
ప్రతి ఇంటికీ మంచినీరివ్వాలి
బుచ్చిరెడ్డిపాళెం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికీ మంచినీరివ్వాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పంచేడులో బుధవారం జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి తాగునీరివ్వాలని చూస్తున్నారని, అలా కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో అక్కడి సీఎం కేసీఆర్ దీని పై సర్వే జరుపుతున్నారని వివరించారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, నీటిబొట్టు దొరకని మెట్ట ప్రాంతాలెన్నో ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బారినపడి వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కృష్ణా, తుంగభద్ర, వంశధార, గోదావరి, పెన్నా, తదితర నదుల నుంచి తాగునీటిని ప్రతి ఇంటికీ వెళ్లేలా చూడాలని కోరారు.
2015 నాటికి పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 2019 నాటికి రూ.2 లక్షల కోట్లతో 13 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలన్నదే ప్రధానమంత్రి మోడీ లక్ష్యమని తెలిపారు. అందరూ చదువుకోవాలని, మేధోవంతులై దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని కాంక్షించారు.
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి
అర్హుల పింఛన్లను తొలగించారని, వారిని గుర్తించి తిరిగి ఇప్పించాల్సిందిగా ఎంపీ మేక పాటి రాజమోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీపీ హయాంలో రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200 చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దేనని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కన్నీటి గాధలను కళ్లారా చూసి వైఎస్సార్ చలించిపోయారన్నారు. ఈ కారణంగానే పింఛన్‌ను రూ.200కు పెంచి వారిని ఆదుకున్న మహానుభావుడు వైఎస్సార్ అన్నారు. చంద్రబాబునాయుడు తన ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేశారు.
వ్యక్తిగత, పరిసరాల
పరిశుభ్రతను పాటించాలి
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్డికి కేటాయించిన రూ.12 వేలు చాలడం లేదన్న విషయం తెలిసిందన్నారు. అందుకే ఎంపీ మేకపాటి ఆ మొత్తాన్ని రూ.14 వేలకు పెంచాల్సిందిగా లేఖ ద్వారా ప్రధానిని కోరారన్నారు.
వసతిగృహాల్లో కూడా పరిశుభ్రతపై దృష్టి సారించి రూ.పది లక్షలను కేటాయించామన్నారు. డ్రెయి న్లు, వసతిగృహంలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. ట్యూ టర్లను నియమించి విద్యార్థులను తీర్చిదిద్దనున్నట్లు తెలి పారు. వవ్వేరు బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ రొండ్ల జయరామయ్య, సర్పంచ్ రమణమ్మ, నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, తహశీల్దార్ రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.