- తీరనున్న భూసమస్య
- {పభుత్వ ఉత్తర్వులు జారీ
- ఆట స్థలం, ఇతర సదుపాయాల కల్పన
నూజివీడు, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కలల స్వప్నమైన ట్రిపుల్‌ఐటీ బాలారిష్టాలను అధిగమించబోతుంది. పదోతరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులను మరింత ప్రతిభాంవంతులుగా తీర్చిదిద్ది వారికి ఉన్నత విద్యాభ్యాసం అందించాలనే సంకల్పంతో అప్పట్లో మహానేత వైఎస్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యాలయాల స్థాపనకు అంకురార్పణ చేశారు.
అందులో భాగంగానే నూజివీడులోనూ టిపుల్‌ఐటీని స్థాపించారు. దాదాపు 7 వేల మంది విద్యార్థులు చదువుతున్న ఈ ట్రిపుల్‌ఐటీని ఆరేళ్లుగా భూ సమస్య పట్టిపీడిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీకి మరో 113.60 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూసేకరణను పూర్తిచేసి ట్రిపుల్‌ఐటీకి అప్పగించినట్లయితే విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నూజివీడు పరిధిలోని సర్వే నెంబరు 1061/4 నుంచి 1061/17 వరకు ఉన్న 113.60 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రథమంలో వంద ఎకరాల్లోనే....
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి నూజివీడులో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేయడంలో ప్రముఖపాత్ర వహించిన మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు స్థలం కోసం అప్పట్లో తీవ్రంగా కృషిచేశారు. ట్రిపుల్‌ఐటీని నూజివీడులో ఏర్పాటు చేయడం ద్వారా నూజివీడుకు ప్రపంచపటంలో మంచి గుర్తింపు వస్తుందని, నూజివీడు దినదినాభివృద్ధి చెందుతుందని, కోస్తా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కల్గిన పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని రైతులకు వివరించి తమ భూములను ఇచ్చేలా ఒప్పించి వంద ఎకరాలను సేకరించి ఇచ్చారు. దీంతో నూజివీడులోనే ట్రిపుల్‌ఐటీని నెలకొలిపారు. అయితే బాసరలో 400 ఎకరాలు, ఇడుపులపాయలో 300 ఎకరాలను ప్రారంభంలోనే కేటాయించి ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేశారు.
నూజివీడులో ప్రస్తుతం ఆ వంద ఎకరాల్లో అప్పట్లో ఏర్పాటు చేసిన అరకొర తరగతి గదుల్లోనే పీయూసీ విద్యార్థులకు, నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్‌లలో ఇంజినీరింగు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. అలాగే బాలికలకు, బాలురకు హాస్టల్ భవనాలు నిర్మించారు. అయితే ఈ ఆరేళ్లుగా విద్యార్థులు ఆటలు ఆడటానికి ఆటస్థలం కానీ, ఆడిటోరియం గానీ, ఇంజినీరింగు బ్రాంచిలకు డిపార్ట్‌మెంట్ భవనాలు గానీ, సెంట్రల్ లైబ్రరీగానీ లేవు. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే కనీసం మరో 120 ఎకరాలు అవసరమవుతాయని ఆర్జీయూకేటీ వీసీ రాజకుమార్ గతేడాది ఫ్రిబవరి నెలలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
సదుపాయాల కల్పన....
ట్రిపుల్‌ఐటీకి ప్రస్తుతం సేకరించనున్న 113ఎకరాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇంజినీరింగు విద్యార్థులకు సెంట్రల్ లైబ్రరీ, ప్రతి బ్రాంచికి డిపార్ట్‌మెంటల్ భవనాలు, పరిపాలన భవనం, కాన్ఫరెన్స్‌హాల్, ఆడిటోరియం, పరిశోధనల కోసం ప్రత్యేక విభాగం భవనాలు నిర్మిస్తారు. అలాగే బాస్కెట్‌బాల్, వాలీబాల్, షటిల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్‌పూల్, వ్యాయామశాలలతో పాటు క్రికెట్ ఆడుకోవడానికీ ఆటస్థలం అందుబాటులోకి వస్తుంది.