సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. 18 ఏళ్ల హిందూ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు. పూజా ఓద్ అనే యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. పూజా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది.
పాకిస్తాన్లో ఇటువంటి ఘటనలు కొత్తదేం కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. పాకిస్తాన్ మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన పలువురిని బలవంతంగా అపహరించి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతియేడు ఈ తరహా ఘటనలు చూస్తున్నామని ఆవేదన చెందారు.
మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేసేలా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందూ కమ్యూనిటీ 1.60 శాతం, సింధ్ ప్రావిన్స్‌లో 6.51 శాతం ఉన్నట్లు ఆ దేశ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment