అసోంలో అంకమ్మరావును కలుసుకున్న కుటుంబసభ్యులు
*బోడో తీవ్రవాదుల చెర నుంచి విడుదలైన అంకమ్మరావు కుటుంబ సభ్యుల ఆనందం
*నూతన సంవత్సరంలో సంతోషమైన వార్త విన్నామన్న భార్య వాణి
*రెండు రోజుల్లో చీరాల చేరుకోనున్న అంకమ్మరావు
చీరాల : బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి బోడో తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న తొమ్మిదిరోజులు తర్వాత క్షేమంగా తిరిగి వచ్చాడు చీరాలకు చెందిన ఇంజినీర్ బత్తుల అంకమ్మరావు. మంగళవారం ఉదయం ఆయన్ని తీవ్రవాదులు విడుదల చేశారు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అసోం లో బొలినేని శీనయ్య నిర్మాణ సంస్థలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అంకమ్మరావు డిసెంబర్ 22 సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తీవ్రవాదుల చేతిలో కిడ్నాప్ అయిన విషయం విదితమే.
అంకమ్మరావు కిడ్నాప్‌నకు గురయ్యాడని తెలుసుకున్న భార్య వాణి, కుటుంబ సభ్యులు అప్పటి నుంచి మనోవే దనకు గురయ్యారు. ఆయన్ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకున్నారు. సంఘటనపై స్పందించి చర్యలు చేపట్టాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. ఎట్టకేలకు తీవ్రవాదులు అంకమ్మరావును విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన చీరాలకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎంతో సంతోషంగా ఉంది
-బత్తుల వాణి, ఇంజినీర్ భార్య
నా భర్త బోడో తీవ్రవాదుల చెర నుంచి విడుదలయ్యాడన్న వార్త ఎంతో సంతోషాన్నిచ్చింది. నూతన సంవత్సరంలో సంతోషకరమైన వార్త విన్నాను. భగవంతుడే నా భర్తను కాపాడాడు. పిల్లలతో, నాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కిడ్నాప్‌నకు గురైన నాటి నుంచి మీడియా, పోలీస్, రెవెన్యూవారు ఎంతో సహకారం అందించారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.