త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటిన్లు: నారాయణ
తక్కువ ధరకే ఆహార పదార్థాలను అందించేందుకు త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రులు పరిటాల సునీత, నారాయణ తెలిపారు.
హైదరాబాద్: తక్కువ ధరకే ఆహార పదార్థాలను అందించేందుకు త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రులు పరిటాల సునీత, నారాయణ తెలిపారు. తొలివిడతగా నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో 15, తిరుపతిలో 5, అనంతపురంలో 5, గుంటూరులో 10 క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు తెలిపారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రిల వద్ద అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని, పథకం ఎప్పుడనేది రేపటి కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని నారాయణ మీడియాకు వెల్లడించారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు. ఏపీలో అన్నా క్యాంటిన్ల పథకం సాధ్యాసాధ్యాలపై పౌరసరఫరాల శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.