు
► నీటి కోసం గ్రామాల్లోకి వచ్చేస్తున్న జంతువులు
► వేటగాళ్లు.. కుక్కల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వైనం
తీవ్రమైన ఎండలతో వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. అటవీ ప్రాంతంలో దప్పిక తీర్చుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్నాయి. గొంతె తడుపుకోవడానికి అడవుల నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఈ పరిస్థితిలో కుక్కల దాడిలో కొన్ని జంతువులు గాయపడుతుండగా.. మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. వీటిని సంరక్షించాల్సిన అటవీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పాలకొండ రూరల్: మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అడవుల్లో ఉండే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. తరిగిపోతున్న అడవులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు వన్యప్రాణులకు కొత్త కష్టాన్ని తెస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉండే నీటి వనరులు అడుగంటడంతో దాహార్తిని తీర్చుకోవడానికి మైదాన ప్రాంతాల్లోకి పలు వన్యప్రాణాలు వచ్చేస్తూ ఆపదను తెచ్చుకుంటున్నాయి. తాజాగా పాతపట్నం, వీరఘట్టం, బూర్జ మండలాల పరిధిలో జింకలు నీటి కోసం జనావాసాల్లోకి వచ్చేసి ప్రాణాపాయంలో పడ్డాయి.
జిల్లాలో.... ఏజెన్సీ మిళితమై ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 40 శాతం అటవీ ప్రాంతం ఉంది. సుమారు 40 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. పాలకొండ, పాతపట్నం, టెక్కలి, కాశీబుగ్గ, శ్రీకాకుళం అటవీ రేంజ్‌ల పరిధిలో పలు వన్యప్రాణులు జీవిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో అనుకూల పరిస్థితులు ఉండడంతో ఇతర దేశాలకు చెందిన అరుదైన పక్షులు కూడా సంతాన ఉత్పత్తి సమయంలో ఇక్కడకు చేరుకుంటున్నాయి. అయితే ఇటీవల అడవులను కొంతమంది అక్రమార్కులు నాశనం చేస్తున్నారు. విలువైన చెట్లను నరుక్కుపోతున్నారు. దీంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పరిస్థితి వన్యప్రాణులకు ఇబ్బందిగా మారింది.
పెరిగిన ఉష్ణోగ్రతలు...
గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో ఈసారి ఉష్ణోగ్రత్తలు నమోదు అవుతున్నాయి. గడిచిన నెల రోజులుగా కనిష్టంగా 33 డిగ్రీల నుంచి గరిష్టంగా 41 డిగ్రీల పైబడి నమోదు అవుతున్నాయి. దీంతోపాటు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. మైదాన ప్రాంతంలో సైతం నీటి వనరులు అడుగంటిపోవటం ఇందుకు నిదర్శనం. అటవీ ప్రాం తంలో ప్రస్తుత సీజన్‌లో నీటిజాడలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీనికితోడు వ్యన్యప్రాణుల సంరక్షణ, దాహార్తి తీర్చేందుకుఎటువంటి నిధులు ఈసారి మంజూరు కాలేదు. దీంతో జంతుజాతులు నీటి కోసం అల్లాడిపోతున్నాయి.
వెంటాడుతున్న సిబ్బంది కొరత
అటవీ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. కేవలం 60 శాతం సిబ్బందితో ఐదు రేంజ్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అటవీ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో కీలక బాధ్యత వహించే సహాయ పర్యవేక్షణాధికారులు (ఏబీవో)లు 36 మంది ఉండాల్సి ఉండగా 26 మందే ఉన్నారు. అలాగే సెక్షన్ అధికారులు 40 మంది ఉండాల్సి ఉండగా 12 మంది, ఫారెస్టు బీట్ అధికారులు 38 మందికి 22 మందే ఉన్నారు. దీంతో వీరు వన్యప్రాణుల సంరక్షణతోపాటు.. అటవీ సంపదను కూడా పూర్తిస్థాయిలో కాపాడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాలోకి మరో ఏడు ఏనుగులు ప్రవేశించడంతో అటవీ సిబ్బందికి కంటిపై కునుకు లేకుండా పోయింది.
సాల్ట్‌లీక్స్ ఏర్పాటు చేస్తాం
వన్యప్రాణుల నీటి అవసరాలు గుర్తించి సాల్ట్‌లీక్స్ (దాహార్తిని తీర్చేందుకు ఉప్పు ద్రవంతో ఉన్న గడ్డలు) రేంజ్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది కొరత వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. వన్యప్రాణులు, వాల్టా చట్టం కఠినంగా అమలు చేస్తూ అక్రమాలకు, వేటగాళ్లకు చెక్‌పెడతాం. నిఘా మరింత çపటిష్టం చేస్తున్నాం. – బి.జగదీశ్వరరావు, అటవీరేంజ్ అధికారి, పాలకొండ.